Sunday, December 22, 2024

కవితా కల్పవల్లి దేవులపల్లి

  • ఆంధ్ర షెల్లీగా ప్రసిద్ధుడు
  • భావకవితోద్యమంలో అగ్రజుడు
  • శ్రీశ్రీ, విశ్వనాథల ప్రశంసలందుకున్న ఘనుడు

ఆయన కవిత్వంలో భావుకత్వం వెల్లివిరుస్తుంది. ఆయన రాసే గీతాల్లో లాలిత్యం పాఠకులను తన్మయత్వంలో మునిగితేలేలా చేస్తుంది. తెలుగు కవిత్వ లోకాన ఆయన ఓ ప్రముఖ అధ్యాయం. తెలుగు సినిమా రంగాన ఆయన పాటలు జగద్విఖ్యాతం. ఆంధ్రా షెల్లీగా ప్రఖ్యాతి గాంచి “కృష్ణపక్షం” వంటి గొప్ప రచనను తెలుగు పాఠకులకు అందించిన ఆ మేటి సాహితీ దురంధరుడే “దేవులపల్లి కృష్ణశాస్త్రి”. దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం గ్రామంలో తమ్మన్నశాస్త్రి, సీతమ్మ దంపతులకు నవంబరు 1, 1897 తేదీన జన్మించారు.

పిఠాపురంలో ప్రాథమిక విద్యాభ్యాసం

అతని విద్యాభ్యాసమంతా పిఠాపురం పాఠశాలలో సాగింది. పాఠశాల రోజుల్లోనే కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం వంటి రచయితల వద్ద ఆంగ్ల సాహిత్యాన్ని ఔపోసన పట్టాడు కృష్ణశాస్త్రి. 1918లో విజయ నగరం వెళ్లి డిగ్రీ చేస్తున్న రోజుల్లోనే ఆయనకు కవిత్వం రాయడం పట్ల మమకారం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేసి పెద్దాపురంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాక ఆయన పూర్తిస్థాయిలో రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. బ్రహ్మసమాజం లోను, నవ్య సాహితీసమితి లోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి.

ప్రాచ్య,పాశ్చాత్య సాహిత్య అధ్యయనం

ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు. 1922లో కృష్ణశాస్త్రి సతీమణి అర్థాంతరంగా మరణించడంతో కొన్నాళ్లు అదే బాధలో గడిపారు ఆయన. అదే బాధలో అనేక విషాద కవితలు రాశారు. ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి ఖండకావ్యాలు అలా పుట్టినవే.1929లో రవీంద్ర నాథ్ టాగుర్‌తో ఏర్పడిన పరిచయం కృష్ణశాస్త్రి జీవితాన్ని మరో మలుపు తిప్పింది. మరిన్ని కవితా రచనలను చేసేలా ప్రేరేపించింది. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం – కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు.

Krishna Sastry, an eternal tree of poetry

భావోద్వేగాలకు అక్షరరూపం

భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. చందమామ లోని చల్లదనాన్ని, మందార పువ్వులోని మకరందాన్ని, గుండెలోని ఆర్దత్రని రంగరించి రాస్తే అది కృష్ణశాస్త్రి పాటవుతుంది. పట్టు పరికిణిలో ఒదిగిన సింగారం కృష్ణశాస్త్రి పాట. ఆయన తెలుగు పదం అమ్మమ్మ చేతిలో నేతి నైవేద్యం. వర్షం వచ్చేముందు వీచే చల్లనిగాలి తెమ్మెర తనువును తాకితే ఎంత పులకరిస్తామో, కృష్ణశాస్త్రి కవిత వింటుంటే అదే పులకరింత వీనుల విందుగా వస్తుంది. భావ కవిత్వానికి సినిమా పాటల ద్వారా ఒక శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేసి, దిశానిర్దేశం చేసిన అతి కొద్ది మంది కవులలో కృష్ణశాస్త్రి ముందుంటారు. తెలుగు సినిమాల్లో జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.. అని భరతమాతను కీర్తించినా, జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి.. అంటూ దేశభక్తిని చాటినా.. ఆకులో ఆకునై , పువ్వులో పువ్వునై , ననులేత రెమ్మనై, సెలయేటిలో పాటనై, తెరచాటు తేటినై , నీలంపు నిగ్గునై… అని మగువ ఆర్ద్రతకు పెద్దపీట వేసినా అది కృష్ణశాస్త్రికే చెల్లింది.

మళ్ళీశ్వరితో ప్రారంభం

భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి… 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టి, సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించి, మల్లీశ్వరితో ప్రారంభించి కృష్ణశాస్త్రి ఎన్నో చక్కని సినిమా పాటలు అందించారు. అవి సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు. పిలచిన బిగువటరా, — మనసున మల్లెల మాలలు, ఆకాశ వీధిలో హాయిగా , ఔనా.. నిజమేనా? సడి సేయకో గాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి,
రానిక నీకోసం, ఆకులో ఆకునై,
ఆరనీకుమా ఈ దీపం, గోరింట పూచింది, పగలైతే దొరవేరా,
గట్టుకాడ ఎవరో, కుశలమా.. నీకు కుశలమేనా, చుక్కలతో చెప్పాలని, అడుగడుగున గుడి ఉంది, రావమ్మా మహాలక్ష్మి, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, ఈనాటి బంధం ఏనాటిదో, వేళ చూస్తే.. సందె వేళ, చీకటి వెలుగుల కౌగిటిలో, పాడనా తెనుగు పాట,
ఇది మల్లెల వేళయనీ, మావి చిగురు తినగానే లాంటి పాటలు సినీ సాహిత్యంలో అజరామరాలు.
షెల్లీ మళ్ళీ మరణించాడు : శ్రీశ్రీ

1975లో-ఆంధ్ర విశ్వవిద్యాలయం – కళాప్రపూర్ణ, 1978లో సాహిత్య అకాడమీ అవార్డు, 1976లో పద్మ భూషణ్ దేవులపల్లి ని వరించాయి. 1964 లో తిరుపతిలో అన్నమయ్య జయంతి ఉత్సవంలో కృష్ణశాస్త్రి పాల్గొన్నారు. ఆయన వెంట బాలాంత్రపు రజనీ కాంతరావు కూడా వెళ్ళారు. ఉపన్యాసం చదివేందుకు ఉద్యుక్తుడైన కృష్ణశాస్త్రి గొంతు బొంగురు పోయింది. దాంతో తన ఉపన్యాసాన్ని రజనీకాంతరావు చేత చదివించారు. వైద్య పరీక్షల్లో అది గొంతు క్యాన్సర్‌ అని నిర్ధారణ అయింది. మద్రాసులో కృష్ణశాస్త్రి స్వరపేటికను తొలగించారు. స్వరపేటిక తొలగించిన తరువాత కృష్ణశాస్త్రి దాదాపు పదహారేళ్లు బ్రతికినా, మూగవోయిన కంఠంతోనే అనేక సినిమాలకు పాటలు, ఆకాశవాణికి లలిత గీతాలు రాశారు. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించారు. తెలుగు దేశపు నిలువుటద్దం బద్దలైంది. ‘షెల్లీ మళ్లీ మరణించాడు’ అంటూ కృష్ణశాస్త్రి చనిపోయిన రోజున శ్రీశ్రీ రోదించాడు. కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ స్పందిస్తూ ‘ఒక్క షెల్లీ యే కాదు, కీట్స్, వర్డ్స్‌వర్త్‌ వంటి మహాశయుల సంయుక్త స్వరూపం కృష్ణశాస్త్రి’ అన్నారు.

(నవంబర్ 1 కృష్ణశాస్త్రి పుట్టినరోజు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles