పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదో చెప్పమంటూ ఐటీ మంత్రి కల్వకుంట్ల తరాకరామారావు (కేటీఆర్) తన న్యాయవాది చేత బీజేపీ తెలంగాణశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కి నోటీసులు జారీచేయించారు.
ఈనెల 11వ తేదీన ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పైన నిరాధారమైన ఆరోపణలు బండి సంజయ్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలను నిరూపించే ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ బండి సంజయ్ ను హెచ్చరించారు.
ఈ మేరకు శుక్రవారంనాడు బండి సంజయ్ కి కేటీఆర్ తరఫు న్యాయవాది నోటీసు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ ప్రాబల్యం దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి, ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో న్యాయవాది వ్యాఖ్యానించారు. ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయవాది ఆరోపించారు. కేటీఆర్ పరువుకు నష్టం కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో న్యాయవాది స్పష్టం చేశారు. 48 గంటల్లో తన క్లయింట్ కేటీఆర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది సంజయ్ ను డిమాండ్ చేశారు.