ముంబయ్ : భారత గాన కోకిల, భారత రత్న లతా మంగేష్కర్ మరి లేరు. 92 ఏళ్ళ లత ఆదివారం ఉదయం అస్తమించారు. ఇక్కడి బీచ్ కాండీ ఆస్పత్రిలో కన్నుమూసిన ప్రఖ్యాత గాయని మృతి పట్ల సంతాప సూచకంగా భారత పతాకను సగం వరకూ అవనతం చేశారు. రెండు రోజుల పాటు సంతాప సూచనగా పతాక అలాగే ఉంటుంది.
కోవిద్ -19 కారణంగా నిమోనియా రావడంతో జనవరిలో ఆస్పత్రిలో చేరారు. జనవరి 8న ఇన్సెన్టివ్ కేర్ యూనిట్ కు తరలించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా వెంటిలేటర్ పైన ఉంచారు. శనివారంనాడు పరిస్థితి క్షీణించింది. గాన గంధర్వుడు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం కోవిద్ సోకి రెండు మాసాల దాకా చైన్నై ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ మరణించిన తర్వాత ఏడాదికి గాన కోకిల లతామంగేష్కర్ అదే పరిస్థితులలో సుదీర్ఘంగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస వదలడం విశేషం.
దీనానాథ్ మంగేష్కర్, శవంతికి 28 సెప్టెంబర్ 1929న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన లత చిన్నతనం నుంచే పాటలు పాడేవారు. తన 13వ ఏట తండ్రి దివంగతుడైన తర్వాత తల్లినీ, నలుగురు తోబుట్టువులనూ పోషించవలసిన బాధ్యత కలిగిన ప్రథమ సంతానంగా లత పాటలు పాడటం ద్వారా సంపాదన ప్రారంభించారు. దీనానాథ్ ప్రసిద్ధి చెందిన మరాఠీ రంగస్థల నటుడు, సంగీతజ్ఞుడు. ఆయన ప్రభావం లతపైన చాలా ఉంది.
‘మాతా ఏక్ సపూత్ కీ దునియా బదల్ దే తూ’ అనే పాట లత ‘గజాభావ్’ అనే మరాఠీ చిత్రం కోసం పాడి రికార్డు చేసిన మొదటి చలన చిత్ర గీతం. చిత్ర పరిశ్రమంలో ప్రసిద్ధులైన శంకర్ జైకిషన్, నౌషాద్ అలీ, ఎస్ డి బర్మన్, అనీల్ బిశ్వాస్ వంటివారితో కలసి పని చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత వేయి సినిమాలకు మించి పాటలు పాడి దేశంలో సాటిలేని మేటి గాయనిగా ఖ్యాతిగడించారు. ఆమె భారతరత్న బిరుదాంకితురాలు. ‘‘భారత సంస్కృతికి గగన సదృశమైన ప్రతినిధిగా రాబోయే తరాలు లతాజీని పరిగణిస్తాయి,’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వెలిబుచ్చారు. అద్భుతమైన ఆమె కంఠస్వరం లక్షలాదిమందిని ఆకర్షించి కట్టిపడేస్తుందని అన్నారు. ‘‘లతాజీ పాటలు రకరకాల ఉద్వేగాలను బయటికి తీసుకొని వచ్చేవి. సినిమా పాటలతో పాటు భారత దేశం సాధిస్తున్న ప్రగతి గురించి ఆమె ఎక్కువగా స్పందించేవారు. బలమైన, ప్రవృద్ధమైన భారత దేశాన్ని చూడాలని ఆమె ఎల్లప్పుడూ తపించారు,’’ అని ప్రధాని తన ట్వీట్ల ద్వారా సంతాపం తెలియజేశారు.
దేశంలో అత్యంత ప్రేమపాత్రమైన స్వరంగా లతామంగేష్కర్ ఉండేవారనీ, బంగారం వంటి ఆమె స్వరం అజరామరమైనదని, ప్రజల హృదయాలలో మరెన్నో దశాబ్దాలపాటు మార్మోగుతూనే ఉంటుందని కాంగ్రెస్ వరిష్ఠ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. లత కుటుంబ సభ్యులకూ, ఆమె అభిమానులకు రాహుల్ సంతాపం తెలిపారు.
బీచ్ కాండీ ఆస్పత్రిని దర్శించిన తర్వాత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒక ట్వీట్ లో, ‘‘భారత దేశం, సంగీతసామ్రాజ్యం గర్వించదగిన శిర్మోర్ స్వర కోకిల భారతరత్న లతా మంగేష్కర్ జీ మరణం చాలా దుఃఖం కలిగించింది,’’ అని అన్నారు. ఆమె పవిత్రమైన ఆత్మకు శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా సంతాపం తెలిపారు.
సకల ప్రభుత్వ లాంఛనాలతో లతామంగేష్కర్ అంత్యక్రియలు ముంబయ్ లో ఆదివారం సాయంత్రం గం.6.30 కి జరుగుతాయి. ఏ మేరె వతన్ కే లోగో…’ అనే పాట లతా మంగేష్కర్ ఆలపించినప్పుడు నాటి ప్రధాని నెహ్రూ ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.