Sunday, December 22, 2024

కుంభకర్ణుడి స్వైరవిహారం

రామాయణమ్ 195

‘‘అడవులలో సంచరిస్తూ ఆకులు అలములు తిను ఆ వానరులు నా కేమి అపకారము చేసినారు? వారు మనమీద దండెత్తుటకు ఆ రామలక్ష్మణులు కారణము, కావున వారినే ముందు సంహరించెదను’’ అనుచూ భీకర గర్జనలు చేయుచూ కుంభకర్ణుడు శూలము చేతబూని బయలుదేరెను…

ఇంతలో ఒక గ్రద్ద అతని శూలముపై వచ్చివ్రాలెను. అతని ఎడమకన్ను, ఎడమచేయి అదిరినవి, ఒక ఉల్కనేలకు జారెను….ఇవేవీ లెక్క చేయక రణరంగమునకు మహావేగముగా కదలెను.

Also read: రణరంగానికి బయలుదేరిన కుంభకర్ణుడు

ఒక మహా పర్వతము కదిలి వచ్చినట్లుగా ఉన్న అతనిని చూడగనే గాలికి చెల్లాచెదురైన మబ్బులవలె వానరులు ఎటువారటు పలాయనము చిత్తగించిరి.

వారిని ఇంకా బెదరగొట్టుటకు కుంభకర్ణుడు భయంకరముగ సింహనాదములు చేసెను. ఆ ధ్వని వానరుల గుండెలలో ప్రకంపనలు రేకెత్తించి ఎక్కడివారక్కడే నేలకు కరుచుకొని పోయిరి. రణరంగమంతా కుంభకర్ణుని వికటాట్టహాసాలతో మారుమోగిపోయి కపివీరుల ధైర్యమును బదాబదలు చేయసాగినది.

పిడుగులు కురిపిస్తున్నట్లుగా, పర్వతాలతో బంతులాడుతున్నట్లుగా, సముద్రము క్షోభించి అల్లకల్లోలమయ్యేలా గర్జిస్తూ కోట గోడల మీద నుండి పాదములు బయటకుపెట్టి సమరము చేయుటకు సంసిద్ధుడై నిలబడ్డ కుంభకర్ణుని అత్యంత సమీపములో చూసి కకావికలై పరుగులు తీస్తున్న తన వారిని నిలవమని ప్రోత్సాహ వచనములు పలుకుతూ పౌరుషము రేకెత్తేలా మాట్లాడుతూ  అంగదుడు మరల తనవారందరినీ సమీకరించుటలో నిమగ్నుడాయెను.

Also read: రావణునితో కటువుగా మాట్లాడిన కుంభకర్ణుడు

‘‘ఓ సహచరులారా, బాగా చూడండి. ఒక మాయాబొమ్మ, మరయంత్రము ఇది. మనలను భయపెట్టుటకు పన్నిన రావణతంత్రము! కావున భయమును వీడి ఈ యంత్రాన్ని బద్దలుకొట్టండి’’ అని పలికెను.

అప్పుడు వారందరూ పెద్దపెద్ద చెట్లు ఊడబెరికి, శిలలను పెళ్ళగించి మహావేగముతో కుంభకర్ణుని ఢీకొట్టగా  వారందరిని చీమలు దులిపినట్లుగా దులిపివేసినాడు ఆ మహాయోధుడు.

ఒక చేత్తో గదాదండము గిర్రున తిప్పుతూ వస్తున్నాడు కుంభకర్ణుడు. ఆ పెనుగద తగిలి కొబ్బరికాయలు పగిలినట్లు వానరుల తలలు ఫెటేల్ఫెటేల్మని పగిలిపోతున్నాయి.

ఇంకొక చేత్తో శూలాన్నికనపడిన వానరుల తలలకు గుచ్చు తుంటే ఒక సూదిలో గుచ్చిన పువ్వులలాగా అవి వ్రేలాడుతున్నాయి.

Also read: నిద్దుర లేచిన కుంభకర్ణుడు

హనుమంతుడు ఒక కొండ చేతబట్టి కుంభకర్ణుని పై వేయగానే అతడు దానికి కొంచెం నొచ్చుకొని తన శూలంతో గట్టిగా హనుమంతుని వక్షస్థలము మీద ఒక దెబ్బవేశాడు. అది ఆ కపి వీరుని కాసేపు మూర్ఛలోకి నెట్టింది.

హనుమ దెబ్బతినటము చూసిన నీలుడు ఒక పర్వతాన్ని ఎత్తి కుంభకర్ణునిపై వేయగా అది అతడు తన పిడికిటి పోటుతో నూరు వక్కలుచేయగా ఆ ముక్కల క్రింద పడి ఎందరో వానరులు ప్రాణాలు విడిచారు.

అప్పుడు ఒక్కుమ్మడిగా వానర శ్రేష్ఠులైన ఋషభ, శరభ, నీల, గవాక్ష, గంధమాధనులు ఐదుగురూ కుంభకర్ణుని మీదకు వేగముగా వెళ్ళి అతనిని పిడికిళ్ళ చేత, పర్వతముల చేత, వృక్షముల చేత అన్నివైపులా కమ్ముకొని కొట్ట సాగిరి. ఆ దెబ్బలు అతడిని ఏ మాత్రము బాధించలేకపోయినవి.

Also read: కుంభకర్ణుడిని నిద్ర లేపేందుకు సన్నాహాలు

ఋషభుని గట్టిగా దగ్గరకు తీసుకుని అదమినాడు ఆ వానరుడు ముక్కులవెంట నోటివెంట రక్తము కక్కుకుంటూ నేలపై పడిపోయెను.

శరభుడిని పిడికిలి తోనూ, నీలుడిని మోకాలితోనూ, గవాక్షుడిని అరచేతితోనూ, గంధమాధనుడిని పాదాలతో బలంగా కొట్టెను. కుంభకర్ణుడి దెబ్బలకు మొదలునరికిన చెట్లవలే వారు దబ్బున నేలపై పడిపోయిరి.

ఇక లాభములేదనుకొని వేలకొలది వానరులు ఆతని శరీరముపై ప్రాకుచూ గోళ్ళతో రక్కతూ, పళ్ళతో కొరుకుతూ, పాదాలతో తన్నుతూ రకరకాలుగా పీడించసాగారు.

ఆ వానరులు ఎక్కిన కుంభకర్ణుని శరీరము చెట్లతోనిండిన గుట్టలాగా భాసిల్లింది.

వారందరినీ తన చేతులలోకి తీసుకొని మరమరాలు నమిలినట్లుగా నమిలివేయసాగినాడు కుంభకర్ణుడు. అప్పుడు ఆయన చుట్టూ ఉన్న నేలంతా మాంసపు బురదతో, రక్తపు వరదతో నిండిపోయెను.

Also read: లక్ష్మణుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రావణుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles