మన బూమ్రాకు వెస్టిండీస్ బ్యాటింగ్ గ్రేట్ బ్రియన్ లారా అభినందనలు తెలియజేశారు. ఎందుకు? తన రికార్డును బద్దలు కొట్టినందుకు. భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా బ్రిటన్ లో ఆడుతున్న బూమ్రా స్టువార్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్ లో 29 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. ఎడ్గబాస్టన్ లో జరుగుతున్న అయిదవ, చివరి టెస్ట్ లో బూమ్రా మామూలుగా అయితే పేస్ బౌలర్. బంతులు విసురుతూ వికెట్లు పడగొట్టడానికి ముందు బ్యాట్ తో వీరవిహారం చేసి భారత్ స్కోరు 416కు చేరే విధంగా దోహదం చేశాడు. బ్రాడ్ ఇచ్చిన 35 పరుగులలో బూమ్రా ఖాతాలోకి 29పరుగులు వెళ్ళాయి. ఇంతకు ముందు ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు బ్రియన్ లారా, ఆస్ట్రేలియా బ్యాటర్ జార్జ్ బెయిలీ, దక్షిణాఫ్రికా బ్యాటర్ కేశవ్ మహరాజ్ పేరుమీదా ఉన్నది. దీనిని బూమ్రా అధిగమించాడు. లారా 2003లో రొబిన్ పీటర్సన్ బౌలింగ్ లో ఒక ఓవర్ లో 28 పరుగులు చేశాడు. బెయిలీ, మహరాజ్ లు కూడా అదే విధంగా 28 పరుగులు ఒక ఓవర్ లోనేచేసి రికార్డును సమయం చేశారు. ఇప్పుడు బూమ్రా ఆ రికార్డును అధిగమించాడు.