- 8న ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో రాక
- అంతకు ముందు కారులో బెంగళూరు నుంచి ఇడుపులపాయకు
- జేఆర్ సీ ఫంక్షన్ హాల్ లో వ్యవస్థాపన కార్యక్రమం
హైదరాబాద్ : వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిలారెడ్డి తన పార్టీని స్థాపించడానికి కార్యక్రమం నిర్ణయించుకున్నారు. వైఎస్ జయంతి అయిన జులై 8వ తేదీ నాడు సాయంత్రం హైదరాబాద్ లోని జూబిలీహిల్స్ లోని జేఆర్సీ ఫంక్షన్ హాల్ లో ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్టీని వ్యవస్థాపనను ప్రకటిస్తారు. ఆ సమయంలో ఆమె పక్కనే తల్లి విజయమ్మ ఉంటారు.
వైఎస్ షర్మిల కొన్ని మాసాల కిందట హైదరాబాద్ వచ్చి తాను రాజకీయ పార్టీ నెలకొల్పబోతున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. క్రమంగా ఆమో ఖమ్మంలో బహిరంగసభలో ప్రసంగించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపైన విమర్శలు గుప్పించారు. కోవిద్ కారణంగా ఆమె రాష్ట్రమంతటా పర్యటించలేకపోయారు. కోవిడ్ ఉన్నప్పటికీ రెండు, మూడు జిల్లాలలను సందర్శించి నిరుద్యోగులను పరామర్శించారు. ఇటీవలే తన పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నమోదు చేసుకొని ఆ మేరకు ప్రకటన చేశారు. బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ నివాసం నుంచి ఆమె కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఇటీవల పార్టీకి సోషల్ మీడియా విభాగాన్ని ప్రారంభించారు. దానికి టీమ్ వైఎస్ఆర్ అని నామకరణం చేశారు. ఈ నెల ఎనిమిదో తేదీ ఉదయం బెంగుళూరులో కారులో బయలుదేరి ఇడుపులపాయ చేరుకొని ఉదయం గం. 8.30లకు వైఎస్ ఆర్ సమాధి దగ్గర నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం రెండింటికల్లా బేగంపేట విమానాశ్రయానికి వెడతారు. అక్కడి నుంచి లోటస్ పాండ్ వెళ్ళి భోజనం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి జేఆర్ సి ఫంక్షన్ హాల్ కు వెడతారు. అక్కడ నాలుగింటి నుంచి కార్యక్రమాలు ఆరంభం అవుతాయి. సాయంత్రం అయిదు గంటలకు పార్టీని ప్రకటిస్తారు. ఆ సందర్భంగా చేసే ప్రసంగంలోనే తన పార్టీ ఉద్దేశాలనూ, కార్యక్రమాలనూ, తాను చేయబోయే పాదయాత్ర వివరాలనూ ప్రకటించే అవకాశం ఉంది.
వైఎస్ఆర్ కు తెలంగాణ ప్రజలలో అపారమైన అభిమానం ఉన్నదనే నమ్మకంతో షర్మిల రాజకీయాలలోకి దిగి తెలంగాణను తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ఇంతవరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ షర్మిలపైన ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. శ్రీనివాసగౌడ్, తదితర మంత్రులు కృష్ణాజల్లాల వివాదం సందర్భంగా వైఎస్ దొంగ అయితే జగన్ గజదొంగ అంటూ నిందించారు. కానీ చంద్రశేఖరరావు మాత్రం వైఎస్ ని కానీ జగన్ మోహన్ రెడ్డిని కానీ పేరుపెట్టి ఇంతవరకూ విమర్శించలేదు. రాజకీయాలు సాగినకొద్దీ, ముదిరిపాకాన పడినప్పుడు వైఖరులు ఎట్లా మారతాయో చూడాలి.