ఔత్సాహిక నాటక రంగం పరిఢవిల్లేందుకు, నాటక పునరుజ్జీవానికి, ముఖ్యంగా విద్యార్థులకు నాటకరంగం పట్ల ఆసక్తి, అనురక్తి కలిగించేందుకు కూర్మా వేణుగోపాలస్వామి (కేవీ గోపాలస్వామి) అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన కృషి ఫలితంగానే విశాఖలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో డ్రమెటిక్ అసోసియేషన్ ఏర్పాటైంది. 1943లో నెలకొల్పిన విశ్వవిద్యాలయ ప్రయోగాత్మక నాటక సమితి(ఎక్స్ పరమెంటల్ థియేటర్)అప్పట్లో ప్రముఖ నాటక కళాకేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. రంగస్థల కళల గురించి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం, ప్రయోగాత్మక, కొత్త నాటకాలను ప్రదర్శించడం, ప్రేక్షకులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించడం దీని మౌలిక ఉద్దేశ్యం. నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ 1950లో నృత్య పాఠశాలను నెలకొల్పి ఈ నాటకసమితికి సహకరించారు.
విశ్వవిద్యాలయం నాటక సంఘం
1926లో ఆవిర్భవించిన ఆంధ్ర విశ్వకళాపరిషత్ 1942లో రెండవ ప్రపంచ యుద్దం సమయంలో విశాఖపట్నంపై బాంబుదాడుల నేపథ్యంలో గుంటూరు తరలి పోయింది. ఆ సమయంలోనే (1943) ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటక సంఘం (ఆంధ్రా యూనివర్సిటీ డ్రమిటిక్ అసోసియేషన్) ప్రారంభమైంది. దాని ఆధ్వర్యంలో అదే ఏడాది నాటకోత్సవాలను ఐదు రోజుల పాటు విజయవంతగా నిర్వహించారు. ఈ సంఘం వరుసగా మూడేళ్ల పాటు ప్రదర్శించిన నాటకనాటికలు అందరి మన్ననలు పొందాయి ఈ కార్యక్రమాన్ని వినోదాత్మక ప్రధానంగా తలపెట్టినా వైవిధ్యభరితమైన ఇతివృత్తం గల నాటకనాటికలూ ప్రదర్శితమయ్యాయి. పిల్లలు, స్త్రీల కోసం రాసిన నాటకాలు, నృత్య, ఆంగ్ల,హిందీ నాటకాలు, సంగీత రూపకాలు, ఏకాంకికలు…ప్రదర్శితమయ్యేవి. విశ్వవిద్యాయ అధ్యాపకులే వీటికి దర్శకులు కాగా, విద్యార్థులే స్త్రీ పాత్రలను పోషించేవారు.
అధ్యాపకులు దర్శకులు, విద్యార్థులు నటులు
విశ్వవిద్యాలయం 1946లో విశాఖకు తిరిగి వచ్చిన తరువాత నాటకోత్సవా లను కొనసాగించారు. ప్రయోగాత్మక నాటక సమితికి ఆ రోజుల్లోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు. ఏటా విశ్వవిద్యాయ అనుబంధ కళాశాలు, వృత్తి కళాశాల విద్యార్థులతో అంతర్ కళాశాల నాటక పోటీలు నిర్వహించేవారు. ప్రతి డిసెంబర్‌లో విశ్వవిద్యాయం స్నాతకోత్సవం ముగిసిన తరువాతి ఆదివారం నుంచి ఈ నాటకోత్సవాలు జరిగేవి. ఈ పోటీల్లో ఉత్తమంగా ఎంపికైన ప్రదర్శనకు, ఉత్తమ నటీనటుకు పురస్కారాలు ఉండేవి. ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైన నాటక నాటికలను ఢిల్లీలో జరిగే అంతర్ విశ్వవిద్యాలయాల నాటక పోటీలకు పంపేవారు.
రంగస్థల బోధనకు ఆద్యులు
విశ్వవిద్యాలయాల పరిధిలో నాటక విద్యాబోధనకు శ్రీకారం చుట్టినవారు కేవీ గోపాలస్వామి. మొదటిసారిగా విశాఖలోని ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో దీనిని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. ప్రఖ్యాత రంగస్థల నటుడు బళ్లారి రాఘవాచార్యుల చొరవ, సలహా కారణంగానే రంగస్థల కళ శిక్షణ విభాగం (థియేటర్స్ ఆర్ట్స్) ఆవిర్భవించింది. విశ్వవిద్యాలయంలో రంగస్థలాన్ని ఒక అంశంగా బోధించాలన్న బళ్లారి ప్రతిపాదనకు ఆంధ్ర విశ్వకళాపరిషత్ స్పందించింది. విశ్వవిద్యాలయం అప్పటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తోలేటి కనకరాజు, ఆధునిక తమిళ నాటకరంగ పితామహుడుగా వినుతికెక్కిన సంబధన్ మొదలియార్‌తో ఏర్పాటైన కమిటీ సిఫార్సుపై చర్చల అనంతరం 1961వ సంవత్సరంలో ఈ విభాగం ఏర్పా టైంది. డాక్టర్ కేవీ ఈ విభాగం వ్యవస్థాపక అధిపతి. విశ్వవిద్యాలయం ఆవరణలో ఆరుబయలు రంగస్థలం (ఓపెన్ ఎయర్ దియేటర్) నెలకొల్పడమే కాకుండా విశ్వ విద్యాలయ అనుబంధ కళాశాలల్లో ఇలాంటివి ఏర్పాటు కావాలని గట్టిగా ప్రయత్నిం చారు.
`కూర్మా` గురించి `చాట్ల`
నట శిక్షణపై కూర్మావారికి గల దూరదృష్టి ఎలాంటిదో, అదే సమయంలో ఆయన సేవలు ఎలా సరైన గర్తింపునకు నోచుకోలేదో చెప్పేందుకు ప్రసిద్ధ రంగస్థల, చలనచిత్ర నటుడు దివంగత చాట్ల శ్రీరాములు మాటలను బట్టి తెలుస్తుంది. ఆయన మాటల్లోనే….`ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాటక శాఖ ప్రారంభిం చబడ్డ సంవత్సరం 1982. థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే సినిమా థియేటర్లు ఎలా కట్టాలనే విషయం బోధిస్తారా? అని ఆ విశ్వవిద్యాలయం పరిపాలనా విభాగం ఉద్యోగి ఒకరు అడిగారు. `కాదండీ…నటశిక్షణతో పాటు నాటక రంగంలోని వివిధ అంశాలపై బోధన జరుగుతుంది`అని చెప్పాను.`అబ్బా! నాటకాన్ని ఒక పాఠ్యాం శంగా బోధిస్తారా? ఇది మన హైద్రాబాద్ లోనే మొదలవు తుందా?లేక ప్రపంచంలో ఇంకెక్కడైనా ఇంతకు ముందు నాటకాన్ని పాఠ్యాంశంగా బోధించడం ఉందా?`అని అడిగితే నివ్వెరపోవడం నా వంతయింది`. ఈ సంభాషణకు రెండు దశాబ్దాల క్రితమే కూర్మా వారు చూపిన చొరవ స్వరాష్ట్రంలోని (అప్పటికి ఉమ్మడి రాష్ట్రమే) విశ్వవిద్యాలయాలకే చేరలేదా? అనే ఆవేదన చాట్ల శ్రీరాములు మాటల్లో వ్యక్తమవుతుందని భావించాలి.
నట ప్రముఖులతో శిక్షణ
విశ్వవిద్యాలయేతర సంస్థలు, నాటక రంగ ప్రముఖులతో విద్యార్థుకు శిక్షణ ఇప్పించేవారు. సుప్రసిద్ధ రంగస్థల నటులు బళ్లారి రాఘవ, డి.వి.సుబ్బారావు, పీసపాటి నరసింహమూర్తి, బందా కనకలింగేశ్వరరావు, పులిపాటి వేంకటేశ్వర్లు, గండికోట జోగినాథం, రాజారావు, రేలంగి తదితరులు తమ నాటకాలలోని కొన్ని భాగాలను ప్రదర్శించి, వాటిపై తమ వ్యాఖ్యలను వినిపించేవారు.
జీవిత విశేషాలు…
కేవీ గోపాలస్వామి 1903 డిసెంబర్ 19న జన్మించారు. ఆయన తండ్రి ” సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు” మద్రాసు ప్రెసిడెన్సీకి గవర్నర్ గా వ్యవహరించారు. కేవీ ఆక్స్ ఫర్డ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.1930 లో దక్షిణాఫ్రికాలో ఏజెంట్ జనరల్ ఆఫ్ ఇండియాకు కార్యదర్శిగా చేశారు. ఆ తర్వాత ఆయన స్వదేశం చేరుకొని ఆంధ్ర విశ్వకళాపరిషత్ (యూనివర్శిటీ) లో వివిధ హోదాల్లో సేవలు అందించి రిజిస్ట్రార్ గా పదవీ విరమణ చేశారు . విశ్వకళాపరిషత్ న్యాయశాస్త్ర విభాగానికి తొలి ఆచార్యులు. పదవీ విరమణ తరువాత 1973లో హైదరాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు అండ్ కామర్స్ డైరెక్టర్ (1973-1978)వ్యవహరించారు. 1983లోకన్నుమూశారు. విశ్వవిద్యాలయం, పూర్వ విద్యార్థులు, ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన పట్ల గౌరవసూచకంగా ఓపెన్-ఎయిర్ థియేటర్ కు యన పేరు పెట్టి ఏటా నాటకోత్సవాలునిర్వహిస్తున్నారు.
(డిసెంబర్ 19 కూర్మా వేణుగోపాలస్వామి జయంతి)