- టాప్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం
- భారత బౌలింగ్ లో పసలేదు
- బ్యాటర్లకు ఏకాగ్రత లేదు
- నిద్రలో నడిచినట్టు వచ్చారు, పోయారు
సూపర్ 4 మ్యాచ్ లో భారత్ ను శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. శ్రీలంక బ్యాటర్లు భానుక రాజపక్ష, దాసున్ శనక చివరికంటా బ్యాట్ చేసి అవసరమైన 174పరుగులు సాధించారు. టాస్ గెలిచి మొదట ఫీల్డ్ చేసిన లంక ఇండియాను 173 పరుగులుకు పరిమితం చేసింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే విజృంభించి 72 పరుగులు సాధించాడు. మరో బ్యాటర్ విరాట్ కొహ్లీ పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నవాడల్లా తటాలున అవుటై వెళ్ళిపోయాడు. అతడి స్కోరు 29 బంతుల్లో 34 పరుగులు. హార్దిక్ పాండ్యా కూడా 17 పరుగులు చేసి పెవిలియన్ కు వెళ్ళిపోయాడు. చివరి ఓవర్లో రవిచంద్రఅశ్విని ఒక సిక్సర్ కొట్టి మురిపించాడు. మొత్తం ఎనిమిది వికెట్ల నష్టానికి ఇండియా 173 పరుగులు చేసింది. రోహిత్ శర్మ తన 29వ అర్ధశతకం చేసుకున్నాడు. అతడు అవుటైన తర్వాత శ్రీలంక బౌలర్ల ధాటికి ఇండియా బ్యాటర్లు తట్టుకోలేక ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు తిరిగి వెళ్ళారు. రిషబ్ పంత్ కూడా 13 బంతుల్లో 17 పరుగులు చేసి అవుటైనాడు.
శ్రీలంక ఓపెనింగ్ బ్యాటర్ల బృందం గట్టి పునాదులు వేసింది. పాతుం నిశ్శంక, కుసాల్ మండీస్ బాగా ఆడారు. చెరి 57 పరుగులు చేశారు. మొన్న పాకిస్తాన్ చేతుల్లో ఓడిన చందంగానే చివరి ఓవర్ చిట్టచివరి బంతికి ముందు, అంటే ఇరవై ఓవర్లలో ఒకేఒక బంతి మిగిలి ఉన్నదనగా శ్రీలంక గెలిచింది. ఇక పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ ఆడవలసి ఉంది. ఇండియా కూడా అఫ్ఘానిస్తాన్ తో సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ఆడాలి. ఫైనల్ కు చేరే అవకాశాలు ఇండియాకు తక్కువ.