రామాయణమ్ – 196
కుంభకర్ణుడి ప్రచండ యుద్ధం చూసి ఇక ఉండ బట్టలేక సుగ్రీవుడు తానే స్వయంగా ఎదుర్కోవాలని అనుకొన్నాడు. అనుకోవడమే తడవుగా పిడికిలి బిగించి తన బలమంతా ఉపయోగించి ఒక పిడిగ్రుద్దు గుద్దాడు. ఏ మాత్రం చలించలేదు కుంభకర్ణుడు.
తన శూలాన్ని చేతిలోకి తీసుకొని సుగ్రీవుడి మీదకు సూటిగా ప్రయోగించాడు, అది గాలిని చీల్చుకుంటూ మహావేగంగా వానరరాజు మీదకు దూసుకుంటూ వస్తున్నది. ఇంతలో ఒక్కసారిగా హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ శూలాన్ని మధ్యలోనే ఒడుపుగా పట్టుకొని తన మోకాళ్ళమీద ఉంచుకొని మధ్యకు విరిచి వేశాడు.
Also read: కుంభకర్ణుడి స్వైరవిహారం
ఇంతలో క్షణమాలస్యం చేయకుండా ఆ మహారాక్షసుడు ఒక గిరిశిఖరాన్ని సుగ్రీవుడిమీదకు విసిరి వేశాడు అది వచ్చి బలంగా తాకడంతో శరీరము రక్తసిక్తమై క్రిందపడి మూర్ఛపోయాడా కపిరాజు. పడినవాడిని పడినట్లే చంకలో ఇరికించుకొని లంకవైపు సాగిపోయాడు కుంభకర్ణుడు.
అది గమనించిన అనిలాత్మజుడు ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయాడు . తాను వెళ్ళి సుగ్రీవుని విడిపించడమా? లేక ఉన్నచోటనే ఉండి కపివీరులకు ధైర్యము చెప్పడమా?
Also read: రణరంగానికి బయలుదేరిన కుంభకర్ణుడు
తాను వెళ్ళి విడిపిస్తే అది సుగ్రీవునకు ఘోరావమానము. సుగ్రీవుడి సామర్ధ్యము తానెరుగును. తనంతతానుగా బంధవిముక్తుడవ్వగల శక్తిసామర్ధ్యములు గలవాడు. కాబట్టి ఆ ఆలోచన మానివేసి అక్కడే ఉండి వానరులను ప్రోత్సహించటము మొదలు పెట్టాడు.
లంకా నగరం లో ప్రవేశించాడు కుంభకర్ణుడు ఆ నగరంలో సుగంధ పరిమళాలతో నిండిన చల్లటిగాలి సుగ్రీవుని శరీరాన్ని తాకింది మెల్లగా కనులు విప్పాడు. తనను కుంభకర్ణుడు బందీగా తీసుకొని వెళుతున్న సంగతి గ్రహించాడు..
సుగ్రీవుడికి మెలకువ వచ్చి కుంభకర్ణుని చేతిలోనుండి తప్పించుకొని అతనిమీదకు ఎగిరి ముక్కుచెవులు ఊడిపోయేలా కొరికినాడు!
Also read: రావణునితో కటువుగా మాట్లాడిన కుంభకర్ణుడు
అపుడు మరల కుంభకర్ణుడు సుగ్రీవుని పట్టుకొని కాలిక్రింద అదిమి పెట్టినాడు. చుట్టూచేరిన రాక్షసులు గదలు పరిఘలతో తీవ్రముగా సుగ్రీవుని మోదసాగారు .
వెంటనే తప్పించుకొనకపోయినచో తనప్రాణములకే ప్రమాదమని గుర్తించిన సుగ్రీవుడు తననుతాను కుదించివేసుకొని బంధనములు సడలిపోగానే సుడిగాలిలా రయ్యిన ఆకాశములోనికి దూసుకొనిపోయి వానరసైన్యమును తిరిగి చేరినాడు.
వానరవీరుల ఆనందమే ఆనందము!
ముక్కుచెవులు పోగొట్టుకొని రక్తపు ముద్ద అయి పోయినాడు కుంభకర్ణుడు.
నల్లటి కాయము మీద ఎర్రటిరక్తం. నీలపు కొండపై ఎర్రటి సంధ్యామేఘము. అవమానంతో క్రుంగిపోయి మరల అటునుండి అటే యుద్ధభూమికి బయలుదేరాడు కుంభకర్ణుడు.
Also read: నిద్దుర లేచిన కుంభకర్ణుడు
ఈ సారి అతనిని ఎదుర్కొన్నది రామానుజుడు. సౌమిత్రి ఆకర్ణాంతము నారిసారించి గురిచూసి వదిలిన బాణము వాడి గుండెలకు గ్రుద్దుకొని భేదించగా వాడి నోటివెంట భళ్ళున రక్తము కారినది. ఆ దెబ్బకు దిమ్మెక్కిపోయి ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో చేతికందినవారిని చేతికందినట్లు నోట్లోవేసుకొని కరకరనమిలివేయసాగాడు. వాడినోటబడ్డవారిలో రాక్షసులు కూడా ఉన్నారు.
ఇక ఈ దుష్టుడిని ఉపేక్షించకూడదని నిశ్చయించిన రాముడు వాడిని తనతో యుద్ధానికి ఆహ్వానించాడు. అందుకు కుంభకర్ణుడు సంతోషించి, ‘‘ఓ రామా, నేను అంతకుముందు నీతో తలపడిన రాక్షసులవంటివాడను కాను. విరాధ, కబంధ, ఖర, దూషణ మారీచులు చాలా అల్పులు. రా, నా ఈ గదా దండము నీశిరస్సును వేయివ్రక్కలు చేయగలదు, అసలు నీ బలమేమిటో నేను రుచి చూడాలనుకుంటున్నాను. కావున నీవే ముందు ఆయుధ ప్రయోగంచేయి’’ అని అహంకరించాడు.
వెంటనే రాముడు మొదట కలుసుకొన్నపుడు సుగ్రీవుడివద్ద తాను ప్రయోగించి ఏడు తాళవృక్షాలను కూల్చిన బాణాన్ని ప్రయోగించాడు దానిని కుంభకర్ణుడు అవలీలగా పట్టుకొని పూచికపుల్లలాగా విరిచి పారవేసినాడు. వెంటనే వాలిగుండెలు పగులగొట్టిన బాణాన్ని విడిచాడు. అదికూడా వ్యర్ధమయ్యింది. ఆశ్చర్యపోయాడు రాముడు.
క్రోధతామ్రాక్షుడై రాముడు ఇదుగో రౌద్రాస్త్రము అంటూ తన వింటి నుండి విడిచిన బాణము కుంభకర్ణుడి గుండెలను బలంగా తాకింది ఆ దెబ్బకు దిమ్మతిరిగి వాడు పరుగుత్తెకుంటూ రాముని తాకాలని వస్తూ మధ్యలో అసంఖ్యాకములైన వానరవీరులను రెండుచేతులా పట్టుకొని నోట్లో వేసుకుంటూ దూసుకుని వస్తూ ఉన్నాడు.
అది చూసి రాముడు వాయవ్యాస్త్రాన్ని సంధించి వాని కుడిచేతిని, ఐంద్రాస్త్రముతో ఎడమ చేతిని ఖండించి వేసెను. రెండు చేతులు తెగిపోయినప్పటికీ నోరుబాగా తెరచి వానరులను తన నోట్లోకి పీల్చుకొంటూ తన వైపు వేగంగా వస్తున్న కుంభకర్ణుని నోట్లోకి వేలకొలదిగా బాణములు గుప్పించి వదలినాడు రామచంద్రుడు. అవి ఆ పెనురక్కసుని నోటినిండా నిండి వాని అరుపు కూడాబయటకు రానంతగా కప్పివేసినవి.
ఆవెంటనే రాముడు బంగారుపొన్నుగల ఒక దివ్యాస్త్రమును సంధించి విడిచి కుంభకర్ణుని శిరస్సును ఖండించి వేసెను. ఇంకొక బాణముతో అతని దేహమును సముద్రములో పడునట్లుగా కొట్టెను.
కుంభకర్ణుడి వధను చూసి దేవతలు, మునులు, గంధర్వులు సంతసముతో రామునిపై పూలవాన కురిపించిరి.
Also read: నిద్దుర లేచిన కుంభకర్ణుడు
వూటుకూరు జానకిరామారావు