ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. దీనినే చిలుక ద్వాదశి అనీ అంటారు. మధించడాన్ని తెలుగులో `చిలుకు` అంటారు కనుక `చిలుక ద్వాదశి`అని జన వ్యవహారం. సన్యాసులు, యోగులు, మునులు చాతుర్మాస్య దీక్షను విరమిస్తారు కనుక ‘యోగీశ్వర ద్వాదశి’ అని, శ్రీమహావిష్ణువు లక్ష్మీసమేతంగా బృందావనం చేరిన తిథి కాబట్టి ‘బృందావన ద్వాదశి’ అని కూడా అంటారు.
అమృతం కోసం సాగిన మధనం ఈరోజు ముగిసిందని, ఆ సందర్బంగా ఉద్భవించిన లక్ష్మీదేవిని విష్ణువు ఈనాడే పరిణయమాడాడని ఐతిహ్యం. నాటి నుంచి ఈ తిథిన లక్ష్మీనారాయణుల కల్యాణం జరపడం ఆనవాయితీగా వస్తోంది.
నిన్న ఉత్థాన ఏకాదశి ఉపవాసదీక్ష పాటించిన వారు ద్వాదశి నాడు విష్ణువును అర్చించి ప్రసాదం స్వీకరిస్తారు. ముతైదువులను, బ్రాహ్మణులను సత్కరిస్తారు. తులసి మొక్కను లక్ష్మీస్వరూపిణిగా, ఉసిరిని విష్ణు స్వరూపంగా భావిస్తూ, తులసీ మొక్క పక్కన ఉసరి కొమ్మను ఉంచి అర్చిస్తారు. ఉసిరి చెట్టు నీడనే వనభోజనాలు అరగించడం వెనుక విశేషం ఇదేనని చెబుతారు.
తిరుమలలో విశిష్టత
తిరుమలలో శ్రీవారి సేవలో దీనికో విశిష్టత ఉంది. ఏటా కార్తిక శుద్ధ ద్వాదశి (ఈరోజు) నిర్వహించే వేడుకను కైశిక ద్వాదశి అంటారు. శ్రీదేవిభూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరువీధులో ఊరేగుతారు. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే అంటే క్షీరాబ్ది ద్వాదశి, ముక్కోటి ద్వాదశి వేకువ జామున గర్భాలయం దాటి నాలుగు మాడవీధుల్లో ఊరేగి సూర్యోదయానికి ముందే ఆలయానికి చేరుకుంటారు. సూర్యకిరణాలు సోకితే ఉగ్రత్వం వస్తుందంటారు. ‘ప్రస్తుతం తిరువీధుల్లో విహరింపచేసే భోగ శ్రీనివాసుడి ఉత్సవమూర్తికి ముందు `వెంకటం తురైవార్` అనే ఈ విగ్రహాన్నే ఊరేగించే వారట. అయితే ఒకసారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి చాలా ఇళ్లు దగ్ధమయ్యా యట. ప్రమాద కారణం స్పష్టంగా తెలియక పోయినా, స్వామికి సేవలో ఏదో లోపం జరిగి ఉంటుందనీ, అదే ఆ ప్రమాదానికి కారణమై ఉంటుందనీ భావించి అర్చకులు స్వామి వారిని క్షమాపణలు వేడుకున్నారట. అంతలో స్వామి ఒక భక్తుడిని ఆవహించి, ఇకమీదట ఈ విగ్రహాన్ని ఊరేగింపునకు తీసుకురావద్దనీ, అందుకు విరుద్ధంగా చేస్తే ఇలాంటి ముప్పుతప్పదనీ హెచ్చరించారట. అంతేకాక తిరుమల లోయలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేతం విగ్రహాన్నివెలికితీసి వాటికి అర్చన, ఉత్సవాలు నిర్వహించాని సూచించారట. అలా లభించిన విగ్రహాలే నేడు పూజందుకుంటున్న ఉభయ దేవేరుల సమేత మలయప్పస్వామి.
(గురువారం, నవంబర్ 26, క్షీరాబ్ది ద్వాదశి)