అందానికి అందం.. అభినయానికి అభినయం ఆమె సొంతం…
నూట యాభై సినిమాలకు పైగా నటించినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం ఆమె సొంతం..
ప్రియురాలిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు జీవం పోసిన గొప్ప నటీమణి ఆమె…
ఆమెనే కృష్ణకుమారి…
కృష్ణ కుమారి పేరు వినగానే అమాయకమైన ఆమె అందమైన ముఖం గుర్తొస్తుంది.. ఎలాంటి భావాలనైనా పలికించగలిగే ఆమె దరహాసం గుర్తొకొస్తుంది… అందం, అభినయంతో పాటు, అద్భుతమైన నటనను ఆభరణాలుగా చేసుకుని ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ కృష్ణకుమారికి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కొలదీ అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కానేరదు. అది అక్షరాల నిజం.
తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా నటించి కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కృష్ణకుమారి ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర నటులతో పాటు కాంతారావు, కృష్ణంరాజు, జగ్గయ్య, హరనాథ్ లతో నటించి మెప్పించింది.
ఆమె పశ్చిమ బెంగాల్ లోని నౌహతిలో 1933, మార్చి 6న జన్మించింది. వేదాంతం జగన్నాథ శర్మ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. తండ్రి ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల మూలంగా ఆమె విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా తదితర ప్రాంతాలలో జరిగింది. అస్సాంలో మెట్రిక్ పూర్తి చేసుకున్న తరువాత వీరి కుటుంబం మద్రాసుకు చేరుకోడంతో అక్కడే ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది.
16 ఏళ్ళకే హీరోయిన్ గా అరంగేట్రం
కృష్ణకుమారి మొదటి చిత్రం నవ్వితే నవరత్నాలు. 1951లో నిర్మించిన ఈ చిత్రానికి ముందే ఆమె నటించిన మరో చిత్రం మంత్రదండం విడుదలైంది. తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు 14 చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. తర్వాత 1953లో తాతినేని ప్రకాశరావు యన్.ఎ.టి.వారి పిచ్చి పుల్లయ్య లో ఆమె చేత కథానాయిక వేషం వేయించారు. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిశెట్టి పల్లె పడుచు, బంగారు పాప వంటి చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది.
తొలుత సాంఘిక చిత్రాలతో ప్రారంభించి ఆ తర్వాత పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలలో ఆమె అందానికి, అభినయానికి ఆమెకు మరిన్ని అవకాశా లు లభించాయి. నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఆమె బాగా నటించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది.
వైవిధ్యభరితమైన పాత్రలు
భార్యాభర్తలులో అభిమానం గల టీచరు శారదగా ఆమె చూపిన నటన అద్భుతం. అలాగే అదే చిత్రంలో ‘ఏమని పాడిదనో యీ వేళ’ అన్న వీణ పాట పాడినప్పుడు పలికించిన భావాలు శ్రీశ్రీ రచనా కౌశలానికి రూపాన్నిచ్చాయి. 1963లో లక్షాధికారి, బందిపోటు, ఎదురీత, కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసింది. 1967-68 మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం, భువనసుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకడు, స్త్రీ జన్మ వంటి చిత్రాలలో ప్రేక్షకులను మెప్పించింది. వరకట్నంలో నాయికగా గ్లామరస్ పాత్ర చేసిన తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాలలో మాత్రం నటించగలిగింది.
సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఆమె సుమారు 150 సినిమాలలో నటించింది. వీటిలో అధిక చిత్రాలు తెలుగువే, 15 కన్నడ చిత్రాలు, కొన్ని తమిళ భాషా చిత్రాలు ఆమె చేసింది. అయితే ఏ భాషా చిత్రం చేసినా ఆయా చిత్రాల్లో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
బాలీవుడ్ కు ‘నో’
ఆమెకు బాలీవుడ్ లో పలు అవకాశాలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమను విడిచి పెట్టలేదు. 1963లో కృష్ణకుమారి 16 సినిమాల్లో కథానాయికగా నటించింది. ఇది ఇప్పటికీ రికార్డుగానే మిగిలిపోయింది. ఇప్పటికీ ఆమె రికార్డును ఏ కధానాయికా అధిగమించలేదు. ఇక తెలుగు అగ్రహీరోలందరితో నటించిన ఆమె ఎన్టీఆర్ తో ఏకంగా 25 చిత్రాలు చేసింది. అవన్నీ హిట్ చిత్రాలే కావడం విశేషం.
అజయ్ మోహన్ తో వివాహం
ఆమె బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ను పెండ్లాడింది. వ్యాపారరీత్యా భర్త బెంగుళూరులో ఉండగా ఆమె కూడా మద్రాసు విడిచిపెట్టి బెంగుళూరులో మకాం పెట్టింది. కొంతకాలం విరామం తర్వాత అత్తమామల ప్రోత్సాహంతో తిరిగి నటించడం మొదలుపెట్టింది. కృష్ణకుమారి దంపతులకు సంతానం కలగకపోవడంతో అనాథాశ్రమం నుంచి ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఆమె పేరు దీపిక. షావుకారు జానకి ఆమెకు పెద్దక్క. మరో అక్క దేవకి కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ ఆమె చిన్న వయసులోనే మరణించింది.కృష్ణకుమారి మూడుసార్లు జాతీయ పురస్కారాలు, రాష్ట్రస్థాయిలో అనేక నంది పురస్కారాలు సాధించింది. బ్రిటన్ లోని బర్మింగ్ హాం సంస్థ లైఫ్ టైం అచీవ్‍మెంట్ పురస్కారంతో ఆమెను గౌరవించింది. చివరికి 2018వ సంవత్సరం జనవరి 24 ఉదయం బెంగుళూరులో అస్వస్థతో మరణించింది. చలన చిత్ర రంగాన కృష్ణకుమారి లేని లోటు పూడ్చ లేనిది.
(ఈనెల 6న కృష్ణకుమారి జయంతి సందర్భంగా ప్రత్యేకం)
దాసరి దుర్గా ప్రసాద్
మొబైల్: 779496169