తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పైన ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ ప్రసంగించబోతున్నారు. ఈ మేరకు మంత్రి కే.తారకరామారావు కి హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులు ఇప్పటికే ఆహ్వానం పంపించారు. ఈనెల 20వ తేదీన ఇండియా @2030 – ట్రాన్స్ఫర్మేషనల్ డికేడ్ అనే అంశం పైన మంత్రి కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోబోతున్నారు. 20వ తేదీన సాయంత్రం ఆరున్నర గంటలకు మంత్రి ఈ సదస్సు లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంలో ప్రసంగించబోతున్నారు.
ఈ దశాబ్దంలో భారతదేశ పురోగతి శీఘ్రగతిన జరగాలంటే ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ముఖ్యంగా వ్యాపారం, వాణిజ్యం, ప్రభుత్వ విధానాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్, బిజినెస్, మహిళలకు ప్రాధాన్యత కల్పించే బిజినెస్ ఇంక్యుబేటర్లు, ఐటి, ఐటి అనుబంధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యల పైన మంత్రి తన ఆలోచనలను పంచుకుంటారు. తన ప్రసంగంలో కేటీఆర్ ఆయా రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తన విప్లవాత్మక, వినూత్న విధానాలతో సాధించిన సానుకూల మార్పులను, ప్రగతిని ప్రస్తావించనున్నారు. తనకు ఆహ్వానం పంపిన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాన్ఫరెన్స్ లో భాగస్వామి అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.