రామాయణమ్ – 198
ఇతనెవడు? కుంభకర్ణునిలా ఉన్నాడే. లేక కుంభకర్ణుడే మరల లేచినాడా?చూసే వానరులందరూ భయముతో గజగజవణికిపోయినారు. అందరూ శ్రీరామచంద్రుడి వెనుకకుచేరినారు.
‘‘రధము మీద పర్వతములాగ ఉండి వేయి సూర్యులకాంతితో ప్రకాశిస్తున్నాడు విభీషణా,ఎవరితను? వామనుడు త్రివిక్రముడయినప్పుడు ఎట్టి రూపముతో యుండెనో అట్టి రూపమును కలిగియున్నాడు’’ అని రామచంద్రుడు అడుగగా అందుకు విభీషణుడు….
Also read: తమ్ముడి మరణంతో బేజారైన రాక్షసరాజు
రామా వీడు రావణునికి ధాన్యమాలియందు జన్మించినవాడు. వీని పేరు అతికాయుడు. వీడు బ్రహ్మవరప్రసాది. అమేయబలసంపన్నుడు. వీడెక్కివచ్చిన రధము బ్రహ్మదేవుడు ప్రసాదించినదే. దివ్యాస్త్రసంపన్నుడు. వీడి చేతిలోపడి వానర సైన్యము మరణించకముందే మనము ఏదో ఒక తీవ్రమైన ప్రయత్నము చేయవలెను.
అతికాయుడు వానర సైన్యములో ప్రవేశించి ధనుస్సు ఎక్కుపెట్టి నారిసారించి పెద్ద ధ్వని చేసి గర్జించినాడు. ఆ ధ్వని విన్న వానరవీరుల మనసు చెదిరి కకావికలైపోయినారు.
Also read: కుంభకర్ణుని వధ
కుముదుడు, ద్వివిదుడు, మైందుడు, నీలుడు, శరభుడు అనువారు పెద్దపెద్దపర్వతములు మహావృక్షములు పెళ్ళగించి పట్టుకొని ఒక్కసారే అతనిపై దూకిరి. అతికాయుడు వానినన్నింటినీ ఛేదించి తన బాణములతో వారిని తీవ్రముగా నొప్పించెను.
సరాసరి రాముని వద్దకేగి గర్వముతో, ‘‘రామా, నేను సామాన్యులతో యుద్ధము చేయను. నాతో యుద్ధము చేయగల చావ ఉన్నవాడు ఎవడైనా ముందుకు రావచ్చును.’’
గర్వాంధుడైన వాని సవాలు విని లక్ష్మణుడు కోపముతో బుసలు కొట్టుచూ, ‘‘రారా, నేనుండగా రామునిదాకా ఎందుకు? కాచుకో నా వాడి అయిన శరములు నీ శరీరములోని వేడివేడి నెత్తురును రుచిచూడగలవు. ఇదుగో నా దివ్యాస్త్రములు పండిన తాటిపండు గాలితాకినవెంటనే రాలినట్లుగా నీ శిరస్సును నీ మొండెమునుండి వేరు చేయగలవు.
ఆ మాటలకు అతికాయుడు బిగ్గరగా నవ్వి ‘‘బాలుడవు. నీ వలన కాదు. ప్రాణములపై ఆశ ఉన్నయెడల ప్రక్కకు తప్పుకో’’ అని హుంకరించెను.
Also read: కుంభకర్ణుడి స్వైరవిహారం
‘‘అవునురా నేను బాలుడనే! బాలుడనో వృద్ధుడనో ఏమైననేమి? యుద్ధములో మాత్రము నేనే నీ మృత్యువును…’’అనుచూ ఇరువురూ యుద్ధమునకు సిద్ధమయినారు
విద్యాధరులు ,దేవతలు, దైత్యులు, మహర్షులు మొదలయినవారంతా లక్ష్మణ అతికాయుల యుద్ధాన్నితిలకించడానికి వచ్చి ఆకాశములో నిలిచారు.
మొదట అతికాయుడు ఒక పదునైన బాణాన్ని లక్ష్మణుని మీద ప్రయోగించెను. దానిని ఒక అర్ధచంద్రాకారపు బాణముతో లక్ష్మణుడు మార్గమధ్యములోనే వమ్ము చేసెను.
తన బాణము వ్యర్ధమగుట చూసిన అతికాయుడు కోపముతో ఒకే సారి అయిదు బాణములు సంధించి లక్ష్మణుని పై వదిలెను. వాటిని కూడా మార్గములోనే తుత్తునియలు చేసిన లక్ష్మణుడు ప్రజ్వలిస్తూ అతివేగముగా దూసుకునిపోయే విధముగా ఒక బాణమును ఆకర్ణాంతము నారిసారించి వదిలిపెట్టగా అది సూటిగా అతికాయుని నుదురుతాకగా రక్తము కారి ముఖము మందారపూవులాగా ఎర్రగా మారిపోయెను.
Also read: రణరంగానికి బయలుదేరిన కుంభకర్ణుడు
ఆ దెబ్బకు లక్ష్మణుని సామర్ధ్యమేమిటో అతికాయునికి తెలిసివచ్చి ‘‘శహభాష్’’ అని మెచ్చుకొని కాలు గాలిన పిల్లిలా తన రధములో కాసేపు అటు నిటు పచార్లుచేసి ధనుస్సు చేతబూని ఒకటి, మూడు, అయిదు, ఏడు, తొమ్మిది అని లెఖ్ఖపెడుతూ పుంఖానుపుంఖాలుగా బాణములు వదిలిపెట్టెను. అవి ఆకాశములో పెద్దపెద్దమంటలు రేపుతూ లక్ష్మణుని వైపు దూసుకుంటూ రాగా ఆయన ఏమాత్రము చలించక వాటినన్నింటినీ మార్గమధ్యములో నిర్వీర్యము చేసెను.
శస్త్రాలు ఒకరివద్ద మరియొకరివి పనిచేయుటలేదని గ్రహించి దివ్యస్త్రాలను అభిమంత్రించి వదలసాగారు ఇరువురు యోధులు.
ఆగ్నేయాస్త్రము లక్ష్మణుడు సంధిస్తే అతికాయుడు సౌరాస్త్రముతో బదులుచెప్పెను. అతికాయుని ఐషీకాస్త్రమునకు లక్ష్మణుని ఐంద్రాస్త్రము సమాధానమాయెను. అతికాయుని యమ్యాస్త్రమునకు వాయవ్యాస్త్రముతో లక్ష్మణుడు జవాబుచెప్పెను.
లక్ష్మణుడు వరుసబెట్టి ప్రయోగిస్తున్న అస్త్రశస్త్రాలు కుంభవృష్టిలాకురుస్తూ అతికాయుని ముంచెత్తెను అయినా ఆ యోధుడు కించిత్తుకూడా చలించలేదు.
అతికాయుడు లక్ష్మణుని మర్మదేశమునతగులునట్లుగా ఒకబాణమును అతిలాఘవముగా సంధించి విడిచిపెట్టెను అది తనపని విజయవంతముగా పూర్తిచేసెను .ఆ దెబ్బకు లక్ష్మణుడు విలవిలలాడిపోయి క్షణకాలము మూర్ఛిల్లెను.
మరుక్షణమే తేరుకొని నాలుగు వాడిబాణములతో అతికాయుడి సారధిని, గుర్రములను, జండాను పడగొట్టెను. ఇంతలో వాయుదేవుడు నెమ్మదిగా లక్ష్మణుని చెవిలో అతికాయుని మరణరహస్యమును ఊదెను. ‘‘అతనికి బ్రహ్మదత్తమైన అభేద్యకవచము అండగా ఉన్నది. దానిని బ్రహ్మాస్త్రము తప్ప వేరొకటి ఛేదించలేదు. కావున లక్ష్మణా బ్రహ్మాస్త్రప్రయోగము చేయుము’’ అని చెప్పినాడు.
లక్ష్మణుడు ఏ మాత్రము ఆలస్యము చేయక బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి అతికాయునిపై ప్రయోగించెను.
వచ్చునది బ్రహ్మాస్త్రము అని అతికాయుడు గ్రహించినాడు ఎన్నోవిధములుగా దానిని అడ్డొకొన ప్రయత్నించినాడు. కానీ అవి అన్నీ విఫలమాయెను.ఆ బ్రహ్మస్త్రము అతికాయుని శిరస్సుని కిరీటముతో సహా త్రుంచివేసి, మొండెమునుండి వేరు చేసినది.
ఒక్కసారిగా ఘొల్లుమని ఏడుస్తూ రాక్షసులంతా పట్టణము వైపు పరుగెత్తిరి.
Also read: రావణునితో కటువుగా మాట్లాడిన కుంభకర్ణుడు
వూటుకూరు జానకిరామారావు