Thursday, November 7, 2024

కృష్ణం వందే జగద్గురుమ్

  • నరలోకానికి నారాయణుడి జ్ఞానబోధ భగవద్గీత
  • మానవులకు కర్తవ్యబోధ చేసే విజయగీతిక
  • కృష్ణుడు గొప్ప రాజనీతి చతురుడు

భగవాన్ కృష్ణుడు పుట్టినరోజును కృష్ణజన్మాష్టమి, గోకులాష్టమి అని పిలుస్తారు. దేవకి,వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షమి, అష్టమి తిధి రోజు పుట్టినట్లుగా పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కృష్ణభక్తులంతా వేడుకలు జరుపుకొనే విశిష్టమైన రోజు కృష్ణాష్టమి. ‘భగవద్గీత’ ద్వారా లోకానికి గొప్ప ఉపదేశం చేసిన మూలంగా కృష్ణుడిని ‘జగద్గురువు’గా భావిస్తారు, కృష్ణం వందే జగద్గురుమ్…అంటూ పూజిస్తారు.

Also read: కశ్మీర్ పండిట్లపై ఉగ్రపంజా

కృష్ణతత్వాన్ని అర్థం చేసుకొని ఆచరించాలి

శ్రీకృష్ణుడి లీలలు అనంతం. అవన్నీ ఆనందదాయకం.  జ్ఞానప్రదాయకం. మానవ జీవన క్రమంలో సుఖవంతంగా, జయప్రదంగా జీవించాలంటే కృష్ణతత్త్వాన్ని అర్థం చేసుకొని ఆచరించాలని పెద్దలు చెబుతారు. నర-నారాయణ (అర్జునుడు-కృష్ణుడు) సంవాదంలో నరునికి బోధించినట్లుగా కనిపించే ‘భగవద్గీత’ నరలోకం మొత్తానికి నారాయణుడు (కృష్ణుడు) చేసిన జ్ఞానబోధగా భావించాలని పండితులు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మనిషి మరణించినప్పుడు తల దగ్గర పెట్టి వినిపించే విషాదగీతం కాదు భగవద్గీత. మానవులకు కర్తవ్య బోధ చేస్తూ కార్యోన్ముఖులను చేసే ‘విజయగీత’. వ్యక్తిత్వ వికాసానికి ఇంతకు మించిన ఉద్గ్రంథం ఇంకొకటి లేదని ప్రపంచ మేధావులంతా ఏకమై చెప్పారు. అందుకే, ‘గీత’ భారతీయ భాషలతో పాటు అనేక అంతర్జాతీయ భాషలలో అనువాదమైంది. అది చదివిన పిమ్మట అనేక దేశాలవారు కృష్ణతత్త్వం వెంట పరుగులు తీస్తున్నారు. భారతదేశానికి తరలి వస్తున్నారు. ధర్మం, వృత్తిధర్మం,  స్వధర్మం వైపు నడవండని గీతాచార్యుడైన కృష్ణుడు చెప్పాడు. స్వధర్మం ఏంటో తెలుసుకోవడంలోనే జ్ఞాన వికాసం దాగివుంది. తెలుసుకున్న తర్వాత ఆచరించడంలో వివేకం దాగివుంటుంది. ఈ మనోయోగం పట్టాలంటే భగవద్గీతను చదివి తీరాల్సిందే. కౌరవ-పాండవ యుద్ధంలో కృష్ణుడు పాండవుల వైపు నిలుచున్నాడు. అది అధర్మానికి – ధర్మానికి మధ్య జరిగిన యుద్ధం కాబట్టి  వివేకవంతుడు, విశిష్టుడు, సర్వలోకహితుడైన కృష్ణుడు ధర్మపక్షపాతిగా పాండవుల వైపే నిల్చొని, వారికి విజయం కలిగించాడు. అధర్ములకు  అపజయాన్ని చూపించి గుణపాఠం నేర్పాడు.

Also read: లంకలో చైనా పాగా!

భక్తిని చాటడానికి అనేక మార్గాలు

కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని తలుచుకోవడం, కొలుచుకోవడమంటే  కృష్ణతత్త్వాన్ని తెలుసుకోవడమే. కృష్ణతత్త్వం తెలియాలంటే జయదేవుడు రచించిన ‘శ్రీకృష్ణకర్ణామృతం’ (అష్టపదులు) లీలాశుకుడి ‘శ్రీకృష్ణలీలామృతం’, నారాయణతీర్ధుడి ‘శ్రీకృష్ణలీలాతరంగిణి’ (తరంగాలు) చదివి, అనుభవించండని మాస్టర్  ఎక్కిరాల కృష్ణమాచార్య తెలియజేశారు. ‘జగదాష్టమి’గా గుజరాతీయులు కృష్ణ జన్మాష్టమిని విశిష్టంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ప్రపంచంలోని భక్తులంతా నాట్యం, నాటకం (రూపకం), ఉపాసన, ఉపవాసాలు మొదలైన వివిధ మార్గాల్లో తమ భక్తిని చాటుకుంటారు. ఇది తరతరాల నుంచి వైభవంగా సాగుతున్న సంప్రదాయం. ఉట్టి కొట్టడం గొప్ప ఆసక్తిగా సాగే క్రీడ. మన తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వరుని పక్కనే రజితమూర్తిగా శ్రీకృష్ణుడు విరాజిల్లుతుంటాడు. వెయ్యేళ్ళపై నుంచే ఈ విగ్రహం అక్కడ ఉన్నట్లు చెబుతారు. శ్రీకృష్ణుడి బాల్యక్రీడలకు సంబంధించిన విశేషాలు ప్రతిస్పందించేలా తిరుమల మాడ వీధుల్లో పెద్ద కోలాహలం జరుగుతుంది.  ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైందని తెలుస్తోంది. 1545 నాటి శాసనాల ఆధారంగా ఈ వివరాలు తెలుస్తున్నాయి. తాళ్లపాకవారే ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంటారు. కృష్ణుడు గొప్ప రాజనీతి చతురుడు. ఎంతటి చతురుడో అంతటి రసికుడు. ఎంతటి రసికుడో అంతటి అప్తజన రక్షకుడు. సౌందర్యవిలాసుడు. విలక్షణ వాగ్భూషణుడు. అందుకే, “నల్లనివాడు, పద్మ నయనంబులవాడు, కృపారసంబు పై చల్లెడివాడు” అన్నాడు మన పోతన్న. తనను నమ్ముకున్నవారిపై దయారసాన్ని గొప్పగా కురిపించే కరుణాసముద్రుడని భావం. కేవలం పాండవులపైనే కాదు, ధర్మమూర్తులందరిపైనా తన దయను విశేషంగా చూపించి విజయులను చేశాడు. కృష్ణుడిని అర్థం చేసుకుంటే ఆత్మజ్ఞానం కలిగినట్లే.

Also read: స్వాతంత్ర్య సమర వీరులకు వందనాలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles