29. తిరుప్పావై కథలు
రాముడి రావణుడిని సంహరించిన తరువాత అయోధ్యచేరి చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. తరువాత యౌవరాజ్యం పట్టాభిషేకం చేసుకోవాలని లక్ష్మణుడిని అడిగితే నాకెందుకు వద్దు అంటాడు. బతిమాలతాడు. వినడు. నాకు నీతో సాంగత్యం కావాలి. నీ పాదాల చెంత ఉండాలి, నీ సేవలు చేసుకోవాలి. అంతే నీనుంచి దూరమయ్యే ఏ బాద్యతా నాకు అక్కర లేదు. నీవెంట అడవులకు వచ్చింది నిన్ను వదిలి ఉండలేకనే. నాకీ రాజ్యాలు పాలనా భారాలు ఎందుకు అన్నయ్యా? నీ దగ్గర నన్ను ఉండనీ చాలు అంటాడు.
Also readd: రావణు గూల్చిన శ్రీరామ శౌర్యమునకు జయము జయము
కిరీట ధారణ చేయాలని నీవే స్వయంగా బతిమాలినా అంగీకరించకుండా నీ చరణాలనే సేవిస్తానని లక్ష్మణుడు కోరిన విధంగా మాకూ నీ పాదాలమీదే ప్రియత్వం అధికంగా ఉంది. ‘‘ధనం మదీయం తవ పాద పంకజం’’ అన్నట్టు, అని గోదమ్మ గోపికలు అడుగుతున్నారు.
ఇన్నాళ్లూ 27 రోజులుగా 27 పాశురాలలో పఱై కావాలని గోపికలు కోరుకున్న ప్రస్తావన కనిపిస్తుంది. నిన్న పఱై, అలంకార వస్తువులు, పరమాన్న భోజనం అడిగినారు గోపికలు. కాని ఆ పఱై శ్రీ కృష్ణుని శ్రీచరణాలే కాని మరేదీ కాదు. నీకైంకర్యమే పరమపురుషార్థం అని గోపికలు తేల్చారు. భగవంతుడిని పొందడానికే ఈవ్రతము. ముందు భగవత్ సంబంధులతో సంబంధం ఏర్పరచుకోవాలి. శమము దమము అనే గుణాలను అలవర్చుకుని ఆచార్యుని వద్ద సమాశ్రయణం పొందాలి. వారినుంచి మంత్రోపదేశం పొంది, మంత్రార్థము తెలుసుకుని, పురుషకారం కట్టుకొమ్మని అమ్మను ఆశ్రయించాలి.ఆమె ద్వారా స్వామియే ఉపాయమని వారి కటాక్షం సంపాదించాలి. స్వామిని దర్శించి మంగళాశాసనం చేసి, స్వరూపం జ్ఞానం మొదలైనవి కావాలని కరుణించి దయచేయమని అడగాలి. అందుకు కావలసిన అలంకారాలు ఇవ్వమని అడిగి అవి ధరించి సాయుజ్యం కావాలని మనసారా కోరాలి. సంసారం నుంచి దూరమై, భగవంతుడినిచేరి భగవదనుభవం పొందే ప్రక్రియను 27 పాశురాలలో వివరించడం జరిగింది. ప్రధానంగా తెలియవలసిన విషయాలను 28, 29వ పాశురాల్లో చెప్పి, వ్రతఫలం 30 వ పాశురంలో వివరించారు.
నారాయణనే నమక్కే పఱైతరువాన్ అని నారాయణుడే మనకు పఱ అనే వాయిద్యం ఇస్తారని మొదటి పాశురంలో చెప్పి వ్రతం ఆరంభించారు. ధర్మ అర్థ కామ మోక్షాలలో మొదటి మూడు, నాలుగవ పురుషార్థమును పొందడానికి మెట్లు. భగవత్సేవ రూపంలో భగవత్ ప్రాప్తి కలుగుతుంది. అందుకే నారాయణుడే ఫలం ఇస్తాడంటారు, ఆఫలమే పఱై. ఈ మాట 28, 29 పాశురంలో వివరిస్తారు. దానికి ఉపాయము శ్రీకృష్ణుడే అని 28వ పాశురంలో చెప్పారు. ఫలం పొందే అర్హత మనకే ఉన్నదని ఈ రెండు పాశురాల్లో చెప్తున్నారు. భగవానుని పొందడమే ఫలం. పఱై అంటే అదే. భగవంతుడు తప్ప మరొక ఉపాయం ఉందనుకోరాదు. అనుకుంటే అది మురికి (అపరిశుద్ధత), భగవంతుడు ప్రాప్తించిన తరువాత వేరొక ప్రయోజనం అడగడం మరొక అపవిత్రత. భగవంతుని కైంకర్యము తన కోసం అనుకుంటే అది మరొక అపవిత్రత. ఈ అపవిత్రతలన్నీ తొలగించుకోవడమే ఫలశుద్ధి. నీవే ఉపాయమనేది ఒక పరిశుద్ధి. నీవే ఫలమనేది ఫల పరిశుద్ధి. 28 వ పాశురంలో ఉపాయ పరిశుద్ధి, 29 పాశురంలో ఫల పరిశుద్ధి ప్రధానం. నోము ఒక మిష, పఱ ఒక మిష. వారికి నిజంగా కావలసింది శ్రీకృష్ణసేవ.
Also read: చీమకైనా బ్రహ్మకైనా అహంకారం సమానమే
పఱై మిషతో వచ్చిశ్రీకృష్ణుని లేపి, సింహాసనం మీదకు రప్పించి, మంగళం పాడి, కొన్ని ఉపకరణాలు అడుగుతారు. శ్రీకృష్ణుడు అవి ఇవ్వడానికి సిద్ధమయితే నీవే మాపుణ్యం మాకు పఱై ఇవ్వు చాలంటారు. అది మామూలు పఱ కాదు అని తెలుసుకుని శ్రీకృష్ణుడు మౌనంగా ఉంటాడు. అయ్యా మీరే మా ఉపాయం అని చెప్పి నిత్యకైంకర్యమనే ఫలం ఇవ్వమని అడుగుతారు. జన్మజన్మలకు నీ సాపత్యం, సాంగత్యం, బాంధవ్యం కావాలని అడుగుతున్నారు 29 వ పాశురంలో.
బంగారంవలె ఉంటాయి కాని బంగారం వలె కఠినమైనవి కావు.నీ పాదాలు. తామర పూల వలె మెత్తనివి. వాసనలేని లోహం కాకుండా మంచి గంధపు వాసనలు విరజిమ్మేవి అమృతస్యంది అయిన నీ తిరు (శ్రీ) చరణాలను ఎందుకు కోరుతున్నాము.
Also read: ఔదార్యానికి పరాకాష్ట – పరమాత్ముడు
నారాయణ మంత్రం
ఉనక్కు లో అకారాన్ని అనుసంధించారు. ఉనక్కే లో ఏ కారం వలన ఉపకారం వెల్లడవుతున్నది. నామ్ లో మకారార్థమైన జీవస్వరూపం ఉంది. ఉన్దన్నోడు ఉట్రోమే యావోమ్ అనడంలో నారాయణ పదం ఉంది. ఎట్రైక్కుమ్ ఏజేజు పిఱవిక్కుమ్ అట్ చెయ్ వోమ్ లో అమ్ మాట ద్వారా చతుర్థి అర్థం చెప్పారు. మట్రైనమ్ కామంగళ్ మాట్రు అనడంలో నమ శబ్దానికి అర్థం చెప్పారు. కనుక ఇది అష్టాక్షరీ మంత్రానికి వివరణఅని సర్వ మంత్ర అర్థాలను గర్భంలో దాచుకున్న పాశురమని అన్నారు. ఆచార్యులు మరో పుట్టుక వద్దన్నారు. కాని ఆండాళ్ పుట్టుక వద్దనలేదు. నీతో పాటు ఏడేడు జన్మలు మళ్లీ పుట్టాలని కోరుకున్నారు. పరమపదం కన్న మోక్షం కన్న నీ తో బంధుత్వం ఉన్న పుట్టుకే కావాలని అంటున్నది ఆండాళమ్మగారు. అదే ఆమె విశిష్ఠత. అహంకారాన్ని తొలగించడానికి కూడా అతని సాయాన్ని అనుగ్రహాన్ని అర్థించాలి. స్వామికి హృదయానందం కలిగించడమే లక్ష్యం. దానికి మనమే సాధనం. ఎప్పడికీ కైంకర్యంచేస్తున్నామన్న భావనే ఉండాలి.
జీయర్ స్వామి వ్యాఖ్య
జీయర్ స్వామి వారి వివరణ ఇది: గోపీజనులతో వచ్చిన ఆండాళ్ తన మూల కోరిక ఏమిటో వివరించిన పాశురం ఇది.”శిత్తమ్ శిఱుకాలే” ఇంకా చీకటి తొలగని తెల తెల వారే సమయంలో “వంద్” మేం నీ దగ్గరికి వచ్చాం. మాలో ఆర్తి పెంచినది నీవే కదా, ఎంత కాలం నీవు చేసిన ఫలితమో ఇన్నాళ్ళకు మాకు ఈ జ్ఞానం కల్గింది. ఇది నీవు చేసిన కృషేకదా. “ఉన్నై చ్చేవిత్తు” అన్నీ నీవు చేసినవాడివి, శబరి వంటి వారిని నీవే వెళ్ళి అనుగ్రహించావు. కానీ మేం చేయాల్సి వస్తుంది. మేం నిన్ను సేవిస్తున్నాం. మనకున్న జ్ఞానంతో ఒక్క సారి మేం నీవారమని చెప్పగల్గితే, ఇది రాగ ప్రయుక్తం. “ఉన్ పొత్తామరై యడియే పోట్రుం” నీ పద్మాలవంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం.
Also read: ఔదార్యానికి పరాకాష్ట – పరమాత్ముడు
“ఎం కించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్దకం సేవాయ” ఈ లోకంలో అల్పమైన పురుషార్దం కోసం వాడి కున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ వీళ్ల వాళ్ల చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా. “నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతసా సేవ్యె సస్య పదస్య దాసరీ సురే నారాయణే తిష్టతి” సమస్త జీవులకు నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా, ముల్లోకాలను నడిపేవాడు, చేతులు కట్టుకున్నా సరే ఒక్క సారి మనస్సులో నీవాడనని తెలిపినా పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్లుగా, మేం నీ పాదాలను పాడటనికి వచ్చాం అని చెప్పారు. ఏమీ విననట్టు సుదీర్ఘమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్లనే చూస్తున్నాడు.”పొరుళ్ కేళాయ్” మేం ఎందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాఠం చెబుతోంది గోదా. ఆండాళ్ తల్లికి పాఠం చెప్పడం అలవాటు కదా. ఆయనకీ పాఠం చెప్పగలదు. “పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు” మొదట పశువులని మేపి అవి తిన్నాకగాని మేం తినేవాళ్ళం కాదు. నీకు మా స్వరూపం తెలియదా. మరి నీవేమి చేస్తున్నావు! మాకు ఆహారం నీసేవయే, అది మాకు లభించాకే, ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి, “నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు” నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే. ఏదో వ్రత పరికరం అని అన్నారు.