• తెలంగాణ రాజకీయాల్లో నందమూరి వారసులు ?
• మూడోసారి అధికారం చేపట్టేందుకు కేసీఆర్ వ్యూహరచన
కేసీఆర్ చెప్పింది చేయడు చేసేది చెప్పడు…నిన్న మొన్నటి వరకు రాజకీయ చర్చ కేటీఆర్ సిఎం పదవి పై వాడి వేడిగా జరిగాయి. ఒక్క రోజులో షర్మిల తెలంగాణలో పార్టీ పెడతానంటూ ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభం అయింది. ఆంధ్ర పంచాయితీ ఎన్నికల్లో బిజీగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో షర్మిల రాజకీయ రంగ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చాకా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ పార్టీకి అంకురార్పణ జరిగే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కు సిఎం పదవి కట్టబెట్టకుండా రాజకీయ పార్టీలు చెక్ పెట్టాయన్నది వాళ్ళ భ్రమ! రేవంత్ రెడ్డి, లేదా బండి సంజయ్ చంకలు గుద్దుకుని కేసీఆర్ ను అదుపులో పెట్టామని చెప్పుకుంటున్న తీరు తాత్కాలిక ఆనందమే! కేసీఆర్ దీర్ఘకాలిక వ్యూహం లో కేటీఆర్ అయన వారసుడిగా రావడం తథ్యం!
తెలంగాణ లో తెలుగుదేశం కోల్పోయిన పూర్వ వైభవాన్ని తేవడానికి అంతరంగ మథనం లో కేసీఆర్ తో కూడా ఆయన పాత స్నేహితులు మంతనాలు ఆడుతున్నారని ఒక వినికిడి! భవిష్యత్ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఆంధ్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా చేసి, తెలంగాణ లో పుట్టిపెరిగిన నందమూరి తారక రామారావు వారసులను తెరపైకి తెచ్చే ఆలోచన టిడిపి వర్గాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అపుడు చంద్రబాబు ఇమేజ్ తో కొన్ని తెలంగాణ అసెంబ్లీ సీట్లు వస్తే టిడిపి కి తెలంగాణ లో జవసత్వాలు వస్తాయని ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూకట్ పల్లిలో గృహిణిగా ఉన్న హరికృష్ణ కూతురు ను ఎన్నికల రంగంలోకి దించిన చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వస్తున్నప్పుడు టీడీపీ తరఫున హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నందమూరి వారసులను దించాలని ఆలోచించడం లో తప్పేం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని టిడిపి కి చెందిన అగ్ర నాయకుడు అంటున్నారు.
పదేళ్ల ఉమ్మడి రాజధాని పరిధి హైదరాబాద్ లో కొద్ది రోజుల్లో ముగుస్తున్న సందర్భంగా తిరిగి ఆంధ్ర ముద్ర ఉండకుండా తెలంగాణ లో నివసిస్తున్న ఆంధ్రులు ఓటు హక్కును తిరిగి తెలంగాణలో మూకుమ్మడిగా నమోదు చేసుకునే ప్రక్రియ ప్రారంభం అయింది! తెలుగు దేశం లో ఆంధ్ర లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు చాలా మందికి హైదరాబాద్ లో నివాస గృహాలు ఉన్నాయి. అలా టిడిపి వర్గీయులకు తెలంగాణ రాజకీయాల పై మక్కువ పెరుగుతుంది! ఆంధ్ర రాజకీయాల్లో రాజధాని రగడ తో ఆంధ్ర పెట్టుబడి దారులు చాలా మంది హైదరాబాద్ కు తరలి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ రాజకీయ మనుగడ వారికి కావాలి. కేసీఆర్ కూడా ఆంధ్ర వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను ఉంటానని ఎన్నో సార్లు చెప్పారు. అయన ఉన్నా లేకున్నా భారతీయులుగా ఓటు హక్కు, నివసించే హక్కు ఇక్కడ ఉంది కాబట్టి సేఫ్ నియోజక వర్గాలపై ఆంధ్ర రాజకీయ నాయకులు దృష్టి పెట్టారు. ఇది నిజంగా కేసీఆర్ కు కలిసి వచ్చే అంశం!
తెలంగాణలో టిడిపి క్రియాశీలకంగా మారితే ఆంధ్ర ఓట్లు చీలడం వల్ల కేసీఆర్ ఓటు బ్యాంక్ పదిలం అవుతుంది! ఇలా కేసీఆర్ వ్యూహ రచనలో చంద్రబాబు చిక్కినా ఆశ్చర్యం లేదు! కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో తెలంగాణ టీడీపీ కుదేలయింది. ఎన్టీ రామారావు లాగా కొత్త రాజకీయ నాయకులను తయారు చేస్తే టిడిపికి తెలంగాణలో పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణలో సంస్థాగతంగా టీడీపీ బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర పార్టీగా కాకుండా తెలంగాణ పార్టీగా టిడిపిని తీర్చిదిద్దే సత్తా ఉన్న వారు ఉన్నారా? అంటే టీడీపీ అభిమానులు మాత్రం అవుననే అంటున్నారు. తెలంగాణలో పుట్టి పెరిగిన ఎన్టీఆర్ వారసులు రాజకీయాల్లోకి వస్తే టీడీపీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకొంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే నందమూరి కుటుంబం నుంచి తెలంగాణ రాజకీయాల్లో కి రావడానికి చంద్రబాబు మొగ్గు చూపుతారో లేదో కాలమే నిర్ణయించాలి. ఇక వచ్చే మూడేళ్ల వరకు కేసీఆర్ తానే ముఖ్యమంత్రి గా ఉంటారా? చివరలో ఆరోగ్యం పేరిట ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ ను రంగంలోకి దించుతారా? ఇటు షర్మిల, అటు టిడిపి ని రంగంలోకి దింపి తెలంగాణలో విస్తరిస్తున్న బీజేపీ స్పీడుకు బ్రేకులు వేసేందుకు కేసీఆర్ చకా చకా పావులు కదుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.