రామాయణమ్ – 180
వేటగాడు వదిలిన బాణం సరాసరి గుండెల్లో దిగబడితే?
ఎంత విలవిలలాడి పోతుంది ఆ ప్రాణం!
అంతకంటే ఎక్కువ బాధ గుండెల్లో బల్లేలు దిగబడిన బాధ, రావణుని చేతిలో రక్తమోడుతున్న రాముని శిరస్సు. సీతమ్మ మనస్సు తట్టుకోలేకపోతున్నది.
Also read: వానరవీరుల వివరాలు తెలుసుకున్న రావణుడు
ఒక్క క్షణం మాయ ఆమె మనస్సును కప్పి వేసింది. అది నిజమే అని నమ్మింది. అది చూపి వాడు ఆ దుష్టరావణుడు వికటాట్టహాసం చేస్తున్నాడు. మొదలు నరికిన చెట్టులా సీతమ్మ కూలబడింది. ఆ శిరస్సును చేతిలోకి తీసుకొని హా! మహాబాహో, వీరవ్రతా, ఇంకా నేను కూడా చనిపోయితిని అనుచూ అనంతమైన శోకసాగరములో మునిగిపోయి ఏమేమో మాటలాడుచుండగా ..
ద్వారము వద్దనున్న ద్వారపాలకుడు వచ్చి నిలిచి ‘‘మహారాజా, అత్యవసర రాచకార్య నిమిత్తమై సేనాపతి ప్రహస్తుడు మీ కోసం నిరీక్షిస్తున్నారు’’ అని రావణునితో పలికెను. రావణుడు ఆ శిరస్సును, ధనుస్సును అచటనే ఉంచి వెనుతిరిగెను. చిత్రము, అతను వెనుతిరుగగానే అవి అంతర్ధానమైపోయినవి.
Also read: కోలాహలంగా రామసేతు నిర్మాణం
ఇంతలో అచటికి విభీషణుని భార్య సురమ వచ్చి తెలివితప్పి పడివున్న సీతమ్మను లేవదీసి ఓదార్చి, అది అంతా రావణ మాయా కల్పితము అన్న విషయము ఎరిగించి సాంత్వన వాక్యములు పలికెను.
ఇంతలో కోటలో నుండి యుధ్ధ ఆరంభానికి గుర్తుగా భయంకరమైన వాద్యధ్వనులు వినపడినవి.
‘‘సీతమ్మా, అదుగో విను ఆ ఏనుగుల కాలి గజ్జెల చప్పుడు. గుర్రపు గిట్టల ధ్వని. సైనికుల శంఖనాదాలు, వారి పదఘట్టనల చేత ఆకాశమందు మేఘ మండలములాగా కనపడే ఆ ధూళిని చూడు. ఇవ్వన్నీ దేనికి సంకేతాలు తల్లీ. రాబోయే మహా సంగ్రామానికి రాక్షసులు సన్నద్ధమవుతున్నారని కాదా!’’అనుచూ సరమ చెప్పగా విన్న సీతమ్మ ఆవిడను ఒక కోరిక కోరింది ..
Also read: రావణుడి పనపున సుగ్రీవుడితో శుకుని రాయబారం విఫలం
‘‘మరి రావణుడు ఏమి చేయుచున్నాడో చూసి వచ్చి నాకు చెప్పగలవా?’’ అని అడిగింది…. అందుకు సరే అని సరమ రావణసభాభవనములోనికి రహస్యముగా వెళ్ళి అక్కడ జరుగుతున్నవన్నీ చూసి తిరిగి వచ్చింది.
సీతమ్మ కడు ఆత్రంగా ఏమి జరుగుతున్నది అక్కడ అని ప్రశ్నించింది.
రావణుని తల్లి కైకసి, వృద్ధమంత్రి అవిద్ధుడు నిన్ను సగౌరవముగా రామచంద్రునకు అప్పగించమని హితవు పలుకుతున్నారు. ‘‘రాముని గురించి నీకు ఇంకా తెలియరాలేదా రావణా, ఒక మానవ మాత్రుడు జనస్థానములో పదునాల్గువేలమందిని అరగంట కాలములో ఒక్కడే చంపగలిగినాడంటే ఆతని సామర్ధ్యమేపాటిదో నీకింకా తెలియకపోవుట చిత్రముగా ఉన్నది. ఒక పెనుకోతి సంద్రముదాటి లంకకు వచ్చి మరల క్షేమముగా తిరిగి వెళ్ళగలిగినదంటే వారి శక్తిని నీవు సరిగా అంచనా వేయలేదు. సీతమ్మను రాముని వద్దకు చేర్చు. సంధిచేసుకో’’ అని పలికిన వారి పలుకులు ఏవీ ఆయన చెవికెక్కడములేదు. ‘‘ఎందుకెక్కుతాయి మరి మృత్యుదేవత రమ్మని పిలిచే పిలుపు కైపెక్కించి ఆయనలో యుద్దపు కాంక్షను రగిల్చి వేస్తుంటే! ఒక్కటి మాత్రము నిశ్చయము సీతమ్మా! వాడు చావనిదే నిన్ను విడిచిపెట్టడు! వాని చావు రాముని చేతిలో వ్రాసిపెట్టి ఉన్నది. ఇది తథ్యము’’ అని సరమ పలుకుచుండగనే వానర సైన్యముల కదలికల వలన కలిగిన మహాధ్వని వారి చెవులకు సోకెను.
Also read: విభీషణుడిని లంకాధిపతిగా చేసిన రాముడు
వూటుకూరు జానకిరామారావు