25. తిరుప్పావై కథలు
గజేంద్రమోక్షంలో ఒక భక్తుడిని కాపాడడానికి వచ్చినట్టు రావడం కాదు కృష్ణావతారం అంటే, ఒక తల్లి కడుపులో పుట్టి తన అవతారాన్ని ప్రారంభించి మరో తల్లి ఇంట పెరిగినాడు శ్రీ కృష్ణుడు.
Also read: భాగవతం ఇవ్వలేదని పోతన్న మీద రాజద్రోహనేరం మోపిన రాజెవరు?
శ్రీరాముడు యువకుడిగా ఎదిగిన తరువాత రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చింది. కాని శ్రీ కృష్ణుడి పుట్టుకే శత్రుస్థావరంలో జైల్లో జరిగింది. పుట్టిన వెంటనే మౌనంగా జైలునుంచి తరలిపోయి రహస్యంగా మరొక తల్లి దగ్గర పెరగాల్సివచ్చింది. ఏడో రోజునుంచే రాక్షసులతో పోరాటం తప్పలేదు. అందుకే తల్లి పేరు చెప్పకుండా, ఎక్కడ పుట్టాడో ఎవరో ఎవరి దగ్గర పెరుగుతున్నాడో, అతనికి ఎవరివల్ల భయం ఉందో ఆతని పేరు దాచి మాట్లాడుకుంటున్నారు భయం భయంగా గోపికలు. కాలం గడిచిపోయినా శ్రీ కృష్ణ ఆవిర్భావ సమయంలో ఉన్న పరిస్థితులు అప్పుడే ఉన్నట్టు భావించి ఆందోళన పడుతున్నారు. ఇదీ గోపికల భక్తి ప్రేమాతిశయం. భగవంతుడికి జన్మనిచ్చిన సంతోషం కన్న ఆయన్ను కంసుడేంచేస్తాడోనన్నభయంతో పసికందును అర్ధరాత్రి తల్లి తీసుకుపొమ్మని ఇచ్చేసింది. కన్నతండ్రి తరలించవలసి వచ్చింది. దేవకీ, యశోద ఎంత పుణ్యం చేసుకున్నారో? పోనీ నంద గ్రామంలోనైనా ప్రశాంతంగా పెరిగాడా అంటే అదీ లేదు. ఎప్పుడు ఏ రాక్షసుడు దాడిచేస్తాడో తెలియని భయానక పరిస్థితులే ఎప్పుడూ. ఆ సమయంలో పుట్టిన ప్రతి శిశువును సంహరించాలని కంసుడి ఆదేశం. దాన్ని పాటించాలని ఇంకా ఎక్కడైనా పసికందు కనిపిస్తాడా అని చూస్తూ పాలిస్తాననే నెపంతో బయలుదేరిన పూతన, అమాయకంగా బండిలో దూరిన శకటాసురుడి వంటి రాక్షసులు ఎందరు ఊళ్లో తిరుగుతున్నారు, మరెందరు వ్రేపల్లెకు వస్తున్నారో తెలియదు. ఇదంతా చూసే వారికి భయం కలిగించే వ్యవహారం కాని శ్రీకృష్ణుడికి ఒక లీల, ఒక ఆట, ఒక మాయ. లేకపోతే కాలితో తన్ని శకటాసురుని సంహరించడం సామాన్యమా? పూతన పాలతోపాటు ప్రాణాన్ని కూడా పీల్చేయడం సాధ్యమా?
దేవకీ వసుదేవుల పెళ్లి తరువాత స్వయంగా కంసుడు తన చెల్లెలిని బావను వారింట్లో దింపడానికి రథం తోలుతున్నపుడు అశరీరవాణి వారి ఎనిమిదో పుత్రుడే నీకు మృత్యువు అని ముందే కంసుడికి చెప్పేస్తుంది. ఆ విధంగా ముందే హెచ్చరించకపోయి ఉంటే దేవకీ వసుదేవుల ఆరుగురు పిల్లలు కంసుడిచేతిలో మరణించే వారు కాదు. వారికిజైలు జీవితం ఉండేది కాదు. కంసుడు శ్రీకృష్ణుడిపైకి అంతమంది రాక్షసులను పంపించే వాడు కాదు. అదే శ్రీకృష్ణలీల. తన తల్లిదండ్రుల వివాహ సమయంలోనే కంసుడికి వర్తమానం అందింది, వారి అష్టమ సంతానంలో అతను చస్తాడని. అక్కడి నుంచి కంసుడు భయపడుతూనే ఉన్నాడు. రోజూ భయపడి చనిపోతూనే ఉన్నాడు. ముందే అశరీరవాణిద్వబారా కంసుడిని హెచ్చరించి ఉండకపోతే, అతను భయంతో చచ్చేఅవకాశం ఉండేది కాదు. చిన్నతనంలోనే అన్ని లీలలు చూపే సందర్భం వచ్చేది కాదు. ముందే చెప్పడమే భాగవతంలో కృష్ణుని అద్భుత లీల.
Also read: చీమకైనా బ్రహ్మకైనా అహంకారం సమానమే
ధనుర్యాగం తరువాత కంసుడు కౌమార వయస్కుడైన శ్రీకృష్ణుని చేతిలో చనిపోవడానికి ముందు జీవచ్ఛవమైపోయాడు. అదే కంసుని గుండెలో నిప్పు అంటే. కంసుడి అధీనంలో ఉన్న రాక్షసులందరినీ చంపిన తరువాత శ్రీకృష్ణుడు మధురకు బయలుదేరతాడు. అదీ కంసుడు పిలిస్తేనే. మృత్యువును స్వయంగా ఆహ్వానిస్తాడు కంసుడు. అతన్ని ఎదుర్కొనడో లేడో తెలియదు. అనుమానమే. కాని కువలయా పీడం, చాణూర ముష్ఠికులను దాటుకుని రావడం కష్టం అని నమ్మకం.
మన హృదయాలలో అంతర్యామి యై భగవంతుడు కనిపించకుండా కాపాడుతూ ఉంటాడు. బయటకు వస్తే భగవంతుడు కాడని మనవాళ్లే వాదిస్తారు కదా అని గోదాదేవి అంటూ అద్భుతమైన భక్తి సూత్రాలను వివరిస్తున్నారీ గోవింద గీతికలో.
Also read: శ్రీకృష్ణా మమ్మల్ని రక్షించడానికే అవతరించినావు
శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు ఈ పాశురార్థాన్ని చాలా హృద్యంగా వివరించారు.ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కంసుని కాలం గడిచి పోయినా సరే, స్వామిపై అంత ప్రేమ. పుట్టిన చోటు అద్వితీయం. కన్న తల్లి అద్వితీయం, పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. తల్లి ఒడిలో తల్లికడుపులో దాక్కునే అదృష్టం పరమాత్మకే లేదా? ఎవ్వరికి తెలియకుండా నందగోకులం చేరి, “ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర” మరొక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంత అదృష్టవంతురాలు. “తరిక్కిలానాకి” సహించలేక పోయాడు ఆ “త్తాన్” ఆ నీచుడు, కంసుడు అని వాడి పేరుకూడా చెప్పడం లేదు. కొందరి పేర్లు చెబితేనే నోరు పాడై పోతుంది అని. ఏం చేయ్యాలని అనుకున్నాడంటే “తీంగు నినైంద” కృష్ణుడికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడో, “కరుత్తై పిరపిత్తు” అది వారికే జరిగేట్టు చేసాడు. “కంజన్ వైత్తిల్ నెరుప్పెన్న నిన్న” కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు. వెన్నతిన్న చల్లని కృష్ణుడు నిప్పు కావడమేమిటి. కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషమే నిప్పుగా కడుపు మంట. అదే ప్రేమ అయితే తరించి కంసుడు పోయేవాడు. ద్వేషం కనుక దహించుకుపోయాడు.
భక్తులంటే శ్రీకృష్ణుడికీ అమితమైన ప్రేమే
స్వామి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్లల్లో ప్రేమను గుర్తించింది ఆండాళ్ తల్లి. “నెడుమాలే” ఆయన దీర్ఘమైన వ్యామోహం, ప్రేమ కల్గినవాడు తనను ఆశ్రయించుకున్నవాళ్ళ యందు, అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగుణాలుగా