Sunday, December 22, 2024

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమన్న కేంద్ర మంత్రి ప్రకటన పచ్చి దగా, మోసం: కేటీఆర్

  • తెలంగాణకు నిరంతరం ద్రోహం చేయడమే బిజెపి విధానమా?
  • ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రతి ఒక్క బిజెపి నాయకుడు పచ్చి తెలంగాణ వ్యతిరేకులే
  • తెలంగాణ ప్రయోజనాల పట్ల స్థానిక బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని కోచ్ ఫ్యాక్టరీపై నిలదీయాలి

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ కు దక్కాల్సిన హామీల్లో ఒకటైన కాజీపేట రైల్ కోచ్‌ ఫ్యాక్టరీ పై కేంద్ర ప్రభుత్వం మాటమార్చడంపై మంత్రి కే.తారకరామారావు మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తోన్న తెలంగాణ వ్యతిరేక విధానాలకు కొనసాగింపుగానే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడారని ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా తో పాటు పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హామీల అమలులో నరేంద్రమోడీ సర్కార్  తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వ తీరును చూసి ఊసరవెల్లులు కూడా ఉరేసుకుంటున్నాయని విమర్శించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమని చెప్పి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు ధోఖా ఇవ్వడంలో గత పాలకులను నేటి మోడీ సర్కార్ పాలన మించిపోయిందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పచ్చి తెలంగాణ వ్యతిరేకిగా ఉన్న బిజెపి సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందనడానికి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకొక ఉదాహరణ అన్నారు కేటీఆర్.  బీజేపీ తెలంగాణ వ్యతిరేక వైఖరితో రాజ్యాంగబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దక్కకుండా పోతున్నదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్ కోచ్‌ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చామన్న కేటీఆర్, ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 150 ఎకరాల భూమిని సేకరించి కూడా కేంద్రానికి ఇచ్చామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు ఎంపీలు లెక్కలేనన్నీ విజ్ఞప్తిలు చేసినా దున్నపోతు మీద వానపడ్డట్టుగా కేంద్రం ఎన్నడూ  స్పందించలేదన్నారు. దేశంలో ఎక్కడా రైల్ కోచ్ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం లేదని 2017లో కేంద్రం ప్రకటించడం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అవమానించడమేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా తన రాజకీయ ప్రయోజనాల కోసం మహారాష్ట్ర లాతూర్ కు 2018 లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నరేంద్ర మోడీ ప్రకటించారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ మరట్వాడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం 625 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్రం తెలంగాణపై మాత్రం సవతి ప్రేమను బీజేపీ చూపించిందన్నారు. 

 పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు దక్కిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీని తుంగలో తొక్కడం తెలంగాణ అభివృద్ధి పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్న మోసపూరిత వైఖరిని బయటపెట్టిందని కేటీఆర్ విమర్శించారు. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం చేసిన దగాతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా  వరంగల్ ప్రాంతానికి తీరని నష్టం జరిగిందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ తో ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ యువత కడుపు కొట్టిందని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల పట్ల, వారి అభివృద్ధి పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రపూరిత విధానాలను ప్రజలు తప్పక తిప్పికొడతారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి  రాజ్యాంగబద్ధంగా దక్కిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల సోయి ఉంటే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి మంత్రులు ఎంపీలు, నాయకులు కేంద్రంలోని తమ ప్రభుత్వ ద్వంద వైఖరిని నిలదీయాలని  కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓవైపు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా… ఇక్కడి రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్క మాట మాట్లాడకపోవడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్డడమే అన్నారు కేటీఆర్. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకులు బుద్ది తెచ్చుకోకుంటే తెలంగాణ ప్రజలే తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles