Wednesday, January 22, 2025

రణరంగానికి బయలుదేరిన కుంభకర్ణుడు

రామాయణమ్ 194

‘‘రాజులు చేయ వలసిన కార్యములు మూడు విధములు. అవి ఉత్తమము,మధ్యమము,అధమము….తాను చాలా బలవంతుడైనప్పుడు శత్రువులు బాగా బలహీనులయినప్పుడు దండెత్తి వశపరచుకొనవలెను, ఇది ఉత్తమము…. తన బలము శత్రుబలము సమానమయినప్పుడు సంధి చేసుకొనవలెను ,ఇది మధ్యమము….శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు మూర్ఖముగా యుద్ధము చేయక అతనిని అనుగ్రహింపచేసుకొనుటకు కానుకలు ఇచ్చి ప్రసన్నుని చేసుకొని ముప్పు తప్పించుకొనవలెను ..‌ఇది అధమము…

Also read: రావణునితో కటువుగా మాట్లాడిన కుంభకర్ణుడు

‘‘ఈ మూడు కార్యములు చేయుటకు మనుష్యబలము, ద్రవ్యబలము, దేశ, కాలములు, అనుకోకుండా ఏదైనా ప్రతికూలించినప్పుడు తగిన ఉపాయముతో సిద్ధముగా యుండవలెను. మన కార్యము ఏ విధముగా పూర్తి అగునో తగు ప్రణాళిక ఉండవలెను …

‘‘ఈ అయిదింటిని పరిశీలించి నీతిమంతులైన మంత్రులతో చర్చించి నిర్ణయించవలెను.అదియునుగాక ..పురుషుడు ధనసంపత్తికొరకు, కామభోగములకొరకు ప్రయత్నించవచ్చును …కానీ అందుకు తగిన కాలమేదో తెలుసుకొని విజ్ఞతతో వ్యవహరించవలెను…ఉదయము ధర్మము, మధ్యాహ్నము అర్ధము, సాయంకాలము కామము అనుభవించవచ్చును. అంతియేకానీ సర్వకాలములయందు కామముపై ఆసక్తితో అనుభవించవలెనన్న వెర్రికోరికతో మనుష్యుడు మసలరాదు. అట్లు సేవించెడి మనుజులు అధములు.

Also read: నిద్దుర లేచిన కుంభకర్ణుడు

‘‘ఇంత శాస్త్రజ్ఞానమున్న నీవు సర్వోత్కృష్టమైన ధర్మమును వదలి నీచమయిన కామమును ఆశ్రయించితివి. ఎందుకు నీ చదువులు? శత్రువునెదిరించుటకు కాలము చూసుకొనవలెనుగానీ ముందువెనుక చూడక ఎదిరించవచ్చునా? మనస్సును ఎవడు వశపరచుకొని సరిఅయిన మంత్రాంగముతో సామ, దాన, భేద, దండోపాయములను తగిన సమయములో ప్రయోగించునో వాడే విజేత అగును ! ఎన్నటికీ ఆపదలపాలవ్వడు!

‘‘మరి నీవు చేసిన పని వలన మేలుకలుగునా? లేక కీడుకలుగునా? ఏదీ మంత్రులతో చర్చించకుండా చేసినావు. ఇంతకు ముందు సమావేశములో విభీషణుడు చెప్పిన హితవును నీవు పెడచెవిన పెట్టినావు. అతడు చెప్పినదే నీకు పరమహితము. సీతమ్మను రామునకు తిరిగి ఇచ్చివేయుము అదియే సరి అయినది ….’’ అని నీతివాక్యాలు చెపుతున్న కుంభకర్ణుని చూసి తీవ్రమైన కోపముతో కనుబొమలు ముడిచి,

‘‘ఏమిది? నీకన్నా జ్యేష్టుడను. నాకు నీతిపాఠాలు చెప్పవచ్చునా నీవు?’’ అని రావణుడు క్రోధముతో పలికెను…‘‘నిన్ను నిదురలేపినది నీ నీతివాక్యములు వినుటకు కాదు. ఆపదలు వచ్చినప్పుడు ఆదుకొనే వాడే ఆప్తుడు. ఏది యుక్తము ఏది అయుక్తము అని ఆలోచించు సమయమా ఇది?  గడచిపోయినది గడచిపోయినదే. నీకు నాయందు స్నేహము, భ్రాతృవాత్సల్యము ఉండిన యెడల, నా ఈ కార్యము తప్పక చేయదగినది అని నీవు అనుకొన్న ఎడల, నా పోరపాటు వలన కలిగిన దుఃఖమును నీ పరాక్రమము చేత సరిచేయుము. పని చెడిన దీనుడిని ఆదుకొన్నవాడే స్నేహితుడు!’’

రావణుడి ఈ దీనస్వరము, అతనికి కలిగిన కోపమును చెప్పకనే చెప్పినది.

Also read: కుంభకర్ణుడిని నిద్ర లేపేందుకు సన్నాహాలు

 అది గ్రహించి కుంభకర్ణుడు, ‘‘రాజా నేను జీవించి ఉండగా నీ మనస్సులో ఎటువంటి చింత రానీయను. కేవలము సోదరప్రేమ నాచేత అలా పలికించినది. ఓ మహాబాహూ, నేడు చూడు నా యుద్ధము ఎటులుండునో. ఆ రామలక్ష్మణులను, వారి కోతిమూకను నలిపి వేసెదెను. రాముని శిరస్సును నేడే సీతకు చూపుదువుగాని. ఇంక నేటితో నీ బాధలు కడతేరినట్లే! రాజా ఇక నీవు హాయిగా మద్యము సేవించి సుఖముగా క్రీడించుము. దుఃఖమును విడిచివేయుము. ఇదుగో ఇప్పుడే నేను రణ రంగమునకు బయలుదేరుచున్నాను.’’

అప్పుడు మహోదరుడన్నవాడు కల్పించుకొని ‘‘యుద్దమెందులకు? మనము రణరంగమునకు వెళ్ళి నాలుగు బాణపు దెబ్బలు తిని వచ్చి సీతవద్దకు వెళ్ళి రాముడు మరణించినాడని చెప్పుదము.’’

‘‘అయినా రాజా, మహాబలశాలివి నీవు. నీకు నచ్చిన ఒక అబలను లొంగదీసుకొనుటకు ఇంత కధ నడవవలెనా? నీవు తలచుకొన్నచో సీత నీకు లొంగిపోగలదు! అని ఏవేవో మాటలాడుచుండగా అతనిని ఝళిపించి రావణునితో …..‘‘నేటితో రామునితో నీకు గల వైరము సమాప్తము చేసెదను’’ అని పలికి వాడియైన ఒక అతిపెద్ద శూలమును చేతబట్టి రణరంగమునకు కుంభకర్ణుడు కదిలెను.

Also read: లక్ష్మణుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రావణుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles