రామాయణమ్ – 108
సుగ్రీవుడు, తార, అంగదుడు – వీరు మువ్వురినీ ఓదార్చి ఇక చేయవలసిన కార్యము గురించి ఆలోచించమని రాముడు తెలుపగా లక్ష్మణుడు సుగ్రీవుని సమీపించి వాలి శరీరానికి దహన సంస్కారాలు జరిపించవలెనని తెలిపి అందుకు కావలసిన ప్రయత్నములు చేయమని సూచించినాడు.
వెంటనే సుగ్రీవుడు శ్రేష్టమైన గంధపుచెక్కలను బాగా ఎండిన అనేకములైన కాష్టములను తెచ్చుటకై వానరులను ఆజ్ఞాపించెను. అన్ని ద్రవ్యములను తెచ్చుటకు అంగదుడు పంపబడెను. తారుడు వాలి శరీరమును మోయుట కోరకు ఒక శ్రేష్టమైన పల్లకి తెచ్చెను. వానరవీరులు వాలి శరీరాన్ని ఎత్తి ఆ పల్లకి లో ఉంచి పల్లకిని భుజములకేక్కించుకొని మోయసాగిరి.తార మొదలైన స్త్రీలు అనుసరించి వెళ్లిరి.
Also read: శోక వివశులైన తార, సుగ్రీవుడు
ఒక నదీతీరమున చుట్టూ జలమున్న నిర్జనమైన ఒక ఇసుక తిన్నెపై చితిని ఏర్పాటు చేసి ఆ చితిపై వాలిశరీరాన్ని ఉంచారు వానరులు.
అప్పుడు అంగదుడు చితికి నిప్పంటించి అప్రదక్షిణముగా తిరిగెను. వానరులంతా నది వద్దకు వెళ్లి వాలికి జల తర్పణములు వదిలినారు. దహన సంస్కారమైన పిమ్మట సుగ్రీవుడు రాముని వద్దకు వెడలి అంజలి ఘటించి నిలిచెను.
అంత హనుమంతుడు రామునితో, ‘‘రామా, ఈ సుగ్రీవునకు నీవు అనుమతినిచ్చిన ఎడల కిష్కింధకు వెళ్లి యథా శాస్త్రము రాజ్యాభిషిక్తుడై కార్యములను చక్కబెట్టగలడు’’ అని తెలిపాడు.
Also read: తార ఆక్రందన, సుగ్రీవునికి వాలి విజ్ఞాపన
అప్పుడు రాముడు హనుమంతునితో ‘‘హనుమా, నేను ఈ పదునాలుగేండ్లు గ్రామములో గానీ పట్టణములలో గానీ ప్రవేశించను. మీరే అతనిని తీసుకొని వెళ్లి రాజ్యాభిషిక్తునిగావించండి. అంగదుని యువరాజుగావించండి’’ అని పలికెను.
రామాజ్ఞ ప్రకారము సుగ్రీవునకు పట్టాభిషేకము, అంగదునకు యువరాజ పట్టము కట్టుటనిర్విఘ్నముగా జరిగిపోయినవి. సుగ్రీవుడు రుమను మరల చేపట్టినాడు .సంతోషముతో ఈ విషయములన్నీ రామచంద్రునకు నివేదించినాడు.
అది శ్రావణ మాసము. వర్ష ఋతువు ప్రారంభమైనది. నదులన్నీ నిండుకుండలలాగా ఉన్నాయి. మేఘములు బారులు తీరి జలధారలు వర్షిస్తున్నాయి. ఆ సమయము సీతాన్వేషణకు అనుకూలము కాదు. కార్తీకమాసమువరకు ఆగవలసినదే. అప్పటివరకు సుగ్రీవునకు అనుమతినిచ్చి తానూ తమ్మునితో గూడి అందమైన ప్రస్రవణ పర్వత గుహనొకదానిని అనుకూలముగా ఉన్నటువంటిది చూసి అందు నివసింప నిశ్చయించినాడు రాఘవుడు.
Also read: రాముడు తనను చంపడం అధర్మం కాదని అంగీకరించిన వాలి
రాఘవుడు ఒక రోజు ఆ గుహ సమీపమునందున్న ఒక నదిని చూశాడు. అది చాలా నిండుగా ప్రవహిస్తున్నది. ఆ నదిని చూడగానే అందమైన వస్త్రములు ధరించిన కన్నెపిల్లలా తోచింది ఆయనకు. ఆ నది ఒడ్డున ఉన్న వానీర, తిమిర, వాకుల, కేతక, హింతాల, తినిస, నీప, వేతస వృక్షాలు రకరకాల రంగుల పూవులతో నిండుగా ఉంది. ఆనదీ కన్య ధరించిన ఉత్తమ వస్త్రములుగా కనుపించినవి రాముని కంటికి.
Also read: మోదుగువృక్షంలాగా నేలవాలిన వాలి
ఆ నదికి దగ్గరగా కూతలు కూయుచూ నదిమీదుగా ఎగురుతున్న పక్షుల కిలకిలారావములు ఆ నదీమసుందరి నవ్వులా ఉన్నవట. ఆ నదీ గమన శబ్దము ఆ సుందరి కాలి అందియల సవ్వడి వలే వినిపించినదట.
ఆ నదీ మధ్యభాగమున తెల్లని ఇసుకతిన్నెలు ఆ నదీ కన్య నవ్వుమోము వలే తళతళ మెరిసిపోతున్నవట.
అందమైన ఊహలతో అనుక్షణము ప్రక్కన సీత లేదే అనే విరహవేదనతో కాలము గడుపుతున్నాడు జానకీమనోహరుడు.
Also read: సుగ్రీవుడితో సంధి చేసుకోవాలంటూ వాలికి తార హితోక్తులు
వూటుకూరు జానకిరామారావు