82వ జన్మదినోత్సవ అభినందన
ఆయనది ఎడతెగని స్నేహం, సుమధుర ప్రేమైక వాత్సల్యం, తారతమ్యాలు చూడని తత్వం, అద్వితీయ భాష్యం, మానవతా వాదం. తెలుగు కథా నేపథ్యం గురించి సాధికారికంగా విశ్లేషణ చేయగల సమర్ధులు. గాంధేయ భావాల పై తెలుగులో పదుల సంఖ్యలో రచనలు చేసిన ఏకైక వ్యక్తి. రవీంద్రనాథ్ టాగూర్ నుండి మానవేంధ్రనాధ్ రాయ్ దాకా, సర్ధార్ వల్లభాయ్ పటేల్ తో ప్రారంభించీ, షహీద్ భగత్ సింగ్ వరకూ విస్తృతంగా అధ్యయనం చేసిన వ్యక్తి. బెర్ట్రాండ్ రస్సెల్ ఆలోచనల ద్వారా ప్రభావితం అయిన మేధావి. వీటన్నింటికీ మించి తెలుగులో మాత్రమే కాదు, భారతీయ భాషల్లో ఎందులోను లేని విధంగా , “తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ.” ఆయన కృషిని ఎలుగెత్తి చాటిన అపూర్వ గ్రంథరాజం. ఆయనే మన, ‘కోడూరి శ్రీరామమూర్తి గారు.’
భారతదేశంలో లౌకికవాదం గురించిన చర్చకి తెరతీసినా, మనకు తెలియని మహాత్ముడు అంటూ గాంధీజీ గురించి కలంతో కొత్త కోణాల్ని ఆవిష్కరించినా, ఏడుపదుల వయసులో సైతం ఎందరినో ఆశ్చర్యపరుస్తూ భయమె రుగని ధీరుడు భగత్సింగ్, నిరంతర సత్యాన్వేషి యం.యన్. రాయ్ ల కోసం విస్తృతంగా శోధించి రచనలు చేసినా, పర్యావరణం మొదలుకొని ప్రజాస్వామ్యం వరకూ లోతైన అవగాహన పెంచే పుస్తకాల్ని కూర్చినా, వీటన్నింటికీ తలపెట్టుగా ఏకంగా, “స్వాతంత్ర్యానంతర యుగంలో వచన సాహిత్యం – సంప్రదాయము, ప్రయోగము” పేరిట తన వందలాది అద్భుతమైన వ్యాసాల్ని ఒక్క దరికి చేర్చి అముద్రిత పరిశోధనా రచనగా చేసినా, అవన్నీ అద్భుతమైన ఆయన కృషికి అక్షర రూపాలే!
స్వాతంత్ర్యోద్యమ ప్రభావం మొత్తం కుటుంబ నేపథ్యం లోనే ఉండడంతో బాల్యం నుంచే దేశం పట్ల ప్రేమాభిమానాలు ఏర్పడిన ఆయన తల్లి ఆలోచనా విధానంతో ప్రభావితం అయ్యారు. ఉత్తరాంధ్రలో కొన్నాళ్ళు అధ్యాపకుడిగా పని చేసి, రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు. తాను అనుకున్న విషయాన్ని సూటిగా,స్పష్టంగా, సౌమ్యంగా, సోదాహరణంగా చెప్పడం కోడూరి ప్రత్యేకత. తెలుగులో ఆయన రచనలు ప్రచురించని సంస్థలు తక్కువ. గాంధేయ వాద ప్రధాన సంఘాల నుండి వామపక్ష కూటముల వరకూ, విజ్ఞాన వేదికల నుండి విప్లవసంఘాల దాకా ఎందరికో ఆయన ఆప్తుడే. అందుకనే ఈ వయసులో సైతం ఆలోచనా విస్తృతి అబ్బురం అనిపిస్తుంది!
దాదాపు పదేళ్ళ క్రితం “విస్మృత స్వరాలు’ పేరిట ప్రచురించిన గాంధేయవాదుల ఇంటర్వ్యూల పుస్తకానికి కోడూరి వారి ముఖాముఖి ఒక నిండుతనం. అలాగే, గతేడాది పుట్టిన రోజుకే అనుకుంటాను, స్టాలిన్ గారూ, నేనూ ఆయన్ని చూడటానికి వెళ్ళినప్పుడు మంచం మీద ఉన్న ఆయనతో సందేహిస్తూనే చెప్పాను, ‘ దరిశి చెంచయ్య గారి కోసం ఒక సంకలనం చేస్తున్నాను. మీరేమైనా చెప్పగలరా? అని” ఆ పరిస్థితిలో కూడా కాదన లేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించ కుండా రాసుకోండని ఒక పేజి లేని ఓపిక తెచ్చుకు మరీ చెప్పారు. మొన్న ఆ సంకలనం పుస్తకం తీసుకు వెళ్ళి ఆయన చేతికిస్తే సంతోషంగా చెంచయ్య గారికి చరిత్రలో జరిగిన అన్యాయం గురించి ఎంతగా ఆవేదన చెందారో ఆ జ్ఞాపకశక్తికి డాక్టర్ గారూ, నేనూ స్థాణువుల మైపోయాం !
ఇదికాదు నన్ను ఆశ్చర్య పర్చింది. ఒకపక్క ఆరోగ్యం బాగాలేక పోయినా నిరంతర రచనా వ్యాసంగం కొనసాగిస్తూ, ఆ రచనలకోసం అవసరమైన పరిశోధనా గ్రంథాల్ని అనేక దేశాల నుండి పిల్లల ద్వారా తెప్పించుకుని మరీ శోధన చేయడం. భగత్ సింగ్ పుస్తకం కోసం అప్పట్లో భగత్ సింగ్ తదితరుల కార్యక్రమాల కోసం బ్రిటీష్ ప్రభుత్వ రహస్య విచారణ విభాగం అందజేసిన నివేదకల్ని సంపాయించి అంతేసి లావు పుస్తకాలు బౌండు చేసుకు మరీ ఆయన అధ్యయనం చేస్తున్న తీరు చూసి అవాక్కైపోయాను. సాహిత్యం మొదలు సామాజిక సమస్యల వరకూ ఆయనకి ఉన్న అవగాహన, అధ్యయనశీలత, అంతకు మించి నేనంటే ఆత్మీయత వెరసి తెలుగు సాహిత్యంలో అరుదైన గాంధేయ వాద రచయితగా మిత్రులు,పెద్దలు కోడూరి శ్రీ రామమూర్తి గారి గురించి ఆయన 82 వ పుట్టిన రోజు సందర్భంగా ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న ఈ పరిచయం!
(కెమెరా విజయ్ కుమార్ మాష్టారి ద్వారా అయిన మా పరిచయం స్నేహంగా మారి దశాబ్దం దాటింది. ఇన్నాళ్ళలో ఎన్నో కార్యక్రమాలు ఆయనింట్లో నిర్వహించాం. భగత్ సింగ్, రాయ్, చంద్రశేఖర్ ఆజాద్ ల కోసం ఆవిష్కరించిన ఆయన పుస్తకాలకి నేను వక్తని కూడా. అలాగే, మా ప్రచురణల్ని ఆయన దగ్గరకి తీసికెళ్ళి ఇచ్చి వారి విలువైన అభిప్రాయాలు కోరడం కూడా ఇన్నాళ్ళుగా చేస్తున్నాం. గోదావరి ప్రాంతానికి వచ్చే ఆలోచనా పరులంతా తప్పనిసరిగా ఆయనింటిని సందర్శిస్తారు. భార్య భారతి గారితో ఉంటూ శరీరం కదల్లేని పరిస్థితుల్లో సైతం జనాల మెదళ్ళని కదిలించే కలం బలంతో అవిశ్రాంత అక్షర సేద్యం చేస్తున్న ఆప్తులు కోడూరి శ్రీరామమూర్తి గారి గురించి ఇప్పటికిలా చిన్న రైటప్!)
Also read: ‘మా అక్కకి నేను పెట్టిన పేరు-‘నిశ్శబ్ధం’ (I named my sister “Silence”)
- – గౌరవ్