ఫొటో రైటప్: తాము పెంచిన జీడి మామిడి తోట వద్ద కొందు ఆదివాసీ దంపతులు గెమ్మెలి బాలరాజు, కుమారి
“చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని అధికార కుర్చీలో వున్నవారు అప్పుడప్పుడు జోక్ చేస్తూవుంటారు. అధికారంలో వున్న వారు చట్టంతో తమకు కావలసిన పని చేయించుకుoటున్నారని పత్రిపక్షంలో వున్నవారు ఆరోపణ చేస్తూ వుంటారు. వచ్చే ఎన్నికలలో పాత్రలు అటు నుండి ఇటు మారవచ్చు కాని విషయం/ ఆరోపణ అదే.
“అధికారం” అంటే పంచాయితీ సర్పంచ్, MLA, MP, మంత్రి, ముఖ్యమంత్రి కానవసరం లేదు. ధనం, కులం, జెండర్ ( లింగం) కూడ అధికారమే. ఇవి వున్నవారు చట్టంతో తమకు కావలసిన పని చేయించుకుంటారు.
సర్వెే నెంబర్ 289లో వున్న తోటలు, కొత్తవీధి గ్రామాన్ని చూపిస్తున్న గూగుల్ సాటిలైట్ ఇమేజ్ల
చట్టాలు, నియమాలు, ఉత్తర్వులు ఇవి కాగితాలలో వుంటాయి. కాని వాటితో మాట్లాడిoచేది “అధికారులు” అనే మనషులు. ఈ మనషులు ముందు చెప్పిన వారికి కావలసిన విధంగా వాటితో పని చేయిస్తారు. అంబేడ్కర్ అందుకే అన్నారు, ‘‘మంచి వారి చేతిలో వున్నది చెడ్డ రాజ్యంగo అయినా ప్రజలకు మేలు జరుగుతుంది. అదే చెడ్డ వారి చేతిలో ఎంత మంచి రాజ్యంగo వున్నా ఏమి జరగదు.’’
Also read: ఒక చిరు విజయం
ఇప్పుడు నేను కొన్ని ఘటనలను వివరిస్తాను. పెద్దవారి కోసం, “అధికారం” వున్న వారి కోసం పాలన వ్యవస్థ చట్టాలు, నియమాలు, ఉత్తర్వులను పాతరవేస్తూ పేదల జీవితాలను ఎలా అతలాకుతలం చేయగలదో చూపిస్తాను. ఇందులో వచ్చే పాత్రధారులు పెద్ద పెద్ద అధికారులు అనుకోకండి. రాజ్య (ప్రభుత్వ) వ్యవస్థలో ఒక నలుసులాంటి ఒక “బుల్లి అధికారి” కూడా తన ప్రతాపం చూపగలడు. పేదలకు చుక్కలు చూపించగలడు. వారి జీవితాలను దుర్బరం చేయగలడు.
వరి, చెరుకు పండిస్తున్నారు:
అనకాపల్లి జిల్లాలో చీడికాడ అనే మండలం ఒకటి వుంది. ఆ మండలం పరిధిలో వున్న గ్రామాలలో “కోనాం” ఒక రెవిన్యూ గ్రామం. ఇది ఆదివాసీ ఆవాస గ్రామాలతో కూడిన రెవిన్యూ గ్రామం.
భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల (ROR) చట్టం అనుసరించి పట్టాదారుల వివరాలను రెవిన్యూ శాఖ నమోదు చేస్తుంది. మార్పులు చేర్పులు చేస్తుంది. ఆ రికార్డు పేరు “1B రిజిస్టర్”. ఇందులో వున్న వివరాలనే పట్టాదారు పాసు పుస్తకం (PPB), టైటిల్ డీడ్ (TDB) పుస్తకాల రూపంలో రైతుకు ఇస్తారు. అంటే 1B రిజిస్టర్ లో వున్న సమాచారమే రైతుల వద్ద వుండే PPB, TDB లలో వుంటాయి, వుండాలి.
1Bలో వున్న ఎంట్రిలను మార్చాలంటే ROR (చట్టం) నియమాల( Rules) ప్రకారం ‘మాత్రమే’ అధికారులు చేయాలి. చట్టం తన పని తాను చేయడం అంటే అదే.
1Bలో భూమి యజమానిగా వున్న ఆసామి నుండి భూమి కొనుగోలు చేసిన ఆసామి తన పేరున (అదే 1Bలో) రికార్డు మార్చమని దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తును ముందు చెప్పిన చట్టం, దాని నియమాల ప్రకారమే ఆ పని చేపట్టాలి.
Also read: టైటిల్ గ్యారెంటీ యాక్ట్: జగనన్న భూరక్ష, అది రక్షా లేక శిక్షా?
ఆ ప్రక్రియలో మొదటి అడుగు లేదా టాస్క్, గ్రామ రెవిన్యూ అధికారి (VRO) ఇచ్చే నివేదిక. దానిని “చెక్ లిస్ట్” అంటారు. VRO ఆ చెక్ లిస్ట్ లో వున్న ప్రశ్నలకు జవాబులు పూరించాలి. అందులో ముఖ్యమైనది, “దరఖాస్తుదారు సాగు అనుభవంలో వున్నాడ లేడా?” అన్న ప్రశ్న. ఇది నింపాలoటే, భూమి మీదకు వెళ్లి పరిశీలన చేయాలి. సాగు ఎవరు చేస్తున్నది విచారణ చేయాలి. ఒక వేళ ధరాఖస్తూదారు సాగులో లేకపోతే? ఎవరు సాగులో వున్నారో, ఏమి సాగు చేస్తున్నారో ఆ వివరాలు అక్కడ రాయాలి.
కోనాం గ్రామం సర్వే నెంబర్ 289 పూర్తిగా మెట్టు (కుష్కి) భూమి. అది మూడు కొండల మధ్య వుంటుంది. ఆ భూమిలో కొందు ( Kondh) ఆదివాసీలు “కొత్తవీధి” అనే పేరుతొ ఒక వూరు కట్టుకొని చుట్టూ వున్న భూమిని సాగులోకి తెచ్చారు. వీరితో బాటు పొరుగున వున్న ‘గుంటి’ గ్రామం కొండదొర ఆదివాసీలు కూడా కొంత భూమికి సాగులో వున్నారు.
భూమి యజమాని నుండి మరొకరు కొనుగోలు చేస్తే ఆయన / ఆమె పేరుతొ రికార్డు మార్చాలంటే సదరు వ్యక్తీ సాగులో ఉన్నాడో, లేడో VRO ఎందుకు నిర్దారించాలి? ఎందుకంటే, ROR (చట్టం) నియమాల ప్రకారం, సాగు అనుభవంలో వున్నప్పుడే పట్టా రిజిస్టర్ ( 1B) లో మార్పులు చేయాలి ( Rule 26 (6)). సాగులో లేకపోతే పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకూడదని అర్దo.
సర్వే నెంబర్ 289 లోని మొత్తం భూమి 41 ఎకరాలు ఆదివాసీల సాగు అనుభవంలో వుంది. అక్కడికి వెళ్లి చూస్తే వారు పెంచిన జీడి మామిడి తోటలు, మెట్టు వ్యవసాయం, ఒక గ్రామం కనిపిస్తాయి. కాని గ్రామ రెవిన్యూ అధికారి (VRO) తన చెక్ లిస్ట్ లో భూమిని కొనుగోలు చేసినవారు “వరి, చెరకు” పండిస్తున్నారని నమోదు చేసారు. ఆ నివేదిక ఆధారంగా మిగిలిన అధికారులు సాగులోలేని గిరిజనేతరుల పేరున రికార్డు మార్చేశారు (సదరు అధికారులకు VRO రిపోర్టు తప్పని తెలుసు) . అలా పాస్ పుస్తకాలు పొందిన గిరిజనేతరులు తాము భూమి కొనేశామని, పట్టాలు కూడా తమకే అయిపోయాయని, భూమి ఖాళీ చేయాలని, లేకపోతె JCBలతో వచ్చి ఇల్లు నేలమట్టం చేస్తామని ఆదివాసీలను హెచ్చిరించడం మొదలు పెట్టారు.
Also read: నేను ఎత్తుకున్న బుడ్డోడు!
అచ్చుపుస్తకంలో వున్న చట్టం సాగులో వున్న వారికి ఒక రక్షణ కల్పించంది. ఒక అవకాశం ఇచ్చింది. కాని చట్టం తన పని తాను చేయలేదు. అది భూ బ్రోకర్ల పని చేసిపెట్టింది.
ఖాళీగా వున్న భూమి:
సర్వే నెంబర్ 289 లోని భూమిలో ఆదివాసీలు పెంచిన జీడి మామిడి తోటలు, టేకు చెట్లు వంటి వృక్షాలతో బాటు, అక్కడ ఒక గ్రామం వుందని చెప్పాను. మేము లెక్కిస్తే 2,800 వరకు లెక్క తేలాయి. అందులో మొదటి స్థానం జీడి మామిడి, రెండవ స్థానం టేకు చెట్లు ( రెండు వాణిజ్య తోటలే) వున్నాయి.
37 ఎకరాల భూమి అమ్మకాలు జరిగాయి:
వి.మాగుల మండలం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ అమ్మకాలు నమోదైనాయి. ఈ క్రియదస్తావేజు పత్రాల ఆధారంగా ముందు చెప్పిన, VRO, RI, సర్వేయర్లల దొంగ రిపోర్టుల సహాయంతో గిరిజనేతరుల పేర్లు రికార్డులోకి వచ్చేసాయి. వ్యవసాయ భూములను రిజిస్టర్ చేసే సంద్బరంలో కొనుగోలుదారు ఆ భూమిలో భవనాలు, కట్టడాలు, యంత్రాలు, తోటలు లేవని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఒక వేల వుంటే? అది ఖాళి భూమి కాదని అర్ధం. అప్పుడు వాటి విలువను కూడా లేక్కంచి ప్రభుత్వానికి రిజిస్ట్రెషన్ పన్ను (Registration tax) కట్టాలి.
మొత్తం 37 ఎకరాలను ఖాళీ భూమిగా చూపించారు. ఒక సెంటు భూమికి 4,400 రూపాయలు రిజిస్ట్రెషన్ విలువ ( Registered market value). దాని ప్రకారం 37 ఎకరాలకు 1 కోటి 62 లక్షల, 80 వేలుగా చూపించి, ఆ ప్రాప్తికే రిజిస్ట్రెషన్ పన్ను కట్టారు. ప్రభుత్వం బొక్కసానికి బొక్క పెట్టారు.
రూ. 1,62,8000 ల నగదు విలవతో, జీడి మామిడి తోటలు, టేకు వనాలు, ఆవాస గ్రామంలోని ఇల్లతో సహా 37 ఎకరాల భూమికి వారు స్వంతందారులైనారు. హక్కుదార్లయినారు.
ఇది పచ్చి మోసం. దగా. ఆ తోటలు పెంచిన ఆదివాసీలు రిజిస్ట్రేషన్ శాఖ వారికి ఈ సంగతలు లిఖిత పూర్వకంగా తెలియజేసారు. ఇంతవరకూ చట్టo తన పని తానూ చేయలేదు.
భూమిని చాపల చుట్టేసారు:
37 ఎకరాల భుమిని అమ్మేశారు. కొనేశారు. 37 ఎకరాలను ఖాళీ భూమిగా చూపించి అమ్మేశారు, కొనేశారు. ఆ 37 ఎకరాలలో 7.22 సెంట్లు ప్రభుత్వ భూమి వుంది.
సెంటు 4,400 అని చెప్పాను కదా ( ఎకరాకి 100 సెంట్లు), అంటే 31 లక్షల 76 వేల, 8 వందలు (రూ. 31,76,800) విలువైన ప్రభుత్వ భూమిని లాగేసారు. ప్రభుత్వానికి ఒక్క నయాపైసా రాకుండానే 7 ఎకరాల ప్రభుత్వ భూమి ( రికార్డులో) చేతులు మారిపోయింది. చట్టం తన పని తానూ చేసిందా? లేదు. భుమి బ్రోకర్ల పనిని మహబాగా చేసిపెట్టింది.
అమ్మిన వాళ్లకు అసలు అంత భూమి వుందా?
నీ జేబులో 100 రూపాయలు వుంటే 110 రూపాయలు ఇవ్వలేవు కదా?.
తేది: 13-02-2021, మధ్యానం 12 గంటల వరకు అమ్మిన వారి పేరున రికార్డు ( 1B) లో వున్నది కేవాలం 13.01 ఎకరాలు మాత్రేమే. ఆ తరువాత అది 37.08 ఎకరాలు ఎలా అయ్యింది? ‘తావీజు మహిమ’.
“పెందుర్తి దేముడు” అదే అనే ఒక తెల్ల రేషన్ కార్డు దళిత పేదవాడు మండలం కార్యాలయం రికార్డులో “స్వయం భువు” లా ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరుమీద 24.07 ఎకరాలు భూమి రికార్డులో ‘వెలసింది’. ఆ వెంటనే పైన తెల్పిన 13.01కి సర్దుబాటయ్యింది. అలా 13.01 ఎకరాలు కాస్తా 37.08 ఎకరాలై కూర్చుంది మాయ శశిరేఖలా. గుడ్డిలో మెల్ల ఏమిటంటే, నీకు 24 ఎకరాల భూమి వుందని పెందుర్తి దేముడు అనే దళిత పేదవాడి తెల్ల రేషన్ కార్డు, వృద్దాప్య పెన్షన్ లను ఏలినివారు రద్దు చేయలేదు. అక్కడికి అదే సంతోషం.
వాహన మిత్ర, దరిద్ర రేఖ:
పేదరికపు రేఖకు దిగువున వుంటే వారి ఆకలి తీర్చడానికి ప్రభుత్వం వారు 1 రూపాయికే kg బియ్యం రేషన్ ద్వార ఇస్తున్నారు. ప్రస్తుత జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వివిధ రకాల పెర్లతో నగదు బదిలీ చేస్తున్న పధకాలలో “వాహన మిత్ర” కూడా ఒకటి. రెక్కాడితే డొక్కాడని ఆటో డ్రైవర్లకు ఈ “వాహన మిత్ర” పధకం. రూ. 1,62,8000 ల నగదు విలవతో 37 ఎకరాలు భూమిని వివిధ క్రియదస్తావేజుల ద్వారా కొనుగోలు చేసిన వారికి వాహన మిత్ర, తెల్ల రేషన్ కార్డులు వున్నాయి. అంటే వీరు ఎవరో పెద్దవారికి బినామీలని అర్ధం.
ఇప్పుడు ఒకసారి లెక్క చూడండి!
1. భూమికి యజమానులం అంటూ 37.08 ఎకరాలు అమ్మేసిన వారికీ ( రికార్డు దాఖలా) వున్నది 13.01 మాత్రమె
2. ఆ 37.08 లో 7.22 ఎకరాలు ప్రభుత్వ సీలింగ్ మిగులు భూమి
3. ఖాళీ భూమిగా చూపించిన ఆ 37 ఎకరాలలో తోటలు దొడ్లు, ఆవాసాలు వున్నాయి.
“లోక కళ్యాణo” లో వున్నారు:
(1) మెట్టు భూమిలో అందునా తోటలతో నిండిన భూమిలో వరి, చెరుకు పండిస్తునారని నివేదిక ఇచ్చిన VRO గారు, దానిని ద్రువీకరించిన RI గారు.
(2) తాను భూమి మీదకు వెళ్లి సర్వే చేశానని “ సబ్ ఠీక్ హై” అంటూ నివేదిక ఇచ్చిన సర్వేయర్ గారు
(3) 24 ఎకరాలు ఒక తెల్ల రేషన్ కార్డు హోల్డర్ కు వుందని నమోదు చేసి, 7.22 ఎకరాల సీలింగ్ మిగులు భూమి ప్రవేటు వ్యక్తుల పేరున రికార్డులో కలిపేసిన గౌరవ తాశీల్దార్ వారు
(4) రిజిస్ట్రెషన్ చట్టం సేక్షన్ 22-A ప్రకారం ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదని వున్నా రిజిస్ట్రేషన్ చేసేసిన సబ్ రిజిస్ట్రర్ వారు
వీరందరూ వేరు వేరు ప్రాంతాలలో “లోక కళ్యాణo” కోసం, చట్టాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమలు చేస్తున్నారు.
Also read: తొలగించిన ఆదివాసీల జాబ్ కార్డులను పునరుద్ధరించండి
మరి, సాగు అనుభవంలో వున్న ఆదివాసీలు?
“మహాప్రభో మా వూరు రండి! మా సాగు అనుభవం చూడండి. మీ రికార్డులో ఆ సంగతి నమోదు చేయండని పిటిషన్ లు పట్టుకొని తిరుగుతూనే వున్నారు. ఎప్పటికైనా “ చట్టం తన పని తాను చేయకపోతుందా” అన్న గంపెడు ఆశతో ఎదరుచూస్తూనే వున్నారు.
తాజా కలం:
ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమ బాగోగులు చూసే వారికి ఓట్లు వేసి పాలన పగ్గాలు వప్పగిస్తారని, వారు రాజ్యంగ, చట్ట బద్థపాలన సాగిస్తారని రాజకీయ శాస్త్రన్ని పాఠ్యపుస్తకాలలో చదవుకున్న వారు అనుకుంటారు. పాపం! అమాయకులు, వెర్రిబాగులు.
“అయిదేళ్లకు ఒకసారి, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో ప్రజలు నిర్ణయిస్టారు. ఆ 5 ఏళ్లపాటు ఆ ప్రభుత్వాలు ఏమి చేయాలో వర్గాలు నిర్ణయిస్తాయి” ( Every five years, it is the masses who determine who will form the government. And between those five years the classes determine what that government will do”
(Indian Express 24 April 2007) (Alternative Economic Survey, India 2006-2007; Published by Alternative Survey Group 2007)
ఈ మాట అన్నది మార్స్క్ కాదు. కొండపల్లి సీతారామయ్యో అంత కంటే కాదు. అన్నవ్యక్తి నాటి కేంద్రమంత్రి మణి శంకర్ అయ్యర్.
Also read: రోలుగుంట మండలంలోని ఆదివాసీల భూమి సమస్యలకు పరిష్కారం చూపండి
PS అజయ్ కుమార్