- ఎన్నికలకు కరోనా వాక్సినేషన్ అడ్డుకాదన్న నారాయణ
- విభేదాలను మరిచి ముందుకు సాగాలని ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వినతి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు సహకరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సూచించారు. ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శించాలని కోరారు. ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మధ్య తలెత్తిన విభేదాలతో ఎన్నికలను వాయిదా వేయడం సరికాదన్నారు. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ తో ప్రభుత్వం సామరస్య పూర్వక ధోరణితో వ్యవహరించాలన్నారు.
కోర్టు సూచనలు పాటించండి
ఎన్నికల నిర్వహణపై న్యాయస్థానం యిచ్చిన సలహా పాటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. కరోనా వాక్సిన్ పేరుతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వ పెద్దలు చెప్పడం ఎంత మాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయని ఉదహరించారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి , కేరళ, కశ్మీర్, రాజస్థాన్ లలో స్థానిక సంస్థల ఎన్నికలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికలు జరిగిన నేపద్యంలో ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు జరిపించడం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. లాక్ డౌన్ సమయంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని నారాయణ అభిప్రాయపడ్డారు. ఎన్నికల వాయిదా అంశంపై సీఎంను సంప్రదించలేదనే సాకు చూపించడం సరికాదన్నారు.
బెట్టు వీడాలని హితవు
ప్రభుత్వ ప్రతినిధులతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చించి సుహృద్భావ వాతావరణంలో ఎన్నికల నిర్వహణ చేపట్టాలని నారాయణ అన్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఇగోలకు పోవద్దని సూచించారు..స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ కు సహకరించడం ప్రభుత్వ బాధ్యత కనుక సామరస్యంగా ఇరు వర్గాలు సమస్యను పరిష్కరించుకుని ఎన్నికలు జరిగేలా చూడాలని ప్రభుత్వానికి, ఎన్నికల కమీషన్ కు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు