రామాయణమ్ – 88
ఈయన రుద్రుడా? లేక వీరభద్రుడా? పుట్టి బుద్ది ఎరిగిన తరువాత ఈ రూపము ఎన్నడూ చూడలేదు. భయముతో ముఖము ఎండిపోయింది. నాలుక తడి ఆరిపోయింది లక్ష్మణునికి.
ఈయన మా రామన్నేనా? ఏమి రూపమిది ? మాటి మాటికీ నారి సారిస్తున్నాడు. ధనుస్సు వైపు చూస్తున్నాడు. ప్రళయ కాలాగ్ని సమానముగా భాసిల్లుతున్నది ఆయన ముఖ మండలము. అడుగు ముందుకు వేసి పిడికిలి బిగించి ధనుస్సు మధ్య భాగాన్ని ఎత్తి పట్టుకొని ప్రళయకాలంలో విలయ తాండవము చేసే మహాదేవుడా అన్న రీతిలో భయము గొల్పుతున్నాడు.
Also read: రామచంద్రుని వ్యధాభరితమైన క్రోధావేశం
లక్ష్మణుడు ఎలాగో గుండె చిక్కబట్టుకున్నాడు.
నెమ్మదిగా ఆయనతో, ‘‘అన్నా, నీవేనా? పరమశాంతమూర్తివైన మా రామభద్రుడవేనా? సకల జీవసంరక్షణవ్రతముగా కలిగిన రామచంద్రుడవేనా? నీ సహజ స్వభావము విడిచి ఈ క్రోధమునకు వశుడవైనావేమి? చంద్రునిలో శోభ, సూర్యునిలో కాంతి, వాయువు నందు సదా గమనము, భూమియందు ఓర్పు ఏ విధముగా ఉన్నవో నీ యందు ఉత్తమమైన కీర్తి కూడా స్థిరముగా ఉన్నది. ఎవడో ఒక్కడు చేసిన అపరాధమునకు ఈ లోకము మొత్తాన్నీ నాశనము చేయబూనుట యుక్తము కాదు. నీ భార్య నశించుట మంచిదే అని ఎవరనుకొంటారు? వీరందరి రక్షణ బాధ్యత స్వీకరించినవాడవు నీవు.
Also read: సీతమ్మకోసం రామలక్ష్మణుల వెదుకులాట
‘‘దయామయుడవు. రఘురామా శాంతించు. మనకు ఎవరు అపకారము చేసినారో వానిని వెతికి పట్టుకొని దండిద్దాము. అందుకు మహర్షుల సహాయము తీసుకొందాము. భూమి అణువణువూ శోధించుదాము. సముద్రములు, నదులు, పర్వతాలు, వనాలు, భయంకరమైన గుహలూ, పద్మవనాలూ వెదుకుదాము. నీ భార్య దొరికేంతవరకు దేవ, గంధర్వ, పాతాళ లోకాలన్నీ గాలిద్దాము.
‘‘నీ భార్యను నీకు అప్పగించని ధూర్తునికి తీవ్రమైన దండనే. వజ్రాయుధాలతో సమానమైన నీ వాడి వాడి బాణాలు వాడి వేడివేడి నెత్తురును రుచిచూస్తాయి. కోసలాధీశా, కోదండరామా! అప్పటి వరకు కాస్త శాంతించవయ్యా’’ అని పరిపరి విధాలుగా ప్రార్ధించాడు రామానుజుడు.
Also read: సీత క్షేమమేనా? రాముడిని మనసు అడుగుతున్న ప్రశ్న
స్థైర్యము కోల్పోయి పసిపిల్లవాడిలాగా విలపిస్తున్న రాముని చూసి లక్ష్మణుని హృదయము ద్రవించింది. అన్న పాదాలు తాకి ఆయనకు ధైర్యము చెప్పసాగాడు.
‘‘దేవతలు ఎంతో కష్టపడి అమృతము సాధించుకున్నారు. అలాగే దశరథ మహారాజు ఎన్నో నోములు వ్రతాలు యజ్ఞాలు చేసి నిన్ను పొందాడు. ఆయన పుణ్యఫలానివి నీవు. నీ వియోగము వలననే కదా ఆయన అసువులు బాసినది. రామా ఇలాంటి కష్టము నరశ్రేష్ఠుడైన నీవంటి వాడు ఓర్చుకొని తదుపరి కర్తవ్యము ఆలోచించుకొనవలె కానీ ఇలా దుఃఖిస్తే ఎలా? సామాన్యునికే ఇలాంటి కష్టము వస్తే పరిస్థితి ఏమిటి? రామా అమితమైన దుఃఖములో నీవంటి వాడు లోకాలకు హాని చేస్తే ప్రజలేమవ్వాలి?
భూదేవికి కూడా అప్పుడప్పుడు చలనము సంభవిస్తుంది కదా?
Also read: సీతమ్మకు గడువిచ్చి అశోకవనమునకు తరలించిన రావణుడు
సూర్య చంద్రులకు కూడా గ్రహణము సంభవిస్తున్నది కదా? ఇంద్రుడిలో కూడా నీతి దుర్నీతి ఉన్నట్లు మనము వింటున్నాము కదా? రామా ఎల్లప్పుడూ సత్యమునే చూచు నీ వంటి వారు ఇలాంటి కష్టములు వచ్చినప్పుడు శోకించుట తగదు. నీవు బుద్దిశాలివి. నీ బుద్ధితో ఆలోచించి యదార్ధ స్థితి గురించిన మంచిచెడ్డలను తెలుసుకోనగలవాడవు.
‘‘కర్మల గుణదోషాలను మనము చూడజాలము. అవి అస్థిరములు. ఎందుచేతననగా ఏ కర్మ అయిననూ అది పూర్తీ అయిపోగానే నశించును. మనకు ఇప్పుడు లభించుచున్న కర్మఫలములు మనము పూర్వజన్మలో చేసిన కర్మల వలననే కదా. కర్మ ఫలానుభవము తప్పదు కదా! దానిని విచారించిన ఏమి ప్రయోజనము. రామా సాక్షాత్తూ దేవగురువు బృహస్పతి అయినా నీకు బోధించ సమర్ధుడు కాడు. నీకు తెలియని ధర్మమేమున్నది? కేవలము శోకము చేత కప్పబడిన నీ జ్ఞానమును మేలుకోల్పుటకే నేను ఈ విషయాలు చెపుతున్నాను.’’
Also read: ‘రామా,లక్ష్మణా, కాపాడండి’ అంటూ రోదించిన సీత
వూటుకూరు జానకిరామారావు