కె. ఎస్. స్మృతిలో ‘డియర్ కామ్రేడ్‘ !!
(విశిష్ట వ్యక్తి గూర్చి వ్యాస సంకలనం)
“మానవతావాదులు కమ్యూనిస్టులు కావాలనేమీ లేదు. కమ్యూనిస్టులు మాత్రం మాన వతా వాదులు కావాలి. శ్రమను గౌరవిస్తూ నిరంతరం ప్రజల కోసం ప్రజలతో మమేకం కావాలి. ప్రేమపూర్వకమైన మానవ సంబంధాలు, పరిపూర్ణ మైన నైతికవిలువలు కలిగి ఉండాలి. పత్రికలు, పుస్తకాలు చదవటం అలవర్చు కోవాలి. మార్క్సిజం వంట పట్టించు కోవడానికి సాధన చేయాలి.”
పీపుల్స్ వార్‌లో కే. యస్. గా కొండపల్లి సీతా రామయ్య ఎంత ప్రసిద్ధో కాకినాడ లో కే. ఎస్. గా పీపుల్స్ లీడర్‌గా కుడిపూడి సూర్యనారాయణ కూడా అంతే ప్రసిద్ధి. జీవితం త్యాగాల మయం చేసుకున్న ఆయన్ని ‘ఇంద్రపాలెం సుందరయ్య’ అని కూడా అంటారు. ఆయన గతించిన సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఆయన మిత్రులు, ఉద్యమ సహచరులు రాసిన దాదాపు పాతిక విలువైన వ్యాసాలతో తీసుకొచ్చిన వ్యాస సంకలనం ‘డియర్ కామ్రేడ్’!
“ఆమె అతడికి అర్ధాంగి కాదు, సంపూర్ణాంగి, అందుకే అతడి జీవనకావ్యం ఆమెకే అంకితం, సరస్వతీ సూర్యనారాయణకు నీరాజనం” అంటూ పుస్తకం తిప్పగానే కనిపించిన వాక్యాలు భార్యాభర్తల అన్యోన్యతకు నిదర్శనంగా ఉన్నాయి. అర్ధవంతమైన కామ్రేడ్‌షిప్‌కి ఉదాహరణగా నిలిచిన వారిరువురి గాఢ అనుబంధాన్ని పాఠకులకు తెలిపేలా ఉన్నాయి. అసలు పుస్తకం శీర్షికే కొత్త చైతన్యాన్ని రగిలించేలా ఉంది. చదవాలనే ఆసక్తి పాఠకుల్లో కలిగించేలాగ ఉంది !
కామ్రేడ్ కె. ఎస్. గా అంతా ప్రేమగా పిల్చుకునే కుడిపూడి సూర్యనారాయణ సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి ఎదిగిన ప్రజాతంత్ర కార్యకర్త. సామాజిక ఆలోచనాపరులు. ఒక నిబద్ధతతో జీవితాన్ని గడిపిన ఆచరణశీలి. తిరుగులేని వామపక్షవాది. అచంచలమైన ఆదర్శాల్ని అణువణువునా జీర్ణించుకున్న వ్యక్తనే విషయాన్ని ఈ సంకలనం తేటతెల్లం చేస్తుంది!
అభ్యుదయ వేదిక స్థాపన మొదలు, జన విజ్ఞాన వేదిక కార్యక్రమాల వరకూ, ఉపాధ్యాయ సంఘాల నుండీ యువజ నోద్యమ కార్యాచరణ దాకా, సాహిత్యం మొదలు సామాజిక, సాంస్కృ తిక రంగాల వరకూ , కార్యకర్తలకు ఇళ్ళు కట్టించడం, వారి బాగోగులు చూడటం, ప్రేమ/ కులాంతర వివాహాలు జరిపించడం, కాయ గూరలు పండించడం…ఒకటా రెండా, సాటి మనిషిని నిండు హృదయంతో ప్రేమించగలగడమే నిజమైన కమ్యూనిస్టు సారమని కె. యస్. జీవితం నిరూపిస్తుంది !
ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే ప్రత్యామ్నాయ భావజాలానికి బాసటగా నిలిచినా, గోర్కీ అమ్మ మొదలు అంబేద్కర్ కులనిర్మూలన వరకూ లోతుగా అధ్యయనం చేసినా, సొంత జీవితంలో విలువలకు కట్టుబడి ఆదర్శవివాహం చేసుకున్నా, మద్యపాన వ్యతిరేకోద్యమం నుండి మూఢనమ్మకాల నిర్మూలనోద్యమం వరకూ క్షేత్రస్థాయిలో పనిచేసినా అవన్నీ ఆయన నమ్మిన సిద్ధాంతానికి ప్రతీకలేనని పేర్కొంటూ ‘డియర్ కామ్రేడ్’ గురించి ఈ చిన్న రైటప్ !
(మిత్రులు,’పుస్తకం’ వాట్సప్ గ్రూప్ ముఖ్యులు కామ్రేడ్ పెద్దింశెట్టి రామకృష్ణ గారు ఇష్టంతో సంకలనం చేసి సంపాదకత్వం వహించిన విశిష్ట గ్రంథం ఇది. అంశం గురించి ఆయన ఎంచుకున్న తీరు, వ్యాసాల్ని ఎడిట్ చేసిన విధానం, బుక్ గెటప్ బావుంది. కొత్త సంవత్సరం రోజునే కుడిపూడి సంస్మరణలో జరిపిన ఆవిష్కరణ సభ కూడా అర్దవంతంగా ఉంది. ప్రజాకీయ ప్రత్యామ్నయ ఆలోచనాపరులంతా చదవాల్సిన పుస్తకం, తెలుసు కోవాల్సిన వ్యక్తిత్వం కె. ఎస్.దని పేర్కొంటూ, ఇంత మంచి వర్క్‌ని తీసుకు రావడానికి శ్రమించిన మిత్రులు పెద్దింశెట్టికి, సహకరించిన వారి పార్టీ పెద్దలకి ప్రత్యేక అభినందనలు!)
– గౌరవ్