రామాయణమ్ – 170
అది రావణుని రాజప్రాసాదము!
అచట విశాలమైన ఒక సభాప్రాంగణము!
ఎక్కడెక్కడి నుండో గ్రక్కున వచ్చి వాలిన సామంతులు, దండనాధులు, సేనాపతులు, శస్త్రాస్త్రధారులు, శాస్త్రకోవిదులు, ప్రశస్తమనస్కులు, ఎందరో ఎందరెందరో వచ్చి యున్నారు
సూది క్రింద పడినా వినపడేటంత నిశ్శబ్దము. అందరూ శ్వాస వదిలిన శబ్దముకూడా వినిపించకుండా ఊపిరిబిగబట్టి తమ ఏలిక ఏమి చెప్పబోతున్నాడా అన్నట్లుగా చెవులు రిక్కించి కూర్చున్నారు.
Also read: సీతను రామునికి అప్పగించుము, రావణుడికి విభీషణుడి హితవు
వారిలో ఒక భయంకరాకారుడు అప్పుడే నిద్రలేచి వచ్చినాడు. ఆయన కుంభకర్ణుడు.
గంభీరమైన కంఠధ్వని ఒక్కసారిగా సభాభవనపు నలుదిక్కులా మారుమ్రోగింది.
రావణుడు ప్రసంగిస్తున్నాడు.
ఆమెను జనస్థానము నుండి నేనే తీసుకొని వచ్చాను.
Also read: విభీషణుడి సలహాను తిరస్కరించిన రావణుడు
ఆమె తళుకు బంగరు కొండ.
ఆమె శరీరపు తావి సంపెంగదండ.
Also read: రావణుడి సేనాధిపతుల ప్రేలాపన
ఆమె నెన్నుదురు నెలవంక.
ఆమె కన్నులు అరవిచ్చిన .
ఆమె అరికాళ్ళు ఎర్రటి లేత చిగురుటాకులు.
ఇంతెందుకు?
ఆమె రాశీభూత సౌందర్యము!
నా మనస్సును హోమగుండము చేసి ఆమె సౌందర్యపు ఆహూతులిచ్చినాను.
ఇప్పుడు ఆ హోమగుండములో కామగ్నిజ్వాలలు భగ్గున లేచి నా హృదయమండలమును భస్మీపటలము చేయుచున్నవి.
పురుషుడు ధర్మమును, అర్ధమును, కామమును సాధించి పరిపూర్ణజీవితము జీవించవలెను.
అవి సాధించుటలో కొన్నిపొరపాట్లు జరిగినప్పుడు అగచాట్లు తప్పవు. ఇది సహజము.
ఏది తప్పు, ఏది ఒప్పు నిర్ణయించుట కొన్ని సందర్భములలో అత్యంత దుష్కరము.
మీరందరూ సమర్ధులు. ఏది సుఖదుఃఖములకు హేతువు?
ఏది లాభము? ఏది నష్టము?
ఏది హితము? ఏది అహితము?
ఏది ప్రియము? ఏది అప్రియము?
మీరంతా ఆలోచించి నిశ్చయించిన కార్యమెన్నడునూ విఫలము కాలేదు!
ఆమె నా మదినంతా, హృదినంతా ఆక్రమించినది. ఆమెతో కలసి భోగించి, సుఖించవలెనన్న నా ఆరాటము ఆరాటము గనేమిగిలినది. ఇప్పుడు ఆమె పెనిమిటితో పోరాటము చేయవలసిన సమయము వచ్చినది ……
కామముప్రకోపించి ఆలోచన చెడి ఏమేమో మాటలాడుతున్న రావణుని మాటలు వింటున్నాడు కుంభకర్ణుడు.
ఆయన అసంబద్ధ ప్రలాపనలు రుచించలేదు కుంభకర్ణునకు.
అందుకే అన్నతో, “మహారాజా, నీవు సీతను ఎత్తుకు వచ్చుటకు పూర్వమే ఈ పరిషత్తును సమావేశపరచి సలహా సంప్రదింపులు చేసిన ఎడల సబబుగా నుండెడిది!
రావణా, ఏ రాజు న్యాయాన్ని అనుసరిస్తాడో అతనికి పశ్చాత్తాపము చెందవలసిన సమయము రాదు.
నీతి ఏదో, ఏది నీతికాదో తెలియని వాడే వెనుకచేయవలసిన పనులు ముందు ముందు చేయవలసిన పనులు వెనుక చేయుచుండును.
నీవు సరిగా ఆలోచించకుండా ఈ పనికి ఒడిగట్టినావు
Also read: ఇప్పుడేమి చేయవలె, మంత్రులకు రావణుడి ప్రశ్న.
రామునితో ఉన్న సీత కాలకూట విషము నిండిన మాంసము ,ఆ మాంసము భుజించవలెనని నీకేల ఇచ్ఛ కలిగినది!
నీ అదృష్టము.
రాముని కంట నీవుబడలేదు
సరి.
అయినదేమో అయినది.
Also read: ఇప్పుడేమి చేయవలె, మంత్రులకు రావణుడి ప్రశ్న
నీ శత్రువులు నా శత్రువులే వారిని యమపురికి సాగనంపి నీకు చింతలేకుండగ చేసెదను.
శత్రువును చంపి నీతిని అవినీతిని సమము చేసెదను. నీవు నీ భార్యలతో సుఖముగా నుండుము”
నీవు అనాలోచితముగా చేసితివి అని పలికిన కుంభకర్ణుని మాటలు విన్న రావణుని ముఖము కోపముతో జేవురించినది…
Also read: మహేంద్ర పర్వత సానువుల్లో రామలక్ష్మణులు, వానరసైన్యం
వూటుకూరు జానకిరామారావు