Sunday, December 22, 2024

పైప్ లైన్ నిర్మిద్దాం!

సంపద సృష్టిద్దాం – 10

ఇది నా సొంత కథ కాదు. బర్క్ హెడ్జెస్ చెప్పిన కథ. ప్రపంచమంతా చెవిఒగ్గి విన్న కథ. దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల్లోకీ అనువాదమైన కథ. తెలుసుకున్న ప్రతి ఒక్కరూ మరో పదిమందికి చెప్పాలనిపించే గొప్ప కథ. కథ పేరు పైపులైన్ కథ. కోటీశ్వరులు కావాలనుకున్న సాహసవీరులు తప్పనిసరిగా తమ నరనరాన జీర్ణించుకోవలసిన కథ.

Also read: తలపోతల వలబోతలు

బ్రూనో, పాబ్లో యువకులిద్దరూ మంచి స్నేహితులు. జీవితం పట్ల మమకారం ఉండడమే కాక పెద్దపెద్ద కలలు కూడా కనేవారు. ఒకరోజు అటువంటి అవకాశం వాళ్లను వెతుక్కుంటూ వచ్చింది. గ్రామస్తులంతా వారికి ఒక పని కల్పించారు. సమీపంలో గల నదినుంచి గ్రామానికి అవసరమైన నీటిని తోడుకుని వచ్చి, ఊరి మధ్యలోనున్న తొట్టెలో నింపాలి. ఇద్దరూ చెరో రెండు బకెట్లు తీసుకుని హుషారుగా నదికెళ్లి బకెట్లతో నీళ్లు మోసుకొచ్చి, తొట్టె నింపటం మొదలుపెట్టారు. ఊరి పెద్దలు వాళ్లకి బకెట్ కు పది పైసలు చొప్పున లెక్కకట్టి డబ్బులు ఇచ్చేశారు. బ్రూనో నిజంగానే సంతోషించాడు. మన కలలు నిజం చేసుకునే అదృష్ట సమయమని పొంగిపోయాడు. పాబ్లోకి అంత ఉత్సాహంగా అనిపించలేదు. వారం రోజులకే బకెట్లు మోసి మోసి, చేతులు బొబ్బలెక్కాయి. నడుము లాగేస్తోందని భయపడ్డాడు. నది నుంచి ఊళ్లోకి నీరు తీసుకురావడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముందని ఆలోచించాడు.

Also read: విధాతలు మీరే!

నిరంతర ఆదాయ మార్గం

బ్రూనో దగ్గరకు వెళ్లి తన ఆలోచన పంచుకున్నాడు. “రోజూ చేతులు పడిపోయేట్టు బకెట్లు మోయడం కష్టం. అదే నదినుంచి మన గ్రామానికి పైపులైన్ వేయగలిగితే డబ్బుకు డబ్బు రావడంతో పాటు మనకు శ్రమ తప్పుతుంది కదా” పాబ్లో విన్నవించుకున్నాడు. బ్రూనో ఒక్కసారి ఉలిక్కిపడి, “నీకెమన్నా పిచ్చెక్కిందా? పైపులైనా?” అన్నాడు. అంతటితో ఆగక “మనకీ ఊరిలోనే మంచి ఉద్యోగం వచ్చింది. వారానికి రెండు రోజులు శెలవులు. మంచి ఆదాయం. నెల తిరిగేసరికి డబ్బులు మిగిల్చి ఏది కావలిస్తే అది కొనుక్కోవచ్చు. పైపులైనులాంటి జరగని పనుల గురించి నాతో మాట్లాడకు” అని కోపం సంబాళించుకుని చెప్తాడు. పాబ్లో నిరుత్సాహపడకుండా బ్రూనోకి తన పైప్ లైన్ ఆలోచన వివరంగా చెప్తాడు. బ్రూనో ససేమిరా అనడంతో తన రోజులో కొంత సమయం, వారాంతాల్లోనూ తన పైప్ లైన్ నిర్మిస్తుండేవాడు. పైప్ లైన్ అడ్డులేకుండా వెళ్లడానికి రాళ్లను పేల్చాడు. గుంతలు తవ్వాడు. కొన్ని చోట్ల కొత్త బాటలు వేశాడు. ఈ పనిలో పడి తక్కువ బకెట్లు మోయటంవల్ల బ్రూనో కంటె తక్కువ ఆదాయం వచ్చేది. పైప్ లైన్ నిర్మించటం తేలిక కాదు. సంవత్సరం పైనే పడుతుందని అంచనా వేశాడు. ఒకసారి పైప్ లైన్లో నీళ్లు రావడం మొదలైతే తనెంత సుఖపడవచ్చో తలచుకుని, అన్ని కష్టాలు తట్టుకుని పైపైన్ వేస్తూండే వాడు.

Also read: ఇస్తుంటే తీసుకుంటాం..

పాబ్లోని చూడగానే గ్రామస్తులు ‘పైప్ లైన్ మాన్” అని ఎగతాళి చేసేవారు. బ్రూనో తన ఎక్కువ సంపాదనతో కొత్తకొత్త వస్తువులు కొనేవాడు. కుర్రకారంతా అతడి వెనకే తిరిగేవారు. మంచి ఫ్యాషన్ దుస్తులు వేసుకునేవాడు. అందరూ బ్రూనోగారూ అని పిలిచేవారు. ప్రస్తుతం చిన్న చిన్న కష్టాలు ఓర్చుకుంటే కలకాలం నిలిచే పెద్ద ఫలితాలు సాధించవచ్చని పాబ్లో తనకి తాను చెప్పుకునేవాడు. రోజులూ, వారాలూ, నెలలూ ఎవరికోసం ఆగకుండా గడిచిపోయాయి. చూస్తుండగానే పాబ్లో కల సగం సాకారమైంది. నదినుంచి సగం దూరానికి పైపైన్ పూర్తి చేశాడు. అంటే సగం దూరం మాత్రమే నడిచి నీళ్లు పట్టి బకెట్లతో గ్రామతొట్టెలో పోసేవాడు. ఆదాయం నెమ్మదిగా పెరగసాగింది. ఆదా చేసుకున్న సమయంలో మిగిలిన పైప్ లైన్ నిర్మాణం మీద దృష్టి పెట్టాడు. మధ్యమధ్యలో బ్రూనోను చూస్తుండే వాడు. బ్రూనో భుజాలు వంగిపోయాయి. నడకలో వేగం తగ్గింది. కోపం పెరిగింది. కల్లుపాకలో గడిపే సమయం పెరిగింది. అందరూ ‘బకెట్ల బ్రూనో’ అని వెక్కిరించేవారు.

Also read: మనీ పర్స్ చూశారా!

పాబ్లో మాత్రం చివరికి అతికష్టం మీద నదినుంచి గ్రామానికి పైప్ లైన్ పూర్తి చేశాడు. ఎవరూ మోయకుండానే నేరుగా నది నుంచి పైపుద్వారా నీళ్లు గ్రామతొట్టెలోనికి చేరుతున్నాయి. ఇక బకెట్లతో నీరు మోసేవారి అవసరం లేకపోయింది.

అడుగు – నమ్ము – పొందు

పాబ్లో పనిచేసినా, చేయకపోయినా నీళ్లు, వాటితో పాటు డబ్బూ వస్తూనే ఉంటుంది. అతను తింటున్నా. పడుకున్నా. అసలు ఉన్నా లేకపోయినా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఎక్కువ నీరు దొరుకుతోంది కాబట్టి, ప్రజలు నీటి అధిక వినియోగానికి అలవాటు పడ్డారు. దాంతో పాబ్లో ఆదాయం రోజురోజుకూ అతనేం చేసినా చేయకపోయినా పెరుగుతునే ఉంది. బకెట్లు మోయకుండానే పాబ్లో డబ్బు సంపాదిస్తున్నాడు. బకెట్లు మోయించుకునే వాళ్లు లేక బ్రూనో పస్తులుంటున్నాడు. మని చేయకున్నా పాబ్లోకు డబ్బు వస్తుంది. చేద్దామన్నా బ్రూనోకి పనిలేదు. అయితే అక్కడితో పాబ్లో సంతప్తి చెందలేదు. తన పనిని గ్రామాన్ని దాటి విస్తరించాలనుకున్నాడు. బ్రూనోను సాయమడిగాడు. అప్పటికే సిగ్గుతో కుచించుకుపోతున్న బ్రూనో వెన్ను నిమిరి, పైప్ లైన్ ఎలా వేయాలో నేర్పుతానని మాటిస్తాడు. బ్రూనో నేర్చుకున్న తరువాత మరింతమందికి ఇదే పని నేర్పడం ద్వారా దేశమంతా మన పైప్ లైన్లు ఉంటాయని, తద్వారా నిరంతర ఆదాయం సమకూర్చుకోవచ్చని చెప్తాడు. పైప్ లైన్ విశ్వరూపం బ్రూనోకు తెలిసింది. నవ్వుతూ పాబ్లోతో చేతులు కలుపుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పాబ్లో, బ్రూనో లిద్దరూ రిటైరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారి పైపైన్ల ద్వారా వారికి నిరంతరాదాయం వచ్చి పడుతూనే ఉంది. అప్పుడప్పుడూ స్నేహితులిద్దరూ ఇంకా బకెట్లు మోస్తున్న వాళ్లను చూసేవాళ్లు. ‘ఇంకా ఎన్నాళ్లిలా బకెట్లు మోస్తారు, మీకు కూడా పైపైన్ వేయటం నేర్పిస్తాం. రండి’ అని అడిగితే కొంతమంది మాత్రమే వచ్చేవారు. ఎక్కువ మంది మాత్రం వచ్చేవారు. కాదు. వీరిని కిందినుంచి పైదాకా వింతగా చూసి, రకరకాల కుంటిసాకులు, వంకలు చూపుతూ బకెట్లు మోయడానికే పోయేవారు.

Also read: ఈజీమనీకి స్వాగతం!

దుప్పల రవికుమార్

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles