Sunday, November 24, 2024

దేహానికైనా దేశానికైనా మన చేష్టలు మంచివై ఉండాలి!

నూర్ బాషా రహంతుల్లా

భారతదేశ సహజ సంపద ప్రజలకు సమంగా అందితే ప్రజల్లో పేదరికం ఉండదు. దేహానికి పోషకాహారం సరిగా అందితే రక్తహీనత తలెత్తదు. పంటలకు సాగునీరు మనుషులకు త్రాగునీరు అందించే భారీ ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అన్నారు. పొత్తిళ్లలోనే బాల్యం దుర్భర వేదనల పాలవుతున్నదని ప్రపంచ ఆకలి సూచీ చెబుతోంది. 19 కోట్ల మంది పోషకాహార లోపంతో బలహీనులై ఉన్నారు. పేద పిల్లలు సరైన ఎదుగుదల కొరవడి గిడసబారిపోతున్నారు. గర్భిణులు రక్తహీనతతో కృశించిపోతున్నారు. బాలబాలికల్లో ఎదుగుదల లోపాలను, బాలింతలు చూలింతల్లో రక్తహీనతను నియంత్రించాలి.

కటిక పేదరికంలో 10 కోట్ల మంది మహిళలు

ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోయిన కారణంగా పౌష్టికాహార లభ్యత తగ్గింది. 10 కోట్ల మంది మహిళలు అత్యంత పేదరికంలోకి జారిపోయారు. మన ప్రజానీకం తినే శాకాహార వంటకాల్లో తగినన్ని మాంసకృత్తులు లేక భారతీయుల్లో కండర పుష్టి కొరవడుతోంది. కరోనావల్ల కోట్లమంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆగిపోయింది. వారంతా కాలే కడుపులతో మలమల మాడిపోతూ గత్యంతరం లేక బాలకార్మికులుగా మారి నలిగిపోతున్నారు. తల్లిపాల పోషణ సక్రమంగా అందితే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. తల్లులే రక్తహీనతతో అలమటిస్తుంటే, వారి పిల్లలకు పోషకాహారం ఎలా అందుతుంది? పోషకాహారలోపంతో చాలామంది పిల్లలు అయిదేళ్లలోపే ప్రాణాలు కోల్పోతున్నారు.పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలద్వారా, పిల్లలకు పోషకాహార పంపిణీ పెంచాలి. కరోనా, తుపానులు, భారీ వర్షాలు, వరదలు సమస్యను మరింత జటిలం చేశాయి.

వాతావరణం మార్పులవల్ల మహమ్మారులు

వాతావరణ మార్పులవల్ల తుపానులు, భారీ వర్షాల తీవ్రతను పెరిగి ఆహారం, మంచినీరు, విద్యుత్‌ సరఫరా ఆసుపత్రి సేవలు దెబ్బ తింటున్నాయి. అసలు వాతావరణ మార్పుల వల్లే అనేక రకాల మహమ్మారులు తలెత్తుతున్నాయట.భారీ వర్షాలు,వరదలు మన దేశ మురుగునీటి పారుదల వ్యవస్థలలోని లోపాలను బయటపెట్టాయి. నాలాలు,మురుగు కాలువలు,నీటి ప్రవాహ మార్గాలకు అడ్డుగా మేడలు కట్టారు. వికటించి వరదలొచ్చాయి. తుపాను, వరద బాధితుల ఆశ్రయ కేంద్రాలలో కరోనా మహమ్మారితోపాటు డయేరియా, కలరా లాంటి అంటువ్యాధులూ రావొచ్చు. తగిన నీటి సదుపాయం, పారిశుద్ధ్యం ఎప్పుడైనా ఎక్కడైనా ఉండవలసిందే. మనదేశంలో విపత్తులు వరదల సమయంలో భౌతిక దూరం పాటించడం అసాధ్యంగా మారింది.అంపన్‌ తుపాను తరవాత పశ్చిమబెంగాల్ లో కరోనా మరణాలు ఎందుకు పెరిగాయి?.

వాయుకాలుష్యానికి తోడు కరోనా

కొన్నిదేశాల్లో కార్చిచ్చులు (దావానలాల) వల్ల పెరిగిన వాయుకాలుష్యంతోపాటు, కరోనా కూడా విజృంభించి అప్పటికే వేడి సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధులు, వికలాంగులు, ఎక్కువగా చనిపోయారు. ప్రకృతి విషయంలో మనిషి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితమే వస్తుంది. కూలీల వలసలకు కరవుతో పారు అకాల వర్షము కూడా కారణమే. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు భారీ సంఖ్యలో వలస వెళ్లినవారు తాము నివసించే పరిసరాలను అనారోగ్యకరంగా మార్చి ఇరుకైన ప్రదేశాల్లో నివసించడం వల్ల అంటువ్యాధులకు గురవుతున్నారు.కరోనా లాంటి మహమ్మారులు కూడా వ్యాపిస్తున్నాయి. ప్రకృతిని ఆరోగ్యకరంగా రక్షిస్తే, ఆ ప్రకృతే మనిషిని కాపాడుతుంది. అడవులను ఇష్టారాజ్యంగా నరికేస్తే , నదులూ కాలువలు నాలాలను ఆక్రమించి అడ్డుగోడలు కట్టినా , అడ్డగోలుగా ఇసుక తవ్వినా, ప్రకృతి వరదలు,కరోనాలు,కార్చిచ్చులతో విలయతాండవం చేస్తుంది.

నిరుద్యోగం పెరుగుతోంది

బిఎస్‌ఎన్‌ఎల్‌ లో 4-జి టెక్నాలజీని ఇంకా అనుమతింఛలేదు.దుర్గాపూర్‌, సేలం, భద్రావతి, నీలాచల్‌, నగర్నార్‌ స్టీల్‌ లాంటి 32 కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేస్తామన్నారు. కార్మికుల సర్వీస్‌ కాలాన్ని 30 సంవత్సరాలకు కుదించారు. 9 శాతం వున్న నిరుద్యోగం మరింత పెరుగుతుంది. చాలీచాలని జీతాలతో కార్మికులు జీవితాలు గడపవలసి వస్తుంది. కార్మికులకు జీతాలు పెంచి వారి కొనుగోలు శక్తిని పెంచాలి. కార్పొరేట్లకు రూ.18 లక్షల కోట్ల రాయితీలిచ్చారు. కార్పొరేట్‌ పన్ను 30శాతం నుంచి 23 శాతం తగ్గించారు. బ్యాంకు రుణాల మాఫీ, వడ్డీ మాఫీ మొదలైన రాయితీలు ఇచ్చారు.

ఇస్తామంటే ఎవరు వద్దంటారు?

మూడు వ్యవసాయ బిల్లులు ఆమోదించింది.యూనియన్ల ఏర్పాటు,సమ్మెలు చేయకుండా కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్‌ లుగా మార్చారు.మన రాష్ట్రంలో చిరు వ్యాపారులకు జగనన్న తోడుగా వెయ్యి కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ప్రకటించారు.ఇందిరాగాంధీ 14 బ్యాంకుల్ని జాతీయం చేసినప్పుడుగానీ గరీబీహఠావో అన్నప్పుడుగానీ పేదప్రజలు సంతోషపడ్డారు. ఇలాంటివి పేదలకు అండగా ఉండే మంచి పధకాలు. ఎవరూకాదనరు. కానీ ఇప్పుడు కార్పొరేట్ బ్యాంకులు తెరుస్తామంటే భయంగాఉంది. ఎందుకంటే కొన్ని ప్రైవేటు బ్యాంకులు కనీసం వడ్డీ కూడా కట్టలేని స్థితికి చేరుకుని చతికిలబడ్డాయి. ఇస్తామంటే ఎవరు వద్దంటారు? కానీ హామీలేమీ లేకుండానే నీరవ్‌ మోడీ లాంటి మోసగాళ్లకు వేలకోట్లు అప్పులిచ్చి వసూలుకాని పారుబాకీలలో మునుగుతూ సంస్థలనూ, బాండ్లు కొన్నవారిని, డిపాజిట్‌దార్లను ముంచేస్తున్నాయి.కొన్ని భారీ పారిశ్రామిక సంస్థలు తమ సొంత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఆ బ్యాంకుల్ని దివాళా తీయించాయి.

స్వేచ్ఛా విపణి కావాలి

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా మొండి బకాయిలు పేరుకుపోయాయి.కుప్ప కూలిన ఆర్థిక వ్యవస్థను లాభాపేక్షతో నడిచే కార్పొరేట్ బ్యాంకులు ఉద్దరిస్తాయా? రైతులు తాము పండించిన పంటలను ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునే వెసులుబాటుఉన్న స్వేచ్ఛా మార్కెట్‌ రావాలి . రైళ్లు ఆగిపోయి నిత్యావసరాల సరఫరా స్తంభించిపోతే ప్రజలకు ఎంత అవస్థ? ఇవన్నీ మనం తయారుచేసుకున్న కష్టాలే కదా? మన బలహీనత, రక్తహీనత మన చేష్టల్లోనే ఉంటుంది. దేహానికైనా దేశానికైనా మన చేష్టలు మంచివై ఉండాలి. జాతీయ పౌష్టికాహార మిషన్‌ ‘పోషణ్‌ అభియాన్‌’ ద్వారా పోషకాహార లక్ష్యాన్ని సాధించాలి. ఐక్యరాజ్యసమితికలలు గంటున్న ఆకలి బాధలు లేని సౌభాగ్య ప్రపంచాన్ని చూడాలి.

నూర్‌బాషా ర‌హంతుల్లా
నూర్‌బాషా ర‌హంతుల్లా

(రచయిత విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles