Thursday, January 2, 2025

అమరగాయనికి బాష్పాంజలి

  • నాదంగా అవతరించి నాదంలో ఐక్యమైన నాదశరీరిణి
  • అద్భుతమైన గాత్రంతో ఆకట్టుకున్న సంగీత సరస్వతి
  • భారత రత్న సహా సకల పురస్కారాలు గ్రహీత లతామంగేష్కర్

“నాద తనుమ్ అనిశం శంకరం – నమామి మే మనసా శిరసా” అనే త్యాగరాజ కీర్తనలోని పదములు గుర్తుకొస్తున్నాయి లతా మంగేష్కర్ ను తలచుకున్నప్పుడు. నాద శరీరుడైన శంకరుడికి మనసా, శిరసా నేను నమస్కరిస్తున్నాను అని ఆ పదాల తాత్పర్యం. నాదం ఈశ్వర స్వరూపమని, ఈశ్వరుని స్వరూపమే నాదమని మనం అర్ధం చేసుకోవాలి. సంగీతం సర్వం నాదమయం. నాదమయం, వేదమయమైన సంగీతానికి రూపంగా, శరీరంగా, ఆత్మగా ప్రాతినిధ్యం వహించి, తిరిగి ఆ నాదంలోనే ఐక్యమైన పుణ్యమూర్తి లతా మంగేష్కర్. అంపశయ్యపై ఉండి, జీవిత చరమాంకంలో తండ్రి దీనానాథ్ పాడిన పాటలకు, అంటే ఆ నాదానికి జత కలిపి పాడుతూ తనువు చాలించి, ఆ నాదంలోనే ఐక్యమైన ధన్యకీర్తి లతాజీ. ఏ గాత్రాన్ని పంచుకొని భూమిపైకి వచ్చారో? అదే గాత్రంలో కలిసిపోయిన గొప్ప చరమాంకం నేడు లతాజీ జీవనసంధ్యలో మనకు దర్శనమయ్యింది.

Also read: ముందున్నవి మంచిరోజులు

అవమానాలూ, తిరస్కారాలూ అధిగమించారు

కొన్ని వేల పాటలు పాడి,  కోట్లాదిమందికి దశాబ్దాల పాటు అమృతాన్ని పంచిపెట్టిన అమరగాయని జీవితం హాలాహలాల సాగరం. ఆ హాలాహలాలను ఆత్మనిబ్బరంతో కంఠంలో నిలుపుకొని  అమృతాన్ని పంచిన ధీరవనిత, ఆదర్శమూర్తి. ‘సంగీత కళ’ పుట్టుకతోనే ఆమెకు సంప్రాప్తమైంది. ఇదేళ్ల వయస్సులో తాను పాడడమే గాక, తోటివారికి కూడా నేర్పిన సహజ ప్రతిభామూర్తి లతాజీ. ఆ ప్రతిభే ఆమెను మామూలు చదువులకు దూరం చేసింది, సంగీత ప్రపంచానికి దగ్గర చేసింది. సంగీతమే ప్రపంచంలా బతికేట్టు చేసింది, వెలిగేట్టు నిలిపింది. తండ్రి అకాలమరణంతో 13 ఏళ్లకే కుటుంబ భారం మొత్తం మీద పడింది. కానీ, దానిని భారంగా భావించ లేదు, బాధ్యతగా తీసుకున్నారు. ఆమె బాగా వృద్ధిలోకి వస్తున్న ఒక దశలో ఆమెపై విషప్రయోగం చేశారని చెప్పుకుంటారు. ఇన్నేళ్లపాటు ఇన్ని కోట్లమందిని అలరించిన ఆ స్వరాన్ని మొదట్లో ఎందరో నిరాకరించారు. ఈ పీలగొంతు సినిమా సంగీతానికి పనికిరాదన్నారు. మరాఠీ యాసతో పాడుతున్నావంటూ  పెద్ద హీరోలు ఆమెను తిరస్కరించారు, అవమానించారు, తక్కువగా చూశారు. రికార్డైన తొలి పాటే ఎడిటింగ్ లో తీసిపారేశారు. కఠోర సాధన చేసి, పాత్రోచితంగా పాడడమే గాక, ఉర్దూ భాషను బాగా నేర్చుకున్నారు. హిందూస్థానీ సంగీతాన్ని కాచి వడపోశారు. కర్ణాట సంగీత సొగసుసోయగాలను సొంతం చేసుకున్నారు.మాతృభాష మరాఠీ మొదలు అన్యభాషలైన తెలుగు, తమిళం, మలయాళంలో పాడినా అవి కూడా తన మాతృభాషలేమోనని భ్రమింపజేసేలా పాడిన గొప్ప ప్రతిభ, పట్టుదల ఆమె సొంతం. 30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో కొన్ని వేల పాటలు పాడారు. కేవలం సినిమా పాటలే కాదు, గజల్స్, అభంగులు, అన్నమయ్య కీర్తనలు కూడా పాడారు. గానమనే మహావృక్షం నీడలో ఆమె లోని అనేక ప్రజ్ఞలు బయట ప్రపంచానికి పెద్దగా తెలియకుండానే నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. ఆమె గొప్ప నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, నిర్మాత, వ్యవహర్త. వీటికి మించిన ‘ఫోటోగ్రఫీ కళ’ ఆమె సొత్తు. అద్భుతమైన ఫోటోలను తీయడమే కాక, ఆ సైన్స్ ను కూడా  ఆపోసన పట్టిన ప్రజ్ఞామూర్తి.

Also read: సామాజిక న్యాయం సాటిలేని నినాదం

విరివిగా దానధర్మాలు

ఆమె సంపాదించిన సంపదను ఎక్కువ భాగం సేవలకే వెచ్చించారు.ఆమె జీవితాన్ని గమనిస్తే, తన కోసం కంటే  పరుల కోసమే జీవించారని అర్థమవుతుంది. వివాహం కూడా చేసుకోలేదు. కుటుంబం మొత్తాన్ని పైకి తేవడమే గాక, తండ్రిపేరు మీద ఎన్నో సేవలు, దాన ధర్మాలు చేశారు. గుప్తదానాలు లెక్కకు మించి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల కచేరీలు చేశారు. ఆమె అభిమానులు ప్రపంచమంతా ఉన్నారు. సాధారణ ప్రజలే గాక, ఎన్నో దేశాధినేతలు ఆమె పాటకు పాదాక్రాంతమయ్యారు. నేడు,బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాసిన నివాళిని చూస్తే లతాజీ సంపాయించుకున్న అభిమాన ధనం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. అభిమాన గణమే కాదు, ఆమెకు ఆత్మాభిమానధనం కూడా చాలా ఎక్కువ. అనేకమంది సంగీత దర్శకులు, గాయకులు, నిర్మాతలు, దర్శకులు, నటులతో విభేదాలు వచ్చి, దూరంగా జరిగిన ఉదంతాలు కూడా ఆమె జీవితంలో ఉన్నాయి. తన పద్ధతులు, విధానాలను ఏనాడూ వీడ లేదు. ఆత్మగౌరవాన్ని ఎన్నడూ తాకట్టు పెట్టలేదు. పెద్ద పెద్ద పురస్కారాలను కూడా తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. భారతీయతకు గౌరవం తగ్గితే ఒప్పుకొనేవారు కాదు. తేనెలు చిలికే గాత్రం, హృదయంగమంగా పాడే విధానం, నవరసాలు అలవోకగా ఒలికే రసస్ఫూర్తి, భావ బంధురత, కఠోరమైన క్రమశిక్షణ,సాధన లతా మంగేష్కర్ ను ఇన్నేళ్లపాటు అగ్రస్థానంలో నిలిపాయి. పి సుశీల,ఎస్ జానకి వంటి గానకోకిలలపై ఈ గానకోకిల ప్రభావం చాలా ఎక్కువని వాళ్లే అనేకసార్లు చెప్పుకున్నారు.

Also read: కార్పొరేట్లకు కొమ్ముకాసే బడ్జెట్

సొంత శైలి, సొంత ముద్ర

లతాజీ తన మొదటి రోజుల్లో అప్పటి ప్రముఖ గాయని నూర్ జహాన్ ను అనుకరించేవారు. ఎంతో సాధన చేసి, తన సొంత శైలిని, ముద్రను వేసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, బాలీవుడ్ నేపథ్య గానానికి ఆమె ఒరవడిని సృష్టించారు. పరిశ్రమ మొత్తం ఆ ఒరవడిలోనే ముణిగి తేలిపోయింది. తెలుగు సినిమా పాటలు కూడా ఆ తోటలో విరిసి మురిశాయి. నిదురపోరా తమ్ముడా.. నుంచి తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా .. వరకూ ఆమె గొంతులో సరిగమల గలగలలు వినిపించాయి. సుసర్ల దక్షిణామూర్తి మొదలు ఏ ఆర్ రెహమాన్ వరకూ ఆమె ప్రతిభను సద్వినియోగం చేసుకున్నారు. కుహూ కుహూ బోలే.. వంటి ఎన్నో గీతాలకు మనవారే సంగీత దర్శకులు. ఆదినారాయణరావు వంటి విశిష్ట స్వరకర్తలు ఆ విశిష్ట స్వరాన్ని ఆలంబనగా చేసుకొని అద్భుతాలు చేశారు. అత్యున్నతమైన ‘భారతరత్న’ మొదలు మహోన్నతమైన గౌరవాలన్నింటినీ ఆమె అందుకున్నారు. ఆమె జీవితం తెరచిన పుస్తకం. కోయిల ఎన్నిసార్లు కూ.. అన్నదో.. చెప్పగలమా? అట్లే ఈ గానకోకిల గురించి ఏమి చెప్పగలం? ఎన్నని విప్పగలం? ఈ నాద శరీరిణికి మనసా శిరసా నమామి చెప్పటం తప్ప ఏమీ చేయలేము.ఆ అమృత గానానికి, ఈ అమరగాయనికి హృదయం పరచి నివాళులు సమర్పిద్దాం.

Also read: శీతాకాలంలో కశ్మీర్ లో మంటలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles