* కృష్ణం వందే జగద్గురుం…అదే మోహన రూపం!
కృష్ణ తత్వం అంటే చిరునవ్వే స్మురణకు . మిన్ను విరిగి మీద పడ్డా కృష్ణుడు చలించడు! ఆయన గురించి ఎంత చెప్పినా సరికొత్తగా చెప్పాలి అనిపించే పాత్ర గోపికాలోలునిది. ప్రస్తుత కలియుగంలో ఆయనలా శతసహస్ర అవధానం చేసే వారు ఉండవచ్చు. కానీ శతముఖాల మనసు దోచే వారు లేరు. అందరికి అందరూ నచ్చరు. కొందరికి కొందరే నచ్చుతారు. కానీ కృషుడిని దూషించే వారికి కూడా కృష్ణ తత్వం నచ్చుతుంది. ఆయన అల్లరి భరించలేని యశోద కూడా ఆయన ప్రేమ కోసం అందరితో తిట్లు తింది…ఆమె మాతృత్వ తత్వం మనకు తెలిపింది ఆయనే. కృష్ణుడి వల్లే కదా యశోధమ్మకు అంత పేరు వచ్చింది. ఇక ఎక్కడో అడవిలో పెరిగే వెదురు చెట్లలో మురళిని తెచ్చి దానికి రంద్రాలు చేసి అద్భుత మైన మురళి గానాన్ని వినిపిస్తే తన్మయత్వం పొందని వారు ఉంటారా? వెదురుతో తట్టలు, బుట్టలే కాదు అద్భుతమైన వేణుగానాన్ని వినిపిస్తే నెమళ్లు నాట్యమాడుతాయి…విష నాగులు కూడా పడగెత్తి తన్మయత్వం చెందుతాయి…అన్నింటికన్నా కృషుడి ఆరాధకురాలు రాధ వేణు గానం తో మైమరచి ఆడే నాట్యం… ఆమె చుట్టూ తిరుగుతూ కృష్ణయ్య చేసే మురళీ నాదం తో మైమరచి పోయే ప్రేమికులు ద్వాపర యుగంలో ఉన్నారు…కలియుగంలో ఉన్నారు.
Also Read : కృష్ణతత్వమే మానవ జీవిత సారాంశం
మురళిలో కృష్ణతత్వం
ఒక్క రాధే కాదు ఆమె చుట్టూ వేలాది మంది గోపికలు ఆడే నాట్యరవళి లో కృష్ణుడు మైమరచి పోయేది రాధ భంగిమలకే. ఆయన రాధ అడుగులో అడుగు వేస్తూనే శ్రుతి తప్పకుండా మనోహరంగా వాయించే ఆ మురళిలో కృష్ణతత్వం ఎంతగా దాగుందో ఒక్క సంగీత ప్రియులకే తెలుస్తుంది. శిశుపాలుణ్ణి వంద తప్పుల వరకు క్షమించే తత్వం ఓపికకు ఉదాహారణ. శిశుపాలుడు కృష్ణునికి మేనత్త కొడుకు. వరుసకు బావ మరిది…ఆయన పుట్టుక వికృత రూపంగా గార్దభ స్వరంతో ఉంటుంది…అయితే, ఎవరు ఎత్తుకుంటే శిశుపాలునికి మంచి రూపం వస్తుందో అతని చేతిలోనే చావు తథ్యమని అశరీరవాణి చెబుతుంది…కృష్ణుడు ఎత్తుకోవడం వల్ల శిశుపాలుని మంచి రూపు వస్తుంది.. ఆ అందంతో రుక్మిణిని శిశుపాలుడు మోహిస్తాడు… అయితే తనను ఇష్ట పడ్డ తనకు ఇష్టమైన రుక్మిణిని ఎత్తుకెళ్ళి కృష్ణుడు పెళ్లాడుతాడు. అప్పటి నుండి శిశుపాలుడు కోపంగా ద్వారకను తగల బెడతాడు. నోటికొచ్చి నట్టు కృష్ణుడి ని తిడతాడు. ఇక వందవ తప్పు తరువాత సుదర్శన చక్రంతో శిశుపాలుని తల నరికేస్తాడు కృష్ణుడు. ఇందులో తత్వం ఏమిటంటే రుక్మిణి ప్రేమ కోసం ఎంతటి యుద్దాన్నయిన చేసి కోరిన చిన్నదాన్ని చేపట్టి ఇష్టంలేని వాణ్ణి వద్దనడానికి వనితకు గల మనస్సాక్షిని సహేతుకంగా వివరిస్తాడు గీతలో కృష్ణుడు. శిశుపాల వధలో ధైర్యంతో పాటు నీతి ఉంది…శతృవును వంద తప్పుల వరకు క్షమించే గుణం మానవ జాతికి బోధించే ఈ తత్వాన్ని నేటి ఫీలాసఫర్లు గ్రంధాలు రాసి తత్వబోధ చేస్తారు. కృష్ణతత్వంలో వైవిధ్యం ఉంటుంది. ఉల్లాసం ఉంటుంది. జీవన విధానం ఉంటుంది! మానవ మానసిక స్థితికి కృష్ణతత్వం ఒక పాఠం.
Also Read : ఆనందం ఆరోగ్యానికి దివ్య ఔషధం
కృష్ణలీలలు అనేకం
కృష్ణ లీలలు ఎన్నో ఉన్నాయి. ఎంత సేపు పాండవపక్షపాతిగా కృష్ణుడు ఉంటాడని కొందరి ఉవాచ. కానీ రాధకు ఇచ్చే ప్రాముఖ్యత వేరు. కుచేలుడికి ఇచ్చిన ఆదరణ వేరు. సమాజ రక్షణకు అంకితమైన పరిపూర్ణ రాజనీతిజ్ఞుడు కృష్ణుడు. నవ్వుతూనే కృష్ణుడు హితబోధ చేయగలడు. నవ్వుతూనే హాతమార్చగలడు. భోజన ప్రియుడు, ప్రేమ పిపాసి, ఆడగలడు, పాడగలడు. మోసగాళ్లకు మోసగాడు. మంచి వాళ్లకు మంచివాడు. పడుచుపిల్లలతో కబుర్లు చెబుతాడు. ముసలమ్మలతో ముచ్చట్లు చెబుతాడు. ఇవన్నీ కాక సత్యభామ అలక తీరుస్తాడు. పట్టపు రాణి రుక్మిణిని అక్కున చేర్చుకుంటాడు. అష్టభార్యలు ఉన్నా ఏ ఒక్కరికీ అసంతృప్తి కలిగించని ఆయన పాత్రలో ఎన్నో తత్వాలు ఇమిడి ఉన్నాయి. అయితే, రాధ తత్వం గమ్మత్తుగా ఉంటుంది. “రాధాకృష్ణ” గా పేరులో ఇమిడిపోయింది. అష్టభార్యల కన్నా విశిష్ట స్థానం ఆమెది. కృష్ణతత్వంలో మనస్తత్వశాస్త్రం, రాజకీయ-సామాజిక శాస్త్రం, సానుకూల మనస్తత్వ శాస్త్రం, ప్రేమశాస్త్రం…ఇలా అధ్యయనాలు ఎన్ని చేసినా, చేస్తున్నా సరికొత్త తత్వం దొరుకుతూనే ఉంటుంది. నెమలి పింఛంలో ఏడు రంగుల్లో కృష్ణుడు వర్ణన ఆనందరూపంతో మోహన రూపంగా మారుతుంది. కృష్ణం వందే జగద్గురుం అంటే కృష్ణావతారం దాల్చి ఐదువేల సంవత్సరాలు దాటినా ఈ నాటికి జగద్గురువుగా వినుతికెక్కి ప్రపంచాన్ని శాసిస్తున్న ఆయన తత్వం అందరికి ఆదర్శం.
Also Read : స్త్రీవాదం ఇంట్లోనే.. బయట ప్రపంచంలో కీలు బొమ్మలు