రామాయణమ్ – 64
పంచవటి చాలా మనోహరంగా ఉన్నది .
చుట్టూ పర్వతాలు అందమైన దాతువుల చేత ప్రకాశిస్తూ వివిధ వర్ణ శోభితమై రమణీయంగా కనపడుతున్నాయి. ఎటుచూసినా ఎత్తైన చెట్లు. సాల, తాళ, తమాల, పనస, ఆమ్ర, నివార, తిమిస, పున్నాగ, చందన, స్పందన, నీప, పార్ణాస,
లికుచ, ధవ, అశ్వకర్ణ, ఖాదిర, సామీ, కిమ్సుక, పాటల వృక్షాలు కనపడుతూ ఉన్నాయి.
Also read: పంచవటి సందర్శన
అందంగా మెలికలు తిరుగుతూ చక్రవాక పక్షులచేత శోభితమై ఉన్న గోదావరీ నదిని చూడగానే రాముడి మదిలో ఉత్సాహం ఉరకలేసింది. ఒక చక్కని ఎత్తైన ప్రదేశం ఎంచుకుని ‘‘లక్ష్మణా ఈ ప్రదేశం చాలా బాగున్నది. ఇక్కడ పర్ణశాల నిర్మించుకొందాం’’ అని పలికాడు.
వెంటనే లక్ష్మణుడు ఆ ప్రాంతములో మట్టిని బాగా ఎత్తుగా చేశాడు. మంచి దృఢమైన స్తంభాలు తీసుకొచ్చి నిలిపాడు. పొడవైన వెదుళ్లతో వెన్నుబద్ద ఏర్పాటు చేశాడు. జమ్మికొమ్మలు తెచ్చి పరచి చాలా గట్టిగా కట్లుకట్టాడు. దాని మీద రెల్లుగడ్డి, దర్భలు, ఆకులు వేసి కప్పేసాడు. లోపటి నేలను చదును చేసాడు.
ఆ పర్ణశాల చూడటానికి అందంగా, విశాలంగా ఉంది. రాముడికోసం చాలా అందంగా తీర్చిదిద్దాడు లక్ష్మణుడు. అక్కడ దేవతా పూజలుచేసి నివసించటానికి సిద్ధమైన పర్ణశాల రాముడికి చూపాడు.
Also read: అగస్త్య ముని చెంతకు సీతారామలక్ష్మణులు
ఆ పర్ణశాల చూడగానే ఆనంద భరితుడై గట్టిగా తమ్ముని కౌగలించుకొని ‘‘లక్ష్మణా, నాన్న లేని లోటు నీవు తీరుస్తున్నావు. నా తండ్రి నీ రూపంలో మరల కనబడుతున్నాడు నాకు” అని పలికాడు.
ఆ పర్ణశాలలో సీతా సమేతుడై లక్ష్మణుడు సేవ చేస్తూ ఉండగా స్వర్గంలో దేవేంద్రుడు నివసించినట్లు కొంతకాలం నివసించాడు రామచంద్రుడు.
పంచవటీ తట సుస్థిత రాముడు ఆనందముగా కాలము వెళ్ళ దీస్తున్నాడు.
రోజులు, వారాలు గడుస్తున్నాయి.
నెలలు మారుతున్నాయి.
ఋతువులు దొర్లుతున్నాయి.
రాముడికి ఇష్టమైన హేమంతం రానే వచ్చింది.
ప్రకృతి రామణీయకత మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నది.
ఒకనాటి రాత్రి గడిచి తెల్లవారింది. స్నానానికి గోదావరీ తీరానికి వెళ్ళాడు రాముడు. ఆయన వెంట సీతమ్మ, చేతిలో కలశముతో లక్ష్మణుడు కూడా వెళ్ళారు.
