నాలుగో యేటి నుంచే
సినిమాలు చూసే వాణ్ని.
మా ఊరి టాకీస్
గడ్డి పొలాల మధ్యన వుండేది.
దాని సిగలోంచి వెలువడే
లత పాటలువింటూ
అది మరింత పచ్చగా మొలిచేది.
ప్రత్యక్షంగా
ఆమెను నేను చూడలేదు.
అందుకే భౌతికంగా
మన మధ్య లేదనే బెంగ లేదు.
సర్వాంతర్యామికి
రూపం లేకున్నా పరవా లేదు.
ఏమి కంఠస్వరమామెది!
శ్రావ్యత అనేది చిన్న మాట
మాటల కందని మనోజ్ఞత.
సాహిత్యాన్ని మీరిన మాధుర్యం
కళ్లు మూసుకుంటే
లోకనులు విచ్చుకోవడం అనివార్యం.
పరాయి ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా
ఎక్కడి నుంచో
ఆమె పాట వినిపిస్తే
భారత్‌లోనే వున్నట్టు అనుభూతి.
నియంత్రణ రేఖను దాటేసిన
నిర్మలమైన నిరాటంక ధృతి.
హృదయ సీమలు గడిచి
ఆత్మ దాకా ప్రవహించిన విఖ్యాతి.
రాసిన వాడు
సరస్వతీ పుత్రుడైతే
పాడుతున్న ఆమె
ఒక భావోద్వేగ గాయత్రి.
సందర్భాలు మరింత
మెరిపిస్తాయి నిజమే గాని
వాటికి అతీతమైన
ఆనంద కళాదీప్తి ఆమె.
గానం వెలువడేది
ఆమె గళమే కావచ్చు
కాని అందులో అలవోకగా
ఒదిగిపోయింది
యావత్ లయాత్మక భూగోళం.
Also read: రాచకొండ
Also read: పురుషులందు…
Also read: పునర్ఘోష
Also read: గ్రౌండ్
Also read: సముద్రం ముద్ర