Thursday, November 7, 2024

లఖీంపుర్ ఖేరీ: బీజేపీ, మోదీ మన్ కీ బాత్

లఖీంపుర్ ఖేరీలో ఎనిమిది మంది మరణించారు. వారిలో నలుగురు నిరసన తెలుపుతున్న రైతులు. ఎస్ యూవీ వాహనం వారిమీది నుంచి వెళ్ళగా దాని కిందపడి నలుగురు రైతులూ దుర్మరణం పాలైనారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి చెందిన వాహనం అది. ఆ ఘటన దరిమిలా జరిగిన హింసాకాండలో ఒక జర్నలిస్టూ, ముగ్గురు బీజేపీ మద్దతుదారులూ చనిపోయారు. లఖీంపుర్ ఖేరీలో జరిగిన ఘోరమైన ఘటనను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎస్ యూ వీ వాహనం రైతుల మీదుగా వెళ్ళి రైతులు చనిపోవడానిక ముందూ, తర్వాతా జరిగిన ఘటనలను గుర్తు చేసుకోవాలి. ఈ ఘోరం ఏ నేపథ్యంలో జరిగిందో అర్థం చేసుకోవడానికి ఆ ఘటనలన్నిటినీ కలిపి పరిశీలించాలి. ఈ ఘటన మన రిపబ్లిక్ కి ఏమని స్పష్టమైన సందేశాన్ని అందించిందో, మన ప్రజాస్వామ్య వ్యవస్థకూ, సాధారణ ప్రజలమైన మనకూ దాని వల్ల కలిగే పర్యవసానాలు ఏమిటో అర్థం చేసుకోవాలి. ఈ అంశాలను వివరించే ప్రయత్నం ఇక్కడ చేస్తాను.

లఖీంపుర్ ఘటనలో ఏమి జరిగిందో పునఃపరిశీలిద్దాం. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న రైతులు ఈ నెల మూడవ తేదీన లఖీంపుర్ ఖేరీకి ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి సందర్శన పట్ల నిరసన వెలిబుచ్చుతూ ప్రదర్శనగా వెడుతున్నారు. ఒక కారుల బారు ఆ ప్రదర్శకులపైకి వెళ్ళిపోయింది. ఎనిమిదిమంది మరణించారు. డజన్ల మంది దాకా గాయపడ్డారు. చనిపోయినవారి శరీరాలపైన టైర్ల గుర్తులు ఉన్నాయి. వాహనాల కింద వారు నలిగిపోయారు. ఆ వాహనాల బారులో ఒక ఎస్ యూ వీ ఉంది. అది కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిది. మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రా పొలాలలోకి పరుగెత్తుతుంటే చూశామని సాక్షులు చెబుతున్నారు. ఆశీష్ మిశ్రా ఉరఫ్ మోనూ ఆ ప్రాంతంలో బీజేపీ నాయకుడు, అసెంబ్లీ టిక్కెట్టు కోరుకుంటున్నాడు. నిరసనకారుల మీదుగా కారు వెళ్ళిన తర్వాత హింసాకాండ మొదలయింది. ఆ సందర్భంగా మరో నలుగురు వ్యక్తులు మరణించారు. వారిలో ముగ్గురు బీజేపీ మద్దతుదారులు, ఒక వ్యక్తి జర్నలిస్టు. ముగ్గురు బీజేపీ మద్దతుదారులలో ఒకరు ఆశీష్ మిశ్రా డ్రైవర్ అని చెబుతున్నారు.

రైతు నాయకుడు రాకేష్ తికాయత్

అక్టోబర్ 9వ తేదీ రాత్రి పొద్దుపోయిన తర్వాత యూపీ పోలీసులు ఆశీష్ మిశ్రాను అరెస్టు చేశారు. ఆశీష్ మిశ్రా నివాసం ఎదుట గేటుపైన సమన్స్ నోటీసు అతికించినప్పటికీ ఆయన పోలీసుల ఎదుట హాజరు కాలేదు. తన కుమారుడు అనారోగ్యంగా ఉన్నాడనీ, ఇంటిలోనే ఉన్నాడనీ తండ్రి కేంద్రహోంశాఖ సహాయమంత్రి వెల్లడించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు స్వయంగా సూమోటూగా విచారణకు స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షన ధర్మాసనం యూపీ ప్రభుత్వం తరఫున కోర్టులో హాజరైన న్యాయవాదిని మందలించింది. కోర్టు ఒత్తిడి ఫలితంగా మరుసటి రోజు ఆశీష్ మిశ్రా పోలీసులకు అందుబాటులోకి వచ్చాడు. పదిగంటలకు పైగా ఆశీష్ ని ప్రశ్నించినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. ఆశీష్ విచారణకు సహకరించడం లేదనీ, ఆయన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయనీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు అక్కడే నిరీక్షిస్తున్న మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఆశీష్ ని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచినప్పుడు అతడిని 14 రోజులపాట జుడీషియల్ రిమాండ్ కు తరలించారు. మరింత తరచి ప్రశ్నించడానికి వీలుగా పోలీసుల అధీనంలో సోమవారం నుంచి  మూడు రోజులు ఉండాలని కోర్టు నిర్ణయించింది.

ఇంతవరకూ జరిగిన కథాక్రమంలో విస్మరించరాని యదార్థాలు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఘోరహత్య జరగడానికి ముందు జరిగిన ఘటనలను కలిపి చూద్దాం. ఒకటి, హత్య జరిగిన ప్రదేశంలో ప్రతి సాక్ష్యాధారం ఆశీష్ మిశ్రాను నిందితుడిగా చూపించింది. యూపీ పోలీసులు మాత్రం అతడిని నిందితుడిగా కాకుండా కేవలం సాక్షిగానే  పిలిచారు. రెండు, తమ సమన్సును కేంద్ర మంత్రి తనయుడు ఖాతరు చేయకపోయినప్పటికీ పోలీసులు అంతగా పట్టించుకోలేదు. కొడుకు అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి పోలీసుల ఎదుట హాజరు కాలేడనీ, ఆరోగ్యం కుదట పడిన అనంతరం వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెడతాడనీ కేంద్రమంత్రి అన్నారు. మూడు, అతడిని కస్టడీలోకి తీసుకోవాలన్న సంకల్పం పోలీసులకు లేదు. నాలుగు, సుప్రీంకోర్టు ఈ కేసును సూమోటూగా పరిగణనలోకి తీసుకుంది. అయిదు,  నిందితుడు ఎంత పెద్దవాడైనా, ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నవాడైనా అరెస్టు చేసి తీరాలని సుప్రీంకోర్టు కటువుగా అన్నప్పుడు మాత్రమే యూపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది సరేనని అంగీకరించారు. ఆరు,  కోర్టు నుంచి అంత పెద్దగా ఒత్తిడి వచ్చిన తర్వాతనే ఆశీష్ ని పోలీసుల దగ్గరికి ఇంటరాగేషన్ కోసం పంపారు. ఏడు, సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒత్తిడి లేకపోయినట్లయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ ఈ మొత్తం వ్యవహారాన్ని చాపకిందికి నెట్టి ఉండేవి. ఈ హత్యాకాండలో ఆశీష్ మిశ్రా ప్రమేయం గురించి దర్యాప్తు జరిగి ఉండేదే కాదు. ఎనిమిది, లఖీంపుర్ లో మృతుల కుటుంబీకులను పరామర్శించడానికి వెళ్ళకుడా  ప్రతిపక్ష నాయకులను మార్గమధ్యంలో నిలిపివేశారు. తొమ్మిది, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి తీవ్ర ఒత్తిడి తెచ్చిన తర్వాతనే వారిని లఖీంపుర్ వెళ్ళడానికి అనుమతించారు. పది, ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సంబంధాలను తెంచివేయడం ద్వారా వారికి తక్కిన దేశంతో సంబంధాలు లేకుండా చేశారు. పదకొండు,  తన కొడుకును ప్రశ్నిస్తున్న పోలీసులపై ప్రచ్ఛన్నంగా ఒత్తిడి తెచ్చే విధంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి  పోలీసు ఠాణా దరిదాపుల్లోనే సంచరించాడు.

అజయ్ మిశ్రా, ఆశీష్ మిశ్రాల ఫోటోలత నిరసన ప్రదర్శన

లఖీంపుర్ హత్యాకాండ జరగడానికి కొద్ది రోజుల కిందట జరిగిన రెండు ఘటనలను గమనంలో పెట్టుకుంటే నేపథ్యం సవ్యంగా బోధపడుతుంది. ఒకటి, హత్యాకాండకు వారం రోజుల ముందే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తన నియోజకవర్గం స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులు తమ తీరు మార్చుకోకపోతే తాను వారిని సరి చేయగలను అంటూ హెచ్చరించారు. అనేక డిజిటల్ వేదికలపైన ఆ వీడియో విస్తృత ప్రచారం పొందింది. రెండు, అజయ్ మిశ్రా ఈ ప్రకటన చేయడానికి కొద్ది రోజుల కిందట హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రైతులకు తగిన గుణపాఠం చెప్పడానికి కార్యకర్తలు సంసిద్ధం కావాలంటూ ఉద్బోధించారు. మూడు, రైతుల ఉద్యమాన్ని నక్సలైట్ల ఉద్యమంగా, ఖలీస్థానీయుల ఉద్యమంగా, దేశద్రోహుల ఉద్యమంగా బీజేపీ నాయకులు అభివర్ణించని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. నాలుగు, మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్న విదేశీ శక్తుల పనపున రైతులు వ్యవహరిస్తున్నారని  కూడా నిందించారు. రైతు ఉద్యమం బలంగా  ఉన్న పశ్చిమ యూపీలోనూ, హరియాణాలోనూ సొంత బలం ప్రయోగించి రైతు ఉద్యమం నడ్డి విరిచేయాలని బీజేపీ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నది. ఈ మేరకు ఛోటా నాయకులు ఎవరైనా మాట్లాడితే పట్టించుకోనక్కరలేదు. కానీ కేంద్రమంత్రి మండలిలో సభ్యుడూ, అందునా దేశీయ వ్యవహారాల సహాయ మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వారు మాట్లాడినప్పుడు మరో విధంగా అర్థం చేసుకోవడానికీ, తేలికగా తీసుకోవడానికీ వీలుండదు. వారు అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత కొద్ది రోజులకే నిరసన ప్రదర్శనలో ఉన్న రైతుల దారుణ హత్య పట్టపగలు, ప్రజలు అందరూ చూస్తూ ఉండగా జరిగింది. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న రైతులతో తాము ఎట్లా వ్యవహరించాలని అనుకున్నారో దానిని దాచుకునే ప్రయత్నం బీజేపీ నేతలు చేయలేదు. రాజ్యాంగేతర పద్ధతులను వినియోగించి రైతు ఉద్యమాన్ని అణగతొక్కాలంటూ బహిరంగంగా ప్రకటించడం సరికాదనే భావన రాజ్యాంగబద్ధంగా నడుచుకోవలసిన ముఖ్యమంత్రికీ, కేంద్ర మంత్రికీ లేకపోయింది. నాయకుల సూచన మేరకు పార్టీ కార్యకర్తలు వ్యవహరించారు.

తన కొడుకు ప్రమేయం ఉన్నట్టు స్పష్టంగా కనబడుతున్న ఘోరమైన ఘటన జరిగిన వెంటనే సీనియర్ మిశ్రా దిల్లీకి హుటాహుటిన వెళ్ళి దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించవలసిన  గురుతర బాధ్యత కలిగిన దేశీయాంగమంత్రిని కలుసుకున్నారు. వారి సమావేశంలో ఏమి జరిగిందో మనకు తెలియదు. కానీ జూనియర్ మంత్రిగారు తన పదవిలో కదలకుండా ఇప్పటికీ కూర్చొని ఉన్నారు.  ఆశీష్ మిశ్రా తండ్రి మంత్రిపదవిలో ఉంటేనే విచారణ నిస్పాక్షికంగా జరుగుతుందని దేశీయాంగమంత్రి అనుకుంటున్నారని భావించవలసి వస్తున్నది. లఖీంపుర్ ఘటన గురించి దేశీయాంగమంత్రి ఏమని అనుకుంటున్నారో ఈ దేశానికి తెలియవలసి ఉంది. విషాదంలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపే తీరిక దేశీయాంగమంత్రికి లేకపోయింది. తన సొంత పార్టీ కార్యకర్తలు ముగ్గురు చనిపోయారని గుర్తు పెట్టుకోవాలి. వారి కుటుంబాలకు సైతం దేశీయాంగమంత్రి అనునయ వచనాలు చేరలేదు.

లఖీంపుర్ ఖేరీలో ఘోరమైన హత్యలు జరిగి పది రోజులైనప్పటికీ ఆ దుర్ఘటన గురించి ప్రధానమంత్రి విచారంగా ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. అదే రాష్ట్రంలో బారాబంకీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుంటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, వారికి ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ఈ రోడ్డు ప్రమాదం లఖీంపుర్ ఖేరీ ఘాతుకం తర్వాత జరిగింది. కర్ణాటకలోని బెల్గవిలో ఇళ్ళు కూలిపోయి మరణించినవారి కుటుంబాలకు కూడా సంతాపం తెలుపుతూ ట్వీట్ ఇచ్చారు. లఖీంపుర్ ఘోరం జరిగిన సమయంలో ప్రధాని యూపీలోనే అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలోనే ఏదో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఎంచుకొని కొంతమంది విషయంలో సంతాపం ప్రకటించడం, మరికొంత మంది విషయంలో మౌనంగా ఉండటం ఇదే ప్రథమం కాదు. దాద్రీ, దానిష్ సిద్దికీ, మరి అనేక మంది విషయంలో, పలు  సందర్భాలలో ప్రధాని మౌనం పాటించాలని నిర్ణయించుకున్నారు.   కోవిద్ కారణంగా మరణించిన వేలమందికి సంతాపం తెలుపుతూ ప్రధాని సముచితంగా స్పందించడానికి  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగం వరకూ ఆగవలసి వచ్చింది.

ఇది నిజంగా ఆశాభంగం కలిగించే పరిస్థితి. నరేంద్రమోదీ విశ్వసించే, ప్రాణప్రదంగా పరిగణించే కరుణ, సాహసం వంటి విలువలకు ఇది విరుద్ధం. ఏడేళ్ళ కిందట చిన్న పొరపాటునూ, స్వల్పమైన అపసవ్యాన్నీ సహించకుండా వ్యాఖ్యానించే వైఖరితో ఇప్పటి ధోరణికి పోలికే లేదు. మోదీ సర్వజ్ఞుడూ, శషభిషలు సహించని కార్యశూరుడూ  అనే మహాపురుష వ్యక్తిత్వ పరికల్పన కోసం అల్లిన అలవికాని సాహసోపేతమైన కథలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. శక్తిమంతమైన బీజేపీ డిజిటల్ విభాగం ఈ కథలకు విస్తృత ప్రచారం ఇచ్చింది. ఒక కథ ఇలా సాగింది: తన మంత్రిమండలి సభ్యుడైన ఒక మంత్రి అయిదు నక్షత్రాల హోటల్ లో కూర్చొని ఒక వ్యాపారవేత్తతో బాతాఖానీ కొడుతున్నాడు. సదరు మంత్రి మొబైల్ మోగింది. అటువైపు నుంచి లైన్ లో ప్రధాని. ఎదురుగా ఉన్న వ్యక్తితో కలసి ఉండటం సముచితం కాదనీ, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనీ ప్రధాని ఆదేశించారు. మంత్రి వెళ్ళిపోయారు. మరో కథ ప్రకారం ఒక మంత్రి విదేశానికి వెళ్ళేందుకు విమానాశ్రయానికి వెడుతున్నారు. జీన్ ప్యాంటూ, షర్టూ వేసుకొని ఉన్నాడు. ఆయన ఫోన్ మోగింది. ప్రధాని. భారత దేశ ప్రతినిధిగా జీన్స్ లో ఎట్లా కనబడతారంటూ మంత్రిని చివాట్లు పెట్టారు. మంత్రి తన కారును వెనక్కి తిప్పించి, ఇంటికి వెళ్లి, దుస్తులు మార్చుకొని విమానం ఎక్కారు. ఒక మహిళామంత్రి ఫోన్ ఒక రోజు ఉదయం గం. 9.30లకు మోగింది. ఇంట్లో ఏమి చేస్తున్నారంటూ ప్రధాని అడిగారు. తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తులను కలుసుకుంటున్నానంటూ ఆమె సమాధానం చెప్పారు. వారికి కావాలంటే కార్యాలయంలో కలుసుకోవచ్చు. కార్యాలయానికి మాత్రం సకాలంలో రావాలంటూ హెచ్చరించారు. నాలుగో కథ చాలా సూటైనదీ, ఘాటైనదీ. ప్రధాని కార్యాలయానికి ఒక మంత్రినీ, అతడి కుమారుడినీ పిలిపించారు. ఏదో ఉపకారం చేయడానికి ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న సొమ్ము వాపసు ఇవ్వవలసిందిగా సూటిగా, నిర్మొహమాటంగా తండ్రీకొడుకులకు చెప్పారు. వారు దిగ్భ్రాంతి నుంచి కోలుకునేలోగానే ప్రధాని గది నుంచి నిష్క్రమించారు.

విలపిస్తున్న కుటుంబ సభ్యులకు మృతి చెందిన రైతుల ప్రాణాలను తిరిగి ఇవ్వవలసిందిగా లఖీంపుర్ కు చెందిన మంత్రికీ, తనయుడికీ  ప్రధాని చెప్పలేరు. న్యాయవ్యవస్థకు లొంగిపోవలసిందిగా కొడుకుకీ, రాజకీయాలలో  ఉన్నత విలువలను పాటించవలసిందిగా తండ్రికీ ప్రధాని చెప్పగలిగితే బాగుండేది. తాను ఉన్నత విలువలు పాటిస్తున్నానని ప్రజలు అనుకోవాలని కోరుకునే ప్రధాన మంత్రికి తన మంత్రిమండలిలో ఉన్న వ్యక్తి  కుమారుడు పోలీసులకు లొంగిపోవడానికి సుప్రీంకోర్టు మొట్టికాయ వేయడం, ప్రజలు గగ్గోలు పెట్టడం అవసరమా? అటువంటి పరిస్థితులు దాపురించడం మన గణతంత్రానికి శోభాయమానం కాదు. అంతర్జాతీయ వేదికలపైన సగర్వంగా చెప్పుకునే మన ప్రజాస్వామ్యానికి తీరని కళంకం. తమ నాయకులు సమున్నతంగా ఉంటారని ఊహించుకున్న ప్రజలు అది అసత్యమనీ, కేవలం భ్రమ అనీ, పెద్ద ప్రచారకాండలో భాగమనీ తెలుసుకున్నప్పుడు ‘మోసం గురూ’ అనుకుంటారు.

Also read: కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే…

Dr. Parakala Prabhakar
Dr. Parakala Prabhakar
The author is an Economist, Policy Consultant, Former Adviser to Government of Andhra Pradesh. Managing Director of RightFOLIO, a knowledge enterprise based in Hyderabad.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles