Thursday, December 26, 2024

శూర్పణఖ ముక్కుచెవులు కోసిన లక్ష్మణుడు

రామాయణమ్ 66

రాముడు తన మీద మరులుకొన్న శూర్పణఖను చూస్తూ ‘‘పూజ్యురాలా! నాకు వివాహమైనది. ఈమె నాకు చాలా ఇష్టురాలైన భార్య. నీవంటి ఆడవాళ్ళకు సవతిపోరు ఎందుకు గానీ అడుగో అతడు అక్కడున్నాడే వాడు! నా తమ్ముడు లక్ష్మణుడు! భార్య దగ్గర లేనివాడు, పరాక్రమ వంతుడు. చూడగానే ఆనందము కలిగించేవాడు. చాలాకాలము నుండి భార్యాసుఖము లేనివాడు. ప్రస్తుతము భార్య అవసరము ఉన్నవాడు..అతడిని సేవించు. నీకు సవతి పోరు ఉండదు’’ అని పలుకగా ఆ రాక్షసి రాముని విడచి లక్ష్మణుని వద్దకేగి ఆయనతో “నీ సౌందర్యానికి నేనే తగిన దానను రా! హాయిగా విహరిద్దాము’’ అని పలికింది.

Also read: శ్రీరామచంద్రుడిపై మనసు పారేసుకున్న శూర్పణఖ

అప్పుడు లక్ష్మణుడు పరిహాసంగా ఒక చిరునవ్వు నవ్వి ‘‘ఓ! లోకోత్తరసుందరీ! నేను దాసుడను. అడుగో మా అన్న. ఆయనకు దాస్యము చేస్తున్నాను. నాతోపాటు నీవుకూడా దాసివి అవుతావా? ఆ బాధలు నీకెందుకు గానీ ఆయననే మరొక్కమారు అడుగు. వికృతంగా అణగిపోయిన పొట్టతో భయంకరంగా ఉన్న ఆ ముసలి భార్యను విడిచి నిన్నే చేసుకుని రమిస్తాడు’’ అని వేళాకోళంగా మాట్లాడాడు.

అది నిజమే అని నమ్మి మరల రాముని వద్దకు వెళ్లి, ‘‘ఈ వికృత రూపంతో చెడ్డదైన ముసలి భార్య నీకెందుకు? దీనిని ఇప్పుడే నేను తినేస్తాను. నాకు సవతి పోరు ఉండదు.అప్పుడు మనమిద్దరమూ సుఖముగా ఉండవచ్చు’’ అని అంటూ సీతాదేవిని భక్షించడానికి మీదమీదకు రాసాగింది.

Also read: పంచవటిలో పకడ్బందీగా, సుందరంగా పర్ణశాల నిర్మాణం

అది మీదకు వస్తుంటే సీతమ్మ వణికిపోయింది. వెంటనే రాముడు అడ్డము వచ్చి  ‘‘లక్ష్మణా’’ అంటూ కేకవేశాడు.

‘‘ఇదుగో ఈ రాక్షసులతో మనకు పరిహాసమెందుకు? ఈ రాక్షసి చాలా మదించి ఉన్నది. దీనిని వికృత రూపుగలదానినిగా చెయ్యి’’ అని పలికాడు.

వెనువెంటనే లక్ష్మణుడు ప్రక్కనే ఉన్న ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోసివేశాడు. ఆ గాయాల బాధకు అది వికృతముగా అరుస్తూ వచ్చిన దారినే పారిపోయింది.

వెళ్లి వెళ్లి ఖరుడి దగ్గర ఆకాశంనుండి రాలిన పిడుగులా పడ్డది. శరీరమంతా రక్తపు ముద్ద అయి పట్టరాని బాధతో రోదిస్తున్న సోదరిని చూసి విషయం ఏమిటి అని అడిగాడు.

Also read: పంచవటి సందర్శన

‘‘నిన్ను ఇలా చేసినవాడు ఎవడు? విషపు కోరలుగల త్రాచుపామును విలాసంగా చేతివ్రేలి కొనతో పోడిచేవాడెవ్వడు?’’

అప్పుడు శూర్పణఖ కన్నీళ్లు కారుస్తూ, ‘‘వారిరువురూ రామలక్ష్మణులనెడివారు. దశరథ మహారాజు పుత్రులు. చాలా అందముగా ,ఇంద్రియ నిగ్రహముతో మునివేష ధారులై  ఉన్నారు. వారుదేవతలో, మనుష్యులో నేను చెప్పజాలను. వారిరువురి మధ్య సకలాలంకార భూషితయై సన్నని నడుము కలిగి ఉన్న అందమైన ఒక స్త్రీ ఉన్నది. దాని వలననే వారిరువురూ నన్ను ఈ విధంగా చేశారు. వారిని నీవు వధించగా నురుగుతో నిండిన కొత్త రక్తాన్ని త్రాగాలని అనుకుంటున్నాను. ఇది నిన్ను నేనడిగే మొదటి కోరిక!

వెంటనే ఖరుడు మహాబలవంతులైన పధ్నాలుగుమంది యమసమానులైన రాక్షసులను పిలిచి సీతారామలక్ష్మణులను చంపివేయమని ఆజ్ఞాపించాడు.

Also read: అగస్త్య ముని చెంతకు సీతారామలక్ష్మణులు

వారిని వెంటపెట్టుకొని శూర్పణఖ రాముడున్నచోటికి తీసుకుపోయింది.

వారిని చూశాడు రామచంద్రుడు!

‘‘లక్ష్మణా. నీవు సీతను రక్షిస్తూ ఉండు. నేను వీళ్ళ సంగతిచూస్తాను’’ అని లేచాడు.

రాక్షసులను చూసి, ‘‘మిమ్ములను చంపమని ఋషుల ఆజ్ఞ. మీకు ప్రాణాల మీద ఆశ ఉంటె తిరిగి వెళ్ళండి. లేదా అక్కడే నిలవండి’’ అని పలికాడు రామచంద్రుడు.

ఆ రాక్షసులప్పుడు రాముని చూసి, ‘‘ఒంటరివాడవు. నీవు మమ్ములనేమిచేయగలవు? మా ప్రభువైన ఖరునకు కోపము తెప్పించి బ్రతుకగలను అనే అనుకుంటున్నావా?’’ అని అంటూనే వారు పద్నాలుగు శూలాలను ఒకే సమయంలో మహా వేగంగా విసిరారు. వారు విసిరిన మరుక్షణమే అన్నే బాణాలు రాముని ధనుస్సునుండి వేగంగా దూసుకుంటూ వచ్చి ఆ శూలాలను మార్గమధ్యములోనే ఖండించి వేశాయి.

 అర క్షణము కూడా ఆలస్యము చేయలేదు రాముడు! పదునైన మరొక పద్నాలుగు బాణాలు తీసుకొని ప్రయోగించాడు. అవి వారి గుండెలను చీల్చుకుంటూ బయటకు వెళ్లి ఉరుము వంటి శబ్దము చేస్తూ భూమిలో ప్రవేశించాయి.

ఒక్కసారిగా రక్తము చిప్పిల్లి  ప్రవహించగా వారి శరీరాలు తడిసి ఎర్రనై మొదలు నరికిన చెట్ల వలె నేలమీద దబ్బున పడ్డాయి.

ఒక్జసారిగా మహాభయంకరంగా అరుచుకుంటూ మరల ఖరుడి వద్దకు వెళ్ళింది శూర్పణఖ!

Also read: రాక్షసులతో రాముడికి అకారణ వైరం ఎందుకు: సీతమ్మ ధర్మసందేహం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles