23 గోదా గోవింద గీతం
23 గోదా గోవింద గీతం
సింహగతిలో సింహాసనం చేరినకృష్ణ సింహము
మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్
శీరియ శిఙ్గం అణివిట్రు త్తీ విళిత్తు
వేరిమయిర్ పొఙ్గ ఎప్పాడుమ్ పేర్ న్దుదఱి
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు
పోదరుమాపోలే, నీ పూవై ప్పూవణ్ణా ! ఉన్
కోయిల్ నిన్రిఙ్గనే పోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిఙ్గాసనత్తిరున్దు యామ్ వన్ద
కారియ మారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్
తెలుగు భావార్థ గీతిక
వానకారు కొండగుహల లోలోన సింహిక కౌగలించి
హాయిగ శయనించు కొదమ సింగమా ఠీవిగాలేచి
నిప్పురవ్వలు కురిపించు కంటికొసచూపులు విసిరి
పరిమళపు జూలు నిక్కబొడిచి విదిలించి ఒడలు విరిచి
గంభీరరావమున గాండ్రుమని గర్జించి నలుదిశలజూచి
గుహనుంచి వెలువడి కానుగపూరంగు వళ్లు సాచి
శయనపీఠము నుంచి చతురగతి సింహాసనమునెక్కి
మేము వచ్చిన పనిజూచి మమ్ము కరుణించవయ్య
అర్థం:
వర్షాకాలంలో (మారి) కొండగుహలో (మలైముఝంగిల్) ఆడసింహాన్ని కౌగిలించుకుని పడుకొని ఉన్న (మన్నికిడందు) నిదురిస్తున్న (ఉఱంగుమ్) శౌర్యోపేతమైన సింహం (శీరియ శింగమ్) మేలుకుని లేచి (అఱివిట్రు) నిప్పులు కురుస్తూన్నకనులు తెరిచి (తీవిఝుత్తు) పరిమళించే జూలును (వేరిమయిర్) నిక్కబొడిచి (నిగిడ్చి) (పొంగ) అన్నిదిశలలో( ఎప్పాడుమ్) కదలి (పేర్ న్దు) ఒడలు విరచి (ఉదఱి) శరీరాన్ని సాగదీసి (మూరి నిమిర్ న్దు) గర్జించి (ముఝంగి) వెలుపలకు (పురప్పట్టు)వస్తున్నట్టుగా (పోదరుమాపోలే) కానుగ పూవు వంటి మేను ఛాయగలవాడా (నీ పూవైప్పూవణ్ణా) నీ నివాసభవనం నుంచి (ఉన్ కోయిల్ నిన్ఱు) ఇక్కడికి వేంచేసి (ఇంగనే పోందరుళి) మనోహరమైన (కోప్పుడైయ) శ్రేష్ఠమైన (శీరియ) సింహానంపైన ఆసీనుడవై (శింగాసనత్తిరిందు) మేము వచ్చిన (యామ్ వంద) పనిని (కారియమ్) పరిశీలించి అనుగ్రహించు (ఆరాయ్ న్దు అరుళు).
నిన్నటి దాకా గోపికలు తన కటాక్ష వీక్షణాలను కోరుకున్నారు. మెల్లమెల్లగా కన్నులు విచ్చి చూడమన్నారు. పురుషాకారంతో వచ్చిన వీరిని ఇంతకాలం ఉపేక్షించామే అని శ్రీ కృష్ణుడు కొంత బాధపడ్డాడు. ఏం కావాలో చెప్పమన్నాడు. అప్పుడు గోపికలు శ్రీ కృష్ణుడు గంభీరంగా కదలివస్తుంటే చూడాలనే ప్రగాఢ వాంఛతో సింహాసనం వైపు కదలి రమ్మని కోరుకున్నారు.
Also read: భాగవతం ఇవ్వలేదని పోతన్న మీద రాజద్రోహనేరం మోపిన రాజెవరు?
కృష్ణ సింహ చైతన్య విజృంభణ
శ్రీకృష్ణుడు యదుసింహుడు. వర్షాకాలంలో కొండగుహలో తన జత యైన ఆడసింహాన్ని ఆలింగనం చేసుకుని నిద్రిస్తున్నవీరసింహం మేలుకుని నిప్పులు కురిసే కన్నులు తెరిచి, పరిమళం వెదజల్లే జూలును నిగిడ్చి ఒడలు విరిచి అన్నివైపులా ఒక్కసారి కదిల్చి గర్జించి వెలుపలికి నడచిన రీతి, అవిసె పూవువన్నెగల శ్రీకృష్ణా నీ అంతఃపురం నుంచి ఇక్కడికి వచ్చి ఈ లోకోత్తరమైన సింహాసనాన్ని అధిరోహించు, మా వచ్చిన పని విచారించి అనుగ్రహించమని గోపికలు కోరుతున్నారు.నీళాదేవిని ఆలింగనం చేసుకుని నిద్రించిన శ్రీకృష్ణసింహం మేలుకుంటున్న రీతిని వర్ణించడం ఇది. సింహం పర్వత గుహలో ఉన్నట్టు నీళాదేవి ఉత్తుంగ స్తనగిరిలో శ్రీకృష్ణుడు ఉన్నాడట. శయన స్థితినుంచి చైతన్య దశలోకి విజృంభిస్తున్న శ్రీ కృష్ణ నరసింహాన్ని చూడాలని అనుకుంటున్నారు. నిన్నటిదాకా తామరపూవులనుకున్న కళ్ళు ఈ వేళ నిప్పులు కురిపిస్తున్నాయి. ఆశ్రితుల శత్రువులపై పరమాత్ముడు కన్నెఱ్ఱ చేయడం కూడా గోపికలకు ఇష్టమే. ఆ నరసింహుని ఉగ్ర నేత్రాలను కూడా చూడగలగాలంటే ఇంకే కోరిక లేని వారైతేనే సాధ్యమవుతుంది. మెలకువ రాగానే కళ్లు తెరిచి, ఒళ్లు విరిచి, జూలు విదిలించి, శత్రు హృదయాల్ని భేదించే విధంగా మేఘం వలె గర్జించి, గుహనుంచి బయటకు వచ్చే సింహం వలె రావయ్యా యాదవసింహమా వీర నరసింహమా అంటున్నారు గోపికలు.
Also read: చీమకైనా బ్రహ్మకైనా అహంకారం సమానమే