26. తిరుప్పావైకథలు
మాలే అన్న పదప్రయోగం ద్వారా గోదాదేవి, గోపికలకు శ్రీకృష్ణుడిమీద ఉన్న ప్రేమ కన్నా శ్రీకృష్ణుడికి వారిమీద ఉన్న ప్రేమ చాలా రెట్లు ఎక్కువ అని వివరిస్తున్నారు. ఇన్ని రోజులు తమకు శ్రీకృష్ణుడంటే అమితప్రేమఅని గోపికలు అనుకున్నారట. కాని ఆయన చల్లని చూపుల్లో పొంగి పొర్లిన అనురాగాన్ని చూసి ఆయన భక్త వ్యామోహంతో పోల్చితే తమ వ్యామోహం సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే అని తెలుసుకున్నారు. కనుక ఆయనను ‘మాలే’ అని సంబోధిస్తారు. నాలో ఆశ్రిత వాత్సల్యం ఉందని మీరు ఏవిధంగా తెలుసుకున్నారని శ్రీకృష్ణుడు అంటే ‘మణిదీపాలను దాటి కాంతి దానంతటదే ప్రకాశించినట్టు మీ గుణం ప్రకాశిస్తున్నది మణివణ్ణా శ్రీ కృష్ణా’ అని జవాబిస్తారు. మనసులోని గుణం శరీరవర్ణంలో ప్రతిబింబిస్తున్నదట. మణివణ్ణా అంటే కొంగుమణిఅనీ భక్తులకు కొంగుబంగారమనీ కూడా అర్థం. మాలే మణివణ్ణా అనే మాటద్వారా భగవంతుని ఆశ్రిత వాత్సల్యం అనే సౌశీల్యం తోబాటు కొంగుమణిగా సులభంగా అందుతాడనే సౌలభ్యం కూడా ప్రకటితమైంది. అదిసరే మీరెందుకు వచ్చారు? అని ప్రశ్నించాడు.
Also read: అహంకారాన్ని లోనుంచే కాల్చే నిప్పు శ్రీకృష్ణుడు
పాండవ దూత
మహాపరాక్రమశాలి యోధ్ధలందరిలోకి మహా యోధ్ధ అయిన శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన పాండవులకోసం దూతగా సారథిగా చిన్నచిన్న పనులు చేస్తాడట (గుర్రాలను కడగడం, బండి తోలడం వంటి పనులు) పరమాత్మను పొందడానికి ఆళ్వార్లు పడే ప్రేమ తపన కన్న ఆళ్వార్లను పొందడానికి పెరుమాళ్లు పడే తపన మరీ ఎక్కువట.
Also read: ఎక్కడో పుట్టి మరెక్కడో పెరిగిన అరివీర భయంకరుడు
శ్రీకృష్ణుడే మణి
శ్రీ కృష్ణుడిని పొందగలమాఅని గోపికలు భావిస్తుంటే,గోపికలకోసమే ఆయన ఒకరికి పుట్టి మరొకరి దగ్గర పెరిగాడట. శ్రీ భాష్యం వారు ఇలా రాసారు. తాను పిచ్చెక్కినట్టుండి, వీరికి కూడా పిచ్చెత్తించి తనతో పోలిక కలిగించే విచిత్రమైన పిచ్చిగలవాడు శ్రీకృష్ణుడు. ఆయన వ్యామోహము చూసి గోపికలు పరవశులై మరింత వ్యామోహం పొందారట.
తామరపూవులో పుట్టిన లక్ష్మీతాయారు హరి శరీరకాంతికి పరవశించి ఆయన వక్షఃస్థలంలోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నది. మాలే అంటే అత్యధికుడని సంబోధన. మణిని పోలిన స్వభావము కలవాడు నారాయణుడు. మణి కలిగి ఉన్నవాడు మణి ఉంటేనే బతుకని, లేకపోతే ఉన్నట్టు కాదని అనుకుంటాడు. శ్రీకృష్ణుడు కలిగి ఉన్నవాడే ఉన్నట్టు, లేని వారు లేనివారే. మణి మరొకరికి ఉపయోగపడుతుందే కాని తనకు తాను పనికి రాదు.
విభీషణుడి ఆందోళన
శ్రీరాముడి విశిష్ఠ లక్షణం శరణన్న వారిని రక్షించడమే. శ్రీరాముడు శరణాగతవత్సలుడు, శ్రీ కృష్ణుడు ఆశ్రిత వ్యామోహము కలవాడు. రాముడు రావణుడి తమ్ముడినైన నన్ను స్వీకరిస్తాడా అని విభీషణుడు ఆందోళన పడుతూ వస్తున్నాడట. కాని శ్రీరాముడేమో రావణుడే వస్తే బాగుంటుంది కదా. పోనీ అతను కాకపోతే ఆయన తమ్ముడైనా వస్తే బాగుండు అని అనుకుంటున్నాడట. భక్తుల ఆలోచనల కన్న భిన్నంగా భక్తులకు అనుకూలంగా భగవంతుడిలో ఆలోచనలు ఉంటాయి.
Also read: ఈ లోకాలు కొలిచి నీ పాదాలెంత నొచ్చుకున్నాయో
పెద్దల మాట మన శ్రేయస్సు కోసం ఆచరించాలి
‘‘యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరే జనః
సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే’’
అన్నది మీరే కదా.పెద్దలు చెప్పిన, ఆచరించిన ఉత్తమ పద్ధతులు పాటించాలని భగవద్గీతలో చెప్పారు కదా. శెయ్యాదన శెయ్యోం, – పెద్దలు వద్దన్న పనులుచేయం అని మేమూ చెప్పినాము కదా, పెద్దలు చెప్పినట్టు మేలైయార్ శెయ్ వనగళ్ మేము మార్గళి స్నాన వ్రతం ఆచరించదలిచాం. పెద్దల ఆచారమే వ్రతానికి ప్రబల ప్రమాణము.
గోదాదేవి పాటించిన మూడు సూత్రాలు
జీయర్ స్వామి గోదచెప్పిన మూడు సూత్రాలు వివరించారు. అవి:
1. ‘‘ఆత్మోజ్జీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేం ఆచరించం.
2. “మేలైయార్ శేయ్-వనగళ్” ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం మనం అవే ఆచరించాలి.
3. మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా “నానే తాన్ ఆయిడుగ” నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యంవైపు చెదరని స్థితిని ఆర్జించడం.
ఈ మూడు సూత్రాలతో వ్రతం ఆచరించింది ఆండాళ్ తల్లి.
ఈ రోజు గోదమ్మ “మేలైయార్ శేయ్-వనగళ్” సూత్రాన్ని చెబుతుంది. పెద్దలు అన్నప్పుడు, కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాక పోవచ్చు. వేదంలో ఇవి తగును, ఇవి తగవు అనే నిర్ణయమై ఉంది. వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు. ఇది ఒక నిరూపణ’’.
భాగవత కథ
జీయర్ స్వామి రెండు సంఘటనలు వివరించారు. శ్రీకృష్ణుడి కి సన్నిహితుడుగా ఉండే వాడు శ్రీ మాలికుడు, అయితే శ్రీకృష్ణుడి పేరుచెప్పుకొని కొంచం అల్లరి చిల్లరగా చేసేవాడు. కొంత కాలం అయ్యాక కృష్ణా నీ వద్ద ఉన్న సుదర్శన చక్రం కావాలన్నాడట. ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూసాడు, ఇక వినక పోయేసరికి ఇచ్చాడు, పాపం తనకు తెలియక దాంతో తన తలనే నరుక్కున్నాడు శ్రీమాలికుడు.
వేంకటాచలపతి చరిత్ర
శ్రీవేంకటాచలపతి చరిత్రలో ఒక కథ ఉంది. తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించటానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమ శివుడు కూడా వేంచేసాడు. అయితే పరమ శివుడికి శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో, పరమ శివుడు అడిగాడట స్వామీ నేను ఈ కొండపై ఉంటాను అని, అయితే స్వామి ఈ ఆదిశేషుడిపైన కాదు, ఆదిశేషుడి చివరి స్థానం కపిల తీర్థం వద్ద నివసించమన్నాడు. శంఖ చక్రాలు ఎవ్వరి మాట వినవు శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే.
ఎంతటి జ్ఞానసంపన్నులైనా కర్మను వీడకూడదని, కనుక మార్గళిస్నానం వ్రతం వంటి పెద్దలు చెప్పిన శిష్టాచారాన్ని పాటించాలి. శంఖం కోరడమంటే ప్రణవధ్వని చేసే శంఖం ద్వారాప్రణవార్థమైన అకార త్రయ జ్ఞానాన్ని, పఱై అడిగి పరతంత్ర జ్ఞానాన్ని , పల్లాండు శైప్పారే అంటే సజ్జనసాంగత్యం, కోలవిళక్కే అంటే జ్ఞాన దీపమును, కొడియే వితానమే అంటే స్వభోక్తృత్వ దోషము లేని నీ కైంకర్యాన్ని అనుగ్రహించమని గోపికలు కోరుతున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్ ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః అన్న చరమశ్లోకంలో శ్రీకృష్ణుడు మామ్ అనడం ద్వారా సౌలభ్య లక్షణాన్ని గోదాదేవి ఈ పాశురంలో ప్రతిపాదించారు. అహమ్ అన్న మాటను, ఆలినిలైయాయ్ పదం ద్వారా పరమాత్ముడి సర్వశక్తి సంపదను వివరించారనీ ఈ పాశురం చరమశ్లోకవైభవాన్ని వివరిస్తున్నదనీ జీయర్ స్వామి ప్రవచించారు.
Also read: రావణు గూల్చిన శ్రీరామ శౌర్యమునకు జయము జయము