ఆదివారంనాడు ఆసియా కప్ ఫైనల్
ఊపు మీద ఉన్న శ్రీలంక జట్టు
ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్ లో శుక్రవారంనాడు శ్రీలంక పాకిస్తాన్ ను ఓడించింది. దుబాయ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో అనూహ్యంగా విజయం సాధించిన శ్రీలంక జట్టు తమ దేశానికి చాలా అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. నానా కష్టాలలో ఉన్న శ్రీలంకకు ఇటీవల లభించిన శుభవార్త ఇది ఒక్కటే. అటు భారత్ నూ, ఇటు పాకిస్తాన్ నూ ఓడించి శ్రీలంక ఘనకార్యం సాధించింది. సూపర్ 4 మ్యాచ్ లలో శ్రీలంక అజేయంగా నిలిచింది. ఆదివారంనాడు ఫైనల్ పోరు తిరిగి పాకిస్తాన్, శ్రీలంకల మధ్యనే ఉంటుంది.
పాతుప్ నిస్సంక 55 పరుగులు చేసి అజేయంగా నిలిచి లంక విజయానికి దోహదం చేశాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లంక పాకిస్తాన్ ను అయిదు వికెట్ల తేడాతో ఓడించింది. భానుక రాజపక్స 24 పరుగులూ, దాసున్ శనక 21 పరుగులు చేసి జట్టు విజయానికి కారకులైనారు. ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉన్నాయనగానే శ్రీలంక జట్టు విజయపతాకను ఎగురవేసింది. ఒక వైపు వికెట్లు వరుసగా పడుతున్నప్పటికీ నిస్సంక గోడలాగా నిలిచి విజయానికి ప్రథమ కారకుడైనాడు.
అంతకు ముందు పాకిస్తాన్ బ్యాటింగ్ ను ఉండలాగా చుట్టిపడేసినట్టు శ్రీలంక బౌలర్లు విజృంభించారు. మొత్తం పాకిస్తాన్ జట్టును 19.1 ఓవర్లలో 121 పరుగులకే ఔట్ చేశారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం 30 పరుగులు చేసి అత్యధిక స్కోరు చేశారు. మహమ్మద్ నవాజ్ 26 పరుగులు సాధించాడు. విజయానికి అవసరమైన 122 పరుగులను 17 ఓవర్లలో శ్రీలంక బ్యాటర్లు సాధించారు.