- ఎన్టీఆర్ రద్దు చేస్తే, పునరుద్ధించిన వైఎస్ఆర్
- మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన జగన్
- కేసీఆర్ కూతురుకు కలిసి వచ్చిన శాసన మండలి
శాసన మండలి అంటే వివిధ రాష్ట్రాల్లో మేధావులు, విద్యాధికుల తో ఏర్పాటయ్యే ప్రజా ప్రతి నిధుల సభ! మన దేశంలో 29 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసన మండలి ఉంది. మిగతా రాష్ట్రాల్లో కొన్నిటిలో రద్దు చేశారు. చాలా రాష్ట్రాలు ఈ సభను అవసరం లేనట్టు తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సభ ఉండాలో వద్దా అనే విషయాన్ని లోక్ సభ కు తీర్మానం చేసే విశేష అధికారం ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఇష్టానుసారం ఈ మండలిని ఉపయోగించు కుంటున్నాయి.
ఎన్టీఆర్ ఆగ్రహం:
ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సి ఏం గా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు శాసన మండలి అడ్డుపడుతుంది అని ఆగ్రహం తో రద్దు చేస్తే కాంగ్రెస్ ముఖ్య మంత్రులు చెన్నారెడ్డి , వై ఎస్ ఆర్ లు శాసన మండలిని పునరుద్ధరించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనకరంగా భావించే బిల్లు లు శాసనసభలో ప్రవేశ పెట్టినప్పుడు ఆ బిల్లులు ఎగువసభ (శాసన మండలి) కూడా ఆమోదిస్తే చట్ట రూపం దాలుస్తాయి. ఎన్టీఆర్ హయాంలో ఏ తీర్మానాలు ప్రవేశ పెట్టినా ఎగువ సభలో మెజారిటీ గల కాంగ్రెస్ ఆ చట్టాన్ని వ్యతిరేకించేది. దాంతో ఎగువ సభ వల్ల రాష్ట్ర ఖజానా పై విపరీత మైన భారం పడుతుందని ప్రజల చే నేరుగా ఎన్నికైన ఎమ్మేల్యేలు ఒక చట్టాన్ని రూపొందించి ప్రజల కోసం తీసుకువస్తుంటే దొడ్డిదారిన వచ్చిన శాసన మండలి సభ్యులు వ్యతిరేకించడం ఏమిటని ఎన్టీఆర్ శాసన మండలిని రద్దు చేశారు.
Also Read: తొలి దశలో మాదే పై చేయి
శాసనమండలి పాత్ర ఏమిటి?
విద్యాధికులు , కళాకారులు , సాహితీ వేత్తలు, అనుభవజ్ఞులైన చదువుకున్న రాజకీయ నాయకులు ఎగువ సభలో ఉండి శాసనసభలో ప్రవేశపెట్టే చట్టాలను వారి విజ్ఞానం తో చూసి అమోదించాలి తప్ప అన్నింటినీ చట్టం చేయకుండా అడ్డుకోవడం ఏమిటని అలనాడు ఎన్టీఆర్ శాసనమండలినీ రద్దు చేశారు. శాసన మండలి రద్దు, పునరుద్దరణ కూడా అసెంబ్లీ లో మూడింట రెండు వంతుల మంది మెజారిటీ తో ఆమోదించి, లోక్ సభ, రాజ్యసభ రాష్ట్ర తీర్మానాన్ని పరిశీలించి, అక్కడ కూడా మెజారిటీ తీర్మానం చేస్తే చివరికి రాష్ట్రపతి ముద్ర ఉంటే తప్ప ఈ ప్రక్రియకు తుది రూపు రాదు. ఎన్టీఆర్ రద్దు చేసిన శాసనమండలి పునరుద్ధరించాలని తీర్మానం ఏళ్ల తరబడి లోక్ సభలో పెండింగ్ లో ఉండి చివరకు వై ఎస్ ఆర్ హయాంలో పునరుద్ధరించారు. విచిత్రం ఏమిటంటే వై ఎస్ ఆర్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రిగా కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర ప్రదేశ్ లో శాసనమండలి చైర్మెన్ తో వచ్చిన విబేధాల వల్ల శాసన మండలిని రద్దు చేయాలని తీర్మానం చేయడం విశేషం.
మండళ్ళు ఎట్లా ఏర్పడతాయి:
అసలు ఈ శాసన మండళ్లు ఎలా ఏర్పడతాయో చూద్దాం. రాష్ట్ర శాసనసభ సభ్యత్వంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉండకూడదు! అయితే, దీని పరిమాణం 40 మంది సభ్యుల కంటే తక్కువ ఉండకూడదు. ఈ సభ్యులు రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ నూ, డిప్యూటీ ఛైర్మన్లనూ ఎన్నుకుంటారు.
ఎన్నిక ప్రక్రియ ఏమిటి?
ఎంఎల్ సీలను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా కౌన్సిల్స్ వంటి స్థానిక సంస్థల సభ్యులు మూడవ వంతు మందిని ఎన్నుకుంటారు. మూడవ వంతును రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. సాహిత్యం, విజ్ఞానం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవలు వంటి రంగాలలో విజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్న వ్యక్తుల నుండి ఆరవ వంతు గవర్నర్ నామినేట్ చేస్తారు. ఆ రాష్ట్రంలో నివసిస్తున్న మూడేళ్ల గ్రాడ్యుయేట్లు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా మాధ్యమిక పాఠశాలల కంటే తక్కువ కాకుండా రాష్ట్రంలోని విద్యా సంస్థలలో బోధనలో కనీసం మూడేళ్ళు గడిపిన ఉపాధ్యాయులు పన్నెండవ వంతు ఎన్నుకోబడతారు.
Also Read: పంచాయతీ వ్యవస్థలో మహిళా సాధికారిత పేరుకే! పురుషులదే పెత్తనం!
ముఖ్యమంత్రులు కూడా కావచ్చు:
ఇలా శాసన సభలో స్థానం దొరకని వారికి నియోజక వర్గాల్లో సమీకరణలో శాసన సభ సీటు కేటాయించలేని పరిస్థితుల్లో ఆయా రాజకీయ పార్టీలు పునరావాసం కల్పించడానికి శాసనమండలి ఆశ చూపిస్తున్నారు! ఎమ్మెల్యేలతో సరి సమానంగా అధికారం ఉండే శాసన మండలి సభ్యులు రాష్ట్ర మంత్రులు కూడా కావచ్చు. ముఖ్యమంత్రులు కూడా కావచ్చు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భవనం వెంకటరామ్ శాసనమండలి సభ్యుడిగానే కాగలిగారు. శాసన మండలి సభ్యులు గౌరవ ప్రదంగా రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కేవలం ప్రజా సంబంధమైన విమర్శలు ప్రభుత్వాల పనితీరును మెరుగు పరిచేలా సూచనలు సలహాలు ఇవ్వాలి, కానీ దానికి విరుద్ధంగా శాసన మండలి వ్యవహారాలు ఉంటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండిపెండెంట్ గా పార్టీ రహితంగా శాసన మండలి ఎన్నిక ప్రక్రియ ఉండాలనే డిమాండ్ ఉంది…
రాజకీయ పరోక్ష వేదికలు:
ఇవన్నీ ఒక రాజకీయ పరోక్ష వేదికలు అయ్యాయని ఆయా రాష్ట్ర ముఖ్య మంత్రులు శాసన మండలి పట్ల విముఖత చూపుతున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో మాత్రమే శాసన మండలి సభలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దుకు అసంబ్లీ చేసిన ప్రతిపాదన కార్య రూపం దాల్చవచ్చు. శాసనమండళ్ళు అనవసరమైనవని విమర్శకుల వాదన. ఇది రాష్ట్ర బడ్జెట్‌పై భారంగా పరిగణించబడుతుందనీ, చట్టాలను ఆమోదించడంలో జాప్యానికి కారణమవుతుందనీ వారు అంటున్న మాటలు అలాగే ఓడిపోయిన నాయకులకు సీటు పొందడానికి శాసనమండలి సహాయపడుతుందనే ఆరోపణ ఉండనే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయి శాసన మండలి సభ్యులు కావడం పట్ల విమర్శలు ఉన్నాయి. ఓటర్లు తిరస్కరించిన వారు పరోక్షంగా శాసన మండలికి రావడం విమర్శలకు కారణమయింది.
Also Read: సోషల్ మీడియా సామాజిక విప్లవమా?సమస్యల సమాహారమా?
ముఖ్యమంత్రుల ఇష్టానుసారమే:
ఇది ప్రజాస్వామ్య భావనను తగ్గిస్తుంది. నాయకులు పరోక్షంగా ఎన్నుకోబడతారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇక రాష్ట్ర శాసనమండలి ప్రాధాన్యత కూడా అయా రాష్ట్ర ముఖ్య మంత్రుల ఇస్టానుసారమే ఉంటుంది. శాసనమండలి (ఎంఎల్‌సి) లో సభ్యత్వం పొందడానికి, ఆయా వ్యక్తి భారత పౌరుడిగా ఉండాలి, కనీసం 30 సంవత్సరాలు వయసు ఉండాలి. శాసన మండలికి పోటీ చేసేవారు ఓటరు జాబితాలో రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. అతను/ ఆమె ఒకే సమయంలో పార్లమెంటు సభ్యుడుగా, రాష్ట్ర శాసనసభ సభ్యుడు గా ఉండకూడదు. ఎంఎల్‌సీల పదవీకాలం ఆరేళ్లు. రాష్ట్ర శాసనమండలి సభ్యులలో మూడింట ఒకవంతు ప్రతి రెండు సంవత్సరాల తరువాత పదవీ విరమణ చేస్తారు. ఈ ఏర్పాటు భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభకు సమానంగా ఉంటుంది.