రామాయణమ్ – 193
‘‘రామచంద్రా, ఇతని పేరు కుంభకర్ణుడు. ఇతడు విశ్రవసుని కుమారుడు. ఇంత దేహముగల మరియొక రాక్షసుడు ఈ సృష్టిలోనే లేడు. అందరికి వరములవలన బలము పెరుగుతుంది కానీ ఇతనికి సహజముగానే బలమున్నది. ఇతడు ఇంద్ర, యమ దిక్పాలకులందరినీ జయించినాడు.
‘‘వీడికి ఆకలి ఎక్కువ. కనపడిన ప్రాణిని కనపడినట్లు నోట్లో వేసుకొని కరకర నమిలి మ్రింగేవాడు. వీడు సచేతనముగా ఉంటే సృష్టిలో ఏ ప్రాణీ జీవించలేదు. వీడికి తెలిసినవి నాలుగు- ప్రాణిభక్షణ, దేవతాపీడనము, ఆశ్రమవిధ్వంసము, పరస్త్రీహరణము …
Also read: నిద్దుర లేచిన కుంభకర్ణుడు
‘‘లోకాలు వీడిబాధ తట్టుకోలేక ఇంద్రుడికి మొరపెట్టుకుంటే ఇంద్రుడు ఐరావతముపై వచ్చి వీనిమీద వజ్రాయుధాన్ని ప్రయోగించినాడు. దానిని పూచికపుల్ల లాగా తీసి పారవైచి ఐరావతపు దంతాన్ని ఊడబెరికి ఇంద్రుడి వక్షస్థలము మీద పొడిచి చావుదెబ్బ కొట్టిన ఘనుడు వీడు. ఈ విషయము తెలిసిన బ్రహ్మ కోపించి వీనిని మృతప్రాయుడవై సదాదీర్ఘనిద్రలో పడియుండమని శపించినాడు.
‘‘అది తెలిసిన రావణుడు బ్రహ్మను వేడుకొనగా ఆరునెలలు నిద్ర, ఒక రోజు మెలుకువ అనుగ్రహించినాడు. వీడు మెలకువగా ఉన్న ఆ ఒక్కరోజు ప్రాణికోటికి మూడినట్లే. నిన్నటి నీ ప్రతాపాగ్నిజ్వాల సెగ తగిలి బెంబేలెత్తిపోయిన రావణుడు వీడిని ఇప్పుడు నిదుర లేపినాడు.
Also read: కుంభకర్ణుడిని నిద్ర లేపేందుకు సన్నాహాలు
‘‘వీడు మన సేనమీదకు వచ్చి వానరులను వందలు వేలుగా ఆవురావురు మంటూ భక్షించగలడు. వీడి ఆకారమును దూరమునుండి చూస్తూనే భయపడి మనవారు చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగులుపెట్టుచున్నారు.వీడు ప్రాణమున్న రాక్షసుడని వారికి తెలియకుండా ఉంచుట ఎంతో అవసరము. కావున రామచంద్రా! ఇది రావణుడు తయారుచేసిన ఒకమహాయంత్రమని ప్రకటింపుము. కాస్త ధైర్యము తెచ్చుకొని వానరులు యుద్ధము చేయగలరు’’ అని విభీషణుడు పలికెను.
మద్యపు మత్తులో తూలుతూ లంకానగర రాజవీధులలో నడుస్తున్న కుంభకర్ణుడి పదఘట్టనలకు భూకంపము వచ్చినట్లుగా యుండెను. నెమ్మదిగా అడుగులు వేస్తూ రాజప్రాసాదములోకి ప్రవేశించినాడు కుంభకర్ణుడు.అన్ని కక్ష్యలు దాటుకుంటూ అన్న రావణుడు ఉన్న సౌధములోనికి ప్రవేశించినాడు.
అతని ఆగమన వార్త తెలియగానే అప్పటిదాకా దిగులుతో ఉన్న రావణుడు ఏదో కొత్తశక్తి వచ్చినట్లై ఒక్క ఉదుటున లేచి వచ్చితమ్ముని కౌగలించుకొనెను.
Also read: లక్ష్మణుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రావణుడు
క్రోధముతో కళ్ళు ఎర్రబడి ఉన్న కుంభకర్ణుడు …‘‘నన్ను ఎందుకు నిదురనుండి లేపి ఇచటికి పిలిపించినావు? నిన్ను అంతగా ఇబ్బంది పెట్టిన విషయము ఏమిటి?’’ అని అడిగినాడు.
‘‘మన కులమంతా నేడు వ్యాకులచిత్తముతో యున్నది. సుగ్రీవునితో జతకట్టి సముద్రము మీద సేతువు కట్టి మనలను కొట్టుచున్నాడు ఆ నరుడు రాముడు! వానికిసైదోడు ఆ వానరుడు.
‘‘మన వైపు ఎందరో ముఖ్యులు, వీరాధివీరులు నాకొరకై తమ ప్రాణములర్పించినారు. కానీ వారి వైపునుండి ఒక్కడంటే ఒక్కడుకూడా ముఖ్యుడు మరణించలేదు. ఇది నన్ను తీవ్రముగా కలచివేయుచున్నది.
మన బలము, బలగము, ధనము అంతా నశించిపోయినది. ఇప్పుడు లంకలో పిల్లలు, వృద్ధులు మాత్రమే మిగిలినారు. ఎటుచూసినా శూన్యము. ఎవ్వరి ముఖములు చూసినా తమవారిని పోగొట్టుకొన్న దైన్యము తాండవించుచున్నది. నీవు ఆదుకొన వలసిన సమయము ఇదే!’’
దీనస్వరముతో రావణుడు పలికిన పలుకులు విని, ‘‘రాజా, నీవు ఆనాడు మా సలహాలు స్వీకరించితివి. కానీ ….వాటిని ఆచరించితివా? నేడు నీ పాప కర్మమునకు ఫలమును అనుభవించుచుంటివి. నీవు ఇటువంటి పరిస్థితిని ముందు ఆలోచన చేయక బలగర్వము చేత ఎవరినీ సంప్రదించకుండా సీతాపహరణము చేసితివి. దేశకాలములు విచారించనేలేదు. నీకు తెలియనిదా మూడువిధములైన కర్మలను అయిదు విధములైన సాధనాలతో సాధించుకొనవలెనని?’’
Also read: రావణ వీరవిహారం, వానరవీరులపై శరపరంపర
వూటుకూరు జానకిరామారావు