అమరగాయకుడు, దివంగతుడైన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించింది. గాయని చిత్రకు పద్మభూషణ్ ప్రదానం చేస్తారు. మొత్తం అయిదుగురు తెలుగువారికి పద్మ అవార్డులు లభించాయి.
తెలుగుజాతి గర్వించే గానగంధర్వుడు, వివిధ భాషలలో దాదాపు 40 వేల పాటలు పాడిన సంగీతద్రష్ట శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మాణ్యానికి తమిళనాడు ప్రభుత్వం సిఫారసు మేరకు పద్మవిభూషణ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 72వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని భారత ప్రభుత్వం పద్మపురస్కారాలను సోమవారం ప్రకటించింది. సాహిత్యం, కళలు, సామాజిక సేవ, విద్య, వైద్య రంగాలలో విశేష సేవలు అందించిన 120 మంది ప్రముఖులకు పద్మపురస్కారాలు ప్రకటించారు. వీరిలో ఏడుగురికి పద్మవిభూషన, పదిమందికి పద్మభూషణ, 103 మందికి పద్మశ్రీ ప్రకటించారు. గుజరాత్ కు చెందిన ఇద్దరు కళాకారులకు కలిపి ఒకే పద్మశ్రీ అవార్డును ఇస్తున్నారు. మొత్తం జాబితాలో 29 మంది మహిళలు, పదిమంది ప్రవాస భారతీయులు లేక భారతమూలాలు ఉన్నవారు.
Also Read : కల్నల్ సంతోష్ బాబుకు మహావీరచక్ర
తెలుగు ప్రముఖులు
తెలంగాణకు చందిన గుస్సాడీ నృత్యకారుడు కనకరాజు పద్మ అవార్డులు పొందిన నలుగురు తెలుగు ప్రముఖులలో ఒకరు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాయులీన విద్యాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగవిద్వాంసురాలు నిడుమోలు సుమతీ రామమోహనరావు, అనంతపురం వాస్తవ్యులు, సాహితీవేత్త, అవధాని ఆశావాది ప్రకాశరావులకు కూడా పద్మశ్రీ పురస్కారం అందజేస్తారు.
Also Read : తెలుగు సినిమా ఉమ్మడి ఆస్తి ‘గుమ్మడి’