Sunday, December 22, 2024

ఆబోతుల పొగరణచి నాజ్ఞజితిని గెలిచిన శ్రీకృష్ణుడు

18. తిరుప్పావై కథలు

18వ పాశురంలో గోదాదేవి నీళాదేవిని ఆశ్రయించే అవసరాన్ని వివరిస్తారు. ఎవరీ నీళాదేవి? ఆమెకు నాజ్ఞజితి అనే పేరు కూడా ఉందా? శ్రీకృష్ణుని అష్టభార్యల్లో ఆమెకూడా ఉందా?

నీళాదేవిని ద్రావిడ భాషలో నప్పిన్న అంటారు. నందగోపుడు ఆచార్యుడు, యశోద తిరుమంత్రమని 17 వ పాశురంలోచదువుకున్నాం. వారితో సంబంధం ఉన్న నీళాదేవిని ఆశ్రయిస్తేనే ఫలం. భగవంతుడు ఆచార్యునికి, పురుషకార భూతురాలైన లక్ష్మికి వశవర్తియై ఉంటాడు.మహాలక్ష్మిమాతృస్థానంలో ఉండి జీవులపట్ల వాత్సల్యం కలిగి ఉంటుంది. నారాయణుడికి శ్రీ తత్త్వమే శ్రీదేవి భూదేవి, నీళాదేవి. ద్రావిడ సంప్రదాయం ప్రకారం నీళాదేవి శ్రీకృష్ణుని పట్టపురాణి. యశోదాసోదరుడైన కుంభుడి పుత్రిక నీళాదేవి. అంటే ఆమె యశోదకు మేనకోడలు. శ్రీకృష్ణుడు ఆమెకు బావ. శ్రీ, శ్రియఃపతి ఇద్దరి ఆ మిధునముకే చెందిన వారము మనము, కనుక వారిని మనము సేవించాలి అని శ్రీభాష్యం అప్పలాచార్యులవారు చెప్పారు.

భాగవతంలో నీళాదేవి పాత్ర మనకు కనిపించదు. శ్రీకృష్ణుని ఎనమండుగురు పట్టపు రాణుల్లో ఒకరైన నాజ్ఞజితి నీళాదేవి అని పెద్దలు సమన్వయించారు. రాముడు శివధనుస్సు ఎక్కుపెట్టి సీతను పెళ్లాడినట్టు, ఏడుమృత్యువుల వంటి ఎడ్లను పట్టి బంధించి నాజ్ఞజితిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు. నాజ్ఞజితిని వలెనే నీళాదేవిని కూడా అదే రీతిలో వివాహం చేసుకున్నారని జీయర్ స్వామి వివరించారు. నాజ్ఞజితి నీళ ఒకరే అన్నారాయన. నీళకే పురుషకారం ఉందని పెద్దలు అంటారు. వైష్ణవ ఆరాధనలో శ్రీ, భూ, గోదా, నీళా దేవి దివ్య మహిషులుగా పూజలందుకుంటారు. నీళాదేవిని గోదమ్మ నప్పిన్న అని పిలుస్తున్నారు.

శ్రీరాముడి చెల్లెలే శ్రీకృష్ణుడి భార్య

శ్రీరాముడి చెల్లెలిని శ్రీకృష్ణుడు పెళ్లాడతాడు. నమ్మడం కష్టం కదా. విదేహ రాజ్యంలో యశోద తమ్ముడు కుంభకుడు ఉండేవాడు. అతని భార్య ధర్మద.  ఈదంపతులకు శ్రీరాముడు కొడుకు, నీళ (నాజ్ఞజితి అనీ అంటారు) కూతురు. ఆ రాజ్యంలో ఏడు వృషభాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. ఒక కథనం ప్రకారం వారు కంసుని చేత హతులైన దేవకీదేవి బిడ్డలంటారు. కాని వారు ఆరుగురే. ఇక్కడ పొగరుఆబోతులు ఏడున్నాయని అంటారు. అవి కుంభకుని మందలో పుట్టి ఆ రాజ్యంలో సంక్షోభం సృష్టిస్తూ ఉన్నాయి. కుంభుని ఆబోతులు చేసే విధ్వంసం గురించి విదేహ రాజుకి జనం మొరబెట్టుకున్నారు. విదేహరాజు కుంభకుని పిలిచి ఆబోతులను అదుపు చేయమని హెచ్చరించారు. ఎంత ప్రయత్నించినా ఆబోతులను ఆపడం సాధ్యం కాక, కుంభుడు వాటిని అణచిన వారికి తన కూతురునిచ్చి పెళ్లిచేస్తానని ప్రకటించాడట. ఆబోతుల సంక్షోభం ఏ విధంగా నివారించాలా అని ఆందోళన పడుతూఉన్నదశంలో ఒక రోజు యశోదా నంద రాజు బలరామ శ్రీకృష్ణులతో కలిసి యశోద సోదరుడైన కుంభకుడి ఇంటికి వచ్చారట, వారి వెంట మరెందరో గోపయువకులు కుంభుడి ప్రదేశానికి వచ్చారట.

కుంభకుడి ప్రకటన విన్న యువకులు ఎంతమంది ఆబోతులతో తలపడినా వాటిని అదుపుచేయడం సాధ్యం కాలేదు. వాటి బాధ పడలేక కొందరు ప్రజలు గ్రామం విడిచి పోయారట. కుంభుడి ఇంటిపైన కూడా ఆ పొగరుబోతు ఆబోతులు దాడిచేసి ధ్వంసం చేశాయి.

అక్కతో ఆ విషయాలు చెబుతుంటూ శ్రీకృష్ణుడు విని వెంటనే ఆ ఆబోతులు ఉన్నచోటుకు వెళ్లిపోయాడు.  మురళిని పక్కన బెట్టి, పంచె కాసె బిగించి, ధోవతి అంచులను పైకి కట్టి శ్రీకృష్ణుడు విజృంభించాడు. ఒక్కొక్క ఆబోతు ఏనుగంత పెద్దగా పర్వతం వలెకనిపిస్తున్నాయి. నీలి నిండిన నలుపురంగులో భీకరంగా ఉన్నాయి. ఏడు ఒకే సారి దాడిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటి మధ్య ఏడు తాళ్లు తీసుకుని ఆబోతుల మెడకు చుట్టడానికి, వాటి ఊపిరి ఆగకుండా కట్టుబడేట్టు మాత్రమే చేయడానికి తగిన ప్రమాణంలో తగిన ముడులు సిద్ధం చేసుకుని దాడికి బయలుదేరాడట. ఒక్కో ఆబోతు మీదకు ఎగిరి దూకి శరవేగంతో మోచేతితో పొడుస్తూ, పిడికిలితో గుద్దుతూ ఏడు ఆబోతును వరసగా దెబ్బతీసాడు. అవి తేరుకుని దాడిచేసేలోగానే వాటని నేలకు పడేసాడు. తరువాత వాటి మెడలకు తాళ్లు తగిలించి ఏడు తాళ్లను చేతులతో పట్టుకుని వాటి కదలికలను స్తంభింప జేసి నడుపుకుంటూ మందకు తీసుకువచ్చి బంధించివేసాడు. మేనమామ

ఒక్కొక్క పిడికిలి పోటుతో ఒక్కొక్క ఆబోతును దెబ్బ తీస్తే ఆబోతులు రక్తం కక్కుకుని చనిపోయాయని ఒక కథనం. మరొక రచనలో ఆ ఏడు ఆబోతులను జయించి ఒక గాట కట్టి, ఆబోతుల సంక్షోభాన్ని తొలగించారంటారు. అంతటి పరాక్రమశాలి శ్రీకృష్ణునికి తన కూతురు నీళను ఇచ్చి కుంభకుడు-ధర్మద వివాహం చేశారని దాశరథి రంగాచార్యులు తన మానస తిరుప్పావై లో వివరించారు.  నీళాదేవినే నాజ్ఞజితి అంటారని, అతని తండ్రి పేరు నాజ్ఞజితుడని ఒక వివరణ ఉంది.

కంసుడు చంపింది తన కొడుకులనేనా

హరి వంశంలో ఒక కథ ఉంది. కాలనేమి అనే రాక్షసుడికి ఆరుగురు పుత్రులున్నారు. వారిని షడ్గర్భులు అంటారు. హిరణ్యకశిపుని కాలంలో వీరు జీవించి ఉన్నారట. ఈ ఆర్గురు చావులేని వరం కోరుతూ బ్రహ్మను గురించి తపస్సు చేస్తున్నారని తెలుసుకుని హిరణ్య కశిపుడు ఆగ్రహించాడు. అందరూ తననే పూజించాలని తనకోసమే తపస్సు చేయాలని హిరణ్య కశిపుడి శాసనం. అందుకని ఆ షడ్గర్భులు తండ్రి చేతిలోనే చస్తారని శపిస్తాడట. కాలనేమి మరుజన్మలో కంసుడై పుడతాడు. తన చెల్లి దేవకి పుత్రుడే శత్రువని తెలుసుకున్న కంసుడు దేవకి ఆరుగురు బిడ్డలను వధిస్తాడు. ఆ ఆరుగురే పూర్వపు షడ్గర్భులు.

రామానుజుని కథ

ఈ పాశురము రామాజునునికి ప్రియమైనది. ఓసారి భిక్షాటనం చేస్తూ రామానుజుడు ఈ పాశురాన్ని మనసులో లోతుగా మననంచేస్తూ గురువుగారైన మహాపూర్ణుల ఇంటికి వెళ్లి తలుపుతట్టారట. గురుపుత్రిక అత్తులాయమ్మ ఆమె గాజులు ఘల్లుమన్న ధ్వనితొ తలుపు తీస్తే ఆమెను చూసి నీళాదేవి సాక్షాత్కరించిందనే పరవశంతో ఆయన మూర్ఛపోయారట. ఇదంతా గురువుగారు దూరాన ఉండి ఊహించారట. నిన్ను చూసి నీళాదేవి అనుకుని ఉంటాడు అటూ వచ్చి రామానుజుడిపై నీళ్లు చల్లి మేల్కొల్పారట. ఈ పాశురం అనుసంధానం చేస్తే అమ్మవారి సాక్షాత్కారం కలుగుతుందని శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు మృదు మధురంగా వివరించారు. తిరుప్పావై అంటే అమిత అభిమానం కలిగిన రామానుజుల వారిని తిరుప్పావై జీయర్ అని పిలుస్తారు.

బాపురేఖ, శ్రీధర్ వ్యాఖ్య: నీల కుంతల నీళాదేవి

నీళా కృష్ణుల శృంగార గీతిక అయిన 18వ పాశురానికి ఇది బాపు చిత్రం. ఆమె నీలవేణి, ఆ కురులు పరిమళాలు వెదజల్లుతున్నాయి. గోవిందుని ఎదపైన ఒక హస్తం, క్రీడా కందుకము (బంతి) ఇంకో చేతిలో. కాలికి అందెలు చేతులకు బంగారు కంకణాలు.  కలువ కన్నులు వాలుజడ లేని బాపు బొమ్మలు ఉండవు కదా. నీళాదేవిని నప్పిన్న పిరాట్టి అంటారు. నీళాదేవిని ముందుగా మేల్కొల్పితే తప్ప కృష్ణయ్యను పిలవడం కష్టం అని తెలుసుకున్నారు. బలరాముని కడియాల పాదాలను ప్రస్తుతించిన తరువాత, ఈ పాశురంలో గాజులు, స్వర్ణ కంకణాలతో కళకళ లాడే నీళాదేవి కరకమలాలను ప్రశంసిస్తున్నారు. కోకిలలు పాటలు నేర్చుకోవడానికి నీళాదేవి దగ్గరకు వస్తాయట. బ్రహ్మాండ నాయకుడితో బంతులాడుతున్నదట.  చెట్లు, తీగలు, పక్షులు, జింకలు అన్నీ ఆమెవశమే అనే దృశ్యాన్ని బాపు మనకు సాక్షాత్కరింపజేస్తున్నారీ చిత్రంలో.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles