- పర్యాటక కేంద్రంలో అభివృద్ధికి అవకాశాలు
- బడా కార్పొరేట్ సంస్థలు పూనుకోవాలి
- ప్రభుత్వాలు మరింతగా పట్టించుకోవాలి
తెలుగువారి వైభవ చరితకు దర్పణం, విజయనగర రాజుల పరిపాలనా ప్రాభవానికి గోపురం వంటి లేపాక్షి మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. అచటి వీరభద్రాలయానికి విశిష్ట ప్రాచుర్యం కలిగించే శుభయత్నానికి శుభముహూర్తం నిర్ణయించారు. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ, ఇండియా టూరిజం సంయుక్తంగా నేటి నుంచి రెండు రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ‘లేపాక్షి వీరభద్రాలయ వైభవం -యునెస్కో శాశ్వత గుర్తింపు ఆవశ్యకత’ అనే అంశంపై ఈ సదస్సు సాగనుంది. దశదిశల నుంచి చరిత్రకారులు, పర్యాటక రచయితలు, నిపుణులు, పాత్రికేయులు 300మందికి పైగా పాల్గొంటున్నట్లు సమాచారం. ఆలయ వైభవంపై ఇప్పటికే పలువురు చరిత్రకారులు పత్రాలను సమర్పించినట్లు తెలుస్తోంది. ఇవి మంచి అడుగులు. కాలగమనంలో నిలిచి వెలిగే చిత్ర, శిల్పకళా సౌందర్య మూర్తిమత్వాన్ని ముందుతరాలకు కానుకగా అందించడం, కలకాలం ఆ ప్రాభవం మసకబారకుండా చూడడం మనందరి బాధ్యత. ఇప్పటికే ఎన్నో వారసత్వ కట్టడాలు కూలిపోయాయి. కొన్ని కళావిహీనంగా మారిపోయాయి. మన వారసత్వం ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయింది. అపూర్వమైన, అనంతమైన ఆ సంపద దొంగతనాలకు, దోపిడీకి గురైంది. అనేక ఆస్తులు అన్యాక్రాంతమై పోయాయి. ముఖ్యంగా దేవాలయాల ఐశ్వర్యాన్ని అందినకాడికి అందరూ కొల్లగొట్టేశారు. ఇప్పటికీ ఆ పాపపు పర్వం కొనసాగుతూనే ఉంది.
Also read: సరిహద్దుల్లో మళ్ళీ ఘర్షణ
చేయవలసింది చాలా ఉంది
సభలు చేసి సంబరపడిపోవడం సరికాదు. సకాలంలో స్పందించాలి. అది కొరవడే మన వారసత్వానికి దుర్గతి పట్టింది. సరే! అనంత కాల పయనంలో కొన్నింటికి మళ్ళీ పూర్వ వైభవం దక్కుతూ వుంటుంది. ఈ తరుణంలో, లేపాక్షికి అట్లాంటి ప్రాభవం పట్టాలని అందరం బలంగా కోరుకుందాం. దశాబ్దం క్రితం 2012లో అప్పటి ప్రభుత్వం లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఘనకీర్తిని చాటి చెప్పింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ కాలంలో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు సార్లు ఉత్సవాలను నిర్వహించి లేపాక్షి ఘనతను ప్రపంచానికి మరోమారు చాటి చెప్పి పుణ్యాన్ని మూటగట్టుకున్నారు. ‘జఠాయువు థీమ్ పార్క్’ పేరుతో పక్షి విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆ ప్రాంతానికి కొత్త శోభను అందించడంలో బాలకృష్ణ పాత్ర ఎన్నదగినది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు బసచేయడానికి పర్యాటక శాఖ అతిధి గృహాన్ని నిర్మించింది. ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ కూడా ప్రారంభమైంది. వీటన్నిటి ప్రభావంతో లేపాక్షి ఆలయానికి ఆ మధ్య మార్చిలో యునెస్కో నుంచి వారసత్వ కట్టడంగా తాత్కాలిక గుర్తింపు వచ్చింది. ఇది చాలదు. శాశ్వత గుర్తింపు రావాలి. శాశ్వత గుర్తింపు వస్తే నిధులు, ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం, తద్వారా మన ప్రతిష్ఠ పెరగడమే కాక పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని హిందూపురంకు దగ్గరగా ఉన్న లేపాక్షి ఒకప్పుడు గొప్ప చరిత్రకు నెలవుగా ఉండేది. గొప్ప శైవక్షేత్రం.
Also read: అందరి చూపూ ఆయుర్వేదం వైపు
ప్రభావతీ ప్రద్యుమ్నం ప్రశస్తి
విజయనగర రాజుల ముఖ్య వాణిజ్య కేంద్రంగా, చిత్ర,శిల్ప కళా సౌందర్య ధామంగా లేపాక్షి పొందిన ఘన గౌరవం చరిత్ర విదితం.’లేపాక్షి నంది’ ఏకశిలా సౌందర్య శోభితంగా బహుప్రసిద్ధం. వీరభద్రాలయం మహిమాన్విత మాననీయ చరితం. అచ్చటి చిత్రలేఖనా సొగసుసోయగాలను పింగళి సూరనకవి తన ‘ప్రభావతీ ప్రద్యుమ్నం’ కావ్యంలో కన్నుల గట్టినట్లు బొమ్మగట్టించాడు. లేపాక్షి చిత్రసీమలో అప్పటి ఆచార వ్యవహారాలన్నీ ప్రతిబింబిస్తాయి. వీరభద్రస్వామి దేవాలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. లేపాక్షిలో ఇంకా అనేక ఆకర్షణలు, ఘన చరితకు ఆనవాళ్లు ఉన్నాయి. వీటన్నిటిని రక్షించుకోవాలి. ప్రస్తుతం ఈ ప్రాంతం సరికొత్త శోభతో అలరారుతోంది. ఇటీవలే శ్రీ సత్యసాయి జిల్లా క్రిందకు వచ్చింది. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు, దిగ్గజ కార్పొరేట్ సంస్థలు అందరూ వారసత్వ సంపదను కాపాడడంలో, పెంచి పోషించడంలో ముఖ్య భూమిక పోషించాలి. ఈ సదస్సుల పుణ్యమా అని త్వరలో లేపాక్షికి యునెస్కో శాశ్వత గుర్తింపు లభిస్తుందని ఆకాంక్షిద్దాం. దానిని సాధించడానికి కావాల్సిన అన్ని కార్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుందని ఆశిద్దాం. లేపాక్షి మన భారతీయ ప్రాభవం, మన ఉమ్మడి ఐశ్వర్యం.
Also read: భవిష్యత్తు డిజిటల్ మీడియాదేనా?