Also read: రాక్షసులతో రాముడికి అకారణ వైరం ఎందుకు: సీతమ్మ ధర్మసందేహం
మంచు పడుతూ ఉన్నది శరీరాలు బిరుసెక్కిపోయి వేడి
పుట్టించే అగ్నికోసం వెతుక్కునే కాలమది. నీళ్ళు ముట్టుకుంటే చేతులు జిల్లుమంటున్నాయి. సూర్యుడు ఎక్కువగా దక్షిణ దిక్కునే ఉంటున్నాడు. ఉత్తరదిక్కు తిలకము లేని స్త్రీ వలె ప్రకాశించటం లేదు.
జనమంతా సూర్యోదయము కోసము ఆయన కిరణ స్పర్స కోసము ఎదురు చూస్తున్నారు. నీడలు, నీళ్ళు భరించ లేక పోతున్నారు. పడమర దిక్కునుండి చల్లటి గాలులు వీస్తున్నాయి. వరిచేలు బంగారు రంగును సంతరించుకొన్నాయి.
ఎండ కాస్త ఎర్రగా కాస్త తెల్లగా ఉన్నది. పచ్చిక బయళ్ళమీద మంచు బిందువులు పడి సూర్యకాంతికి ప్రతిఫలించి వజ్రాల రాసుల లాగా మెరుస్తున్నాయి.
ఏనుగులకు దాహం వేసి నీటి దగ్గరకు వెళ్లి తొండము నీటికి ఆనించి మరల వెనుకకు లాగుకుంటున్నాయి.
పిరికివాడు ఏవిధంగా యుద్ధరంగానికి దూరంగా ఉంటాడో ఆవిధంగా నీటిపక్షులు నదిలోకి వెళ్ళకుండా దూరంగా ఒడ్డునే కాలక్షేపం చేస్తున్నాయి.
ప్రకృతి సొగసులు చూస్తూ అడుగులు వేస్తున్నాడు రాముడు.
Also read: దండకారణ్యంలో నివాసయోగ్యమైన స్థలంకోసం రాముడి అన్వేషణ
ఆ సమయములో లక్ష్మణుడికి భరతుడు గుర్తుకు వచ్చాడు. ఇంత తెల్లవారు ఝామున ఈ చలిలో భరతుడు స్నానమెలా చేస్తున్నాడో గదా!
అతడు సుకుమారుడు. సుఖాలకు అలవాటు పడ్డవాడు. నీవు అడవులకు వచ్చావు. నిన్ను అనుసరిస్తూ ఆయన అక్కడ నియమ నిష్టలతో తాపస జీవనం గడుపుతున్నాడు.
మానవులు తండ్రి స్వభావాన్ని అనుకరించరు. తల్లి స్వభావాన్ని అనుసరిస్తారు. కానీ భరతుని విషయములో అలా జరుగలేదు. తల్లి స్వభావాన్ని అనుకరించలేదు.
అక్కడ భరతుడు ఇక్కడ మనము, ఇందరి కష్టాలకు కారణమైన స్వభావము కైకమ్మకు ఎక్కడనుండి వచ్చినది? ధర్మాత్ముడైన భర్త, ఋజువర్తనుడు అయిన కొడుకు కలిగిన స్త్రీ అలా ఎందుకు ప్రవర్తించిందో గదా!
వింటూ నడుస్తున్న రాముడు తల్లి నింద చెవుల పడేసరికి సహించ లేక పోయాడు. నాయనా లక్ష్మణా! ఎట్టిపరిస్థితిలోను మన మధ్య మాంబను నిందిస్తూ నీవు ఒక్క మాట కూడా మాట్లాడ వద్దు. భరతుడి గురించి చెప్పు చాలా ఆనందముగా ఉన్నది నాకు’’ అని అన్నాడు. ‘మన నలుగురమూ కలిసి హాయిగా మళ్ళా ఎప్పుడోకదా ఉండేది’ అని అంటూ నదిని సమీపించాడు.
Also read: దండకారణ్యంలో విరాధుడి వధ
వూటుకూరు జానకిరామారావు