Thursday, December 26, 2024

తొలి భారతీయ పర్యావరణవేత్త జె.సి.కుమారప్ప

గాంధీయే మార్గం-11

జోసెఫ్ చెల్లాదురై కార్నోలియస్ (Joseph Chelladurai Cornelius) ను చరిత్రకారులు రామచంద్ర గుహ ‘గ్రీన్ గాంధీయన్’ అని కొనియాడుతూ; మనదేశంలో పర్యావరణ ఉద్యమానికీ, పర్యావరణ రక్షణ ఆలోచనకూ ఆద్యులు అని కితాబు యిస్తారు. బ్రిటన్ లో, అమెరికాలో ఛార్టెడ్ అకౌంటెన్సీ, ఇంకా మేనేజ్ మెంట్, ఎకనామిక్స్ వంటి విభాగాలలో పరిశోధనలు చేసి 1929 లో స్వదేశం వచ్చిన  వారసత్వం మీద గౌరవంతో తాతగారి పేరును స్వీకరించి జె.సి. కుమారప్పగా పేరు మార్చుకున్నారు! 

Also read: సిసలైన గాంధేయవాది పొట్టి శ్రీరాములు

కుమారప్పను గమనించిన పండిత మదన మోహన మాలవ్యా అభినందన పూర్వకంగా గాంధీజీ మంచి శిక్షణ ఇచ్చారని వ్యాఖ్యానించారట!  “కుమారప్ప రావడమే పూర్తిగా రెడీమేడ్ గా నా దగ్గరకు వచ్చారు, నేను అతనికి ఏ రకమైన శిక్షణ ఇవ్వలేదు” అని గాంధీజీ జవాబు ఇచ్చారట! అర్థిక శాస్త్రం, గ్రామీణాభివృద్ధి, చిన్న పరిశ్రమలు, పర్యావరణం వంటి విషయాలకు సంబంధించి గాంధీజీ ఆలోచనలకు సైద్ధాంతిక పుష్టి, వివరణ, ప్రణాళిక, ఆచరణ కల్పించిన గాంధీజీ గ్రామీణ సేనాని – జె.సి. కుమారప్ప!  గాంధీజీ వర్ధంతి, జనవరి 30 (1960)న కనుమూసిన అపర గాంధేయవాదీ, ఆర్థిక వేత్త జె.సి. కుమారప్ప 1892 జనవరి 4న తంజావూరులో క్రైస్తవుల ఇంట జన్మించారు.

Also read: ఏడున్నర దశాబ్దాలలో గాంధీజీ విధానాలు ఏమయ్యాయి ?

మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ శాఖలో పనిచేసిన ఎస్.డి. కోర్నిలియస్ మధ్య తరగతికి చెందిన, నిష్ట గల క్రైస్తవుడు. క్రమశిక్షణ, సమయపాలన గల మితభాషి అయిన తండ్రి కోర్నిలియస్ కు మరింత యోగ్యురాలైన ఎస్తర్ రాజనాయకమ్ భార్యగా లభించడం మరింత జీవన  శోభను ఇచ్చింది. వీరి ఆరవ సంతానం మన కుమారప్ప. తర్వాతి కుమారుడు బెంజమిన్ కోర్నిలియస్ కూడా గాంధీజీ అనుయాయి. ఈ సోదరులిద్దరూ ‘కుమారప్ప సోదరులు’గా ప్రఖ్యాతులు. చిన్న కుమారప్ప భరతన్ కుమారప్పగా ప్రసిద్ధులు. 

Also read: గాంధీజీ ఆలోచనలకు విలక్షణ వ్యాఖ్యాత డా.రామమనోహర్ లోహియా

మత ధర్మ గ్రంథాల కన్నా తల్లి నడత, జీవన విధానం కుమారప్పపై విశేషంగా ప్రభావం చూపాయి. కుమారప్పకు పెంపుడు జంతువులంటే ఇష్టం. కనుక కోళ్ళకు తిండి వేసే పనిని కుమారప్పకు తల్లి ఇచ్చింది. అంతేకాదు ప్రతినెలా ఇంటికి అవసరమైన సరుకులు కొనడానికి కుమారప్పను కూడా తీసుకు వెళ్ళేది. అక్కడ కోళ్ళకు మేతను కుమారప్పతో కొనిపించేది తల్లి. అలాగే నెల మొత్తంలో కోడి గ్రుడ్లను కుమారప్ప అమ్మి, లెక్కలు కూడా చెప్పేవారు. మిగిలిన డబ్బు(ఆదాయం) తో స్కూల్లో ఏ అనాథ విద్యార్థికో సాయం చేయమని తల్లి ప్రోత్సహించేది. ఇది తర్వాతి కాలంలో కుమారప్ప అడిటర్ అయ్యాక ప్రతినెలా కొంత మొత్తాన్ని ఇతరులకు సాయం చేసే ప్రవృత్తి గా,  తల్లికి పంపే అలవాటుగా దారి తీసింది. ప్రతి పనికి ఉండే సామాజిక పర్యవసానం గురించి అలోచించాలనీ, మరో మనిషికి కీడు చేసే ఏ పనీ చేయవద్దని కుమారప్ప పదేపదే చెప్పడానికి తల్లి పెంపకం అసలు కారణం! 

Also read: సామాన్యంగా అనిపించే అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం

ఛార్లెస్ ఫ్రీర్ యాండ్లూస్, వెరియర్ ఎల్విన్, ఆర్.ఆర్. కేథియన్ ఇంకా రాజకుమారి అమృత్ కౌర్, ఎస్.కె. జార్జి, ఆర్యనాయగమ్ మొదలయిన గాంధీజీ ఆంతరంగిక క్రైస్తవ మిత్రులలో జె.సి.కుమారప్ప ఒకరు!  క్రైస్తవమతం, గాంధేయవాదంలోని ధర్మకర్తృత్వం, అహింస, మానవ హుందాతనం, మానవాభివృద్ధి వంటి వాటిని ఆదరించి, అధ్యయనం చేసి తను ప్రతిపాదించిన ఆర్ధిక సిద్ధాంతాలలో,  గ్రామీణాభివృద్ధి విధానాలలో ‘మెటీరియలిజం’ పోకడలను తిరస్కరించారు. తద్వారా పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక – సామాజిక ఘర్షణలు, లోటు వంటివాటిని నిర్మూలించాలని గాంధీజీ ఆలోచనల ఆధారంగా సిద్ధాంతాలను రూపొందించారు కుమారప్ప. ఎకానమీ ఆఫ్ పర్ ఫార్మెన్స్, ది ప్రాక్టీస్ అండ్ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్, క్రిస్టియానిటీ : ఇట్స్ ఎకానమి అండ్ వే ఆఫ్ లైఫ్ …అనేవి కుమారప్ప ప్రఖ్యాత గ్రంథాలు. 

Also read: గ్రామీణ భారతానికి అబ్దుల్ కలాం పరిష్కారం

మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ ప్రఖ్యాత ప్రిన్సిపల్ అయిన విలియమ్ మిల్లర్ దగ్గర చదువుకున్న ఎస్.డి.కార్నిలియస్ తన ఇద్దరు కుమారులు – (కుమారప్ప బ్రదర్స్)  కూడా మంచి విద్య గడించాలనే అదే కళాశాలకు పంపారు. నిజానికి కుమారప్పకు ఇంజనీరింగ్ చదువు పట్ల ఆసక్తి ఉండేది, అయితే పరిస్థితులు అకౌంటెన్సీ చదివేలా చేశాయి. 1913లో లండన్ వెళ్ళి ఇన్ కార్పొరేటెడ్ అకౌంటెంట్ గా శిక్షణ పొంది అక్కడే ఉద్యోగం ప్రారంభించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1919లో స్వదేశం తిరిగి వచ్చారు. తల్లి కోరిక కాదనలేక బొంబాయిలో ప్రాక్టీసు ప్రారంభించారు. తొలుత ఒక ఆంగ్ల కంపెనీలో పని చేసిన, తర్వాత కొంత కాలానికి తనే కార్నోలియస్ అండ్ దేవర్ పేరున సొంతంగా ప్రారంభించారు. 

Also read: అద్భుతమైన వ్యక్తిత్వం కస్తూర్బా సొంతం

1927లో ఆటవిడుపుగా – తన సోదరుడుండే న్యూయార్క్ కు కుమారప్ప వెళ్ళాడు. ఒక నెల తర్వాత సైరాకుజ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో బి.ఎస్సీ. డిగ్రీని 1928లో గడించారు. తర్వాత కొలంబియా యూనివర్సిటీలో పబ్లిక్ ఫైనాన్స్ అధ్యయనం ప్రారంభించాడు. ఒక చర్చి ప్రసంగంలో ఇండియాలో పేదలు ఎందుకున్నారనే విషయం వివరిస్తే, ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఆ వివరాలను ప్రచురించింది. దీన్ని చూసిన ఆయన ప్రొఫెసర్ డా. ఇ.ఆర్.ఎ. సెలిగ్మీన్ చాలా సంతోషపడి ‘కాజస్ ఆఫ్ ఇండియన్ పావర్టి త్రూ పబ్లిక్ ఫైనాన్స్’ అనే విషయం మీద మాస్టర్, డిగ్రీ సిద్ధాంత వ్యాసం రాయమన్నారు. 

Also read: గాంధీజీ అవసరం నేడు ఎక్కడెక్కడ? 

దాంతో కుమారప్ప వారి సలహాను శిరసావహించి, ఆ అంశాన్ని మరింత విస్తృత పరచి – ‘బ్రిటీష్ ఇన్ జస్టిస్  అండ్ ఎక్స్ ప్లాయిటేషన్’ గా మార్చారు. అంతేకాదు, అధ్యయన ఫలితంగా జాతీయోద్యమ వాదిగా మారిపోయారు.  అంతకుమించి,  తన పేరును – పూర్వీకుల మూలాలను గౌరవిస్తూ కుమారప్ప గా మార్చుకున్నారు. అయితే ఈ మార్పు చాలా నెమ్మదిగా, బలంగా సంభవించింది.

Also read: గాంధీజీ సార్వత్రికత ఏమిటి?

 మద్రాసులో చదువుకునే కాలంలో పెట్టుబడి దారీ వ్యవస్థనూ, సామ్రాజ్య వాదాన్ని సమర్ధించే సిద్ధాంతాలు ఆకర్షించాయి. నగర జీవితంగా దృష్టి సాగిన వ్యక్తికి లండన్ జీవితం ఆ దారిలో మరింత ముందుకు తీసుకుపోయింది.  నిజానికి తల్లి వద్ద నేర్చుకున్న పాఠాలు వంటపట్టించుకున్నా మనసులోనే మరుగునపడిపోయాయి. కొలంబియా విశ్వవిద్యాలయంలో ‘ది ఎకనామిక్స్ ఆఫ్ ఎన్ టర్ ప్రైస్’ అనే సెమినార్ ప్రసంగం ఇచ్చారు. ఈ అంశానికి చెందిన ప్రొఫెసర్ డా. హెచ్. జె. దావెన్ పోర్ట్ మాత్రం వ్యక్తి లాభం అనేది ఆర్థిక శాస్త్రంలో కీలకమనేవాడు. అయితే కుమారప్పకు ఈ సిద్ధాంతం అసలు నచ్చలేదు. అదే విషయం సెమినార్ లో వివరించాడు. కుమారప్ప వాదం నచ్చకపోయినా ఆ ప్రొఫెసరు మంచి మార్కులు వేశారు. 

Also read: రాగద్వేష రహితమైన, వివేకం గల విజ్ఞాన దృష్టి

ఆరోజు నుంచి జే. సి. కుమారప్ప దృక్పథం పూర్తి గా మారిపోయింది. వ్యక్తి  ప్రాధాన్యత ఇవ్వాల్సింది సంపదకు కాదు , అలాగే అతనికి రాజకీయ, సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక పరమైన బాధ్యతలున్నాయని గుర్తించి అటువైపు దృష్టి మళ్ళించాడు!  ఫలితంగా ధనం ఆర్జించే విషయాలు కాకుండా వేరే అంశాలతో వ్యాసాలను కుమారప్ప రాశారు. ఆ వ్యాసాలు గాంధీజీ దృష్టిలో పడ్డాయి. ఆకర్షించాయి!

Also read: అవును… నేడు గాంధీయే మార్గం!అవును… నేడు గాంధీయే మార్గం!

(ముగింపు వచ్చేవారం)

డాక్టర్ నాగసూరి వేణుగోపాల్

మొబైల్: 9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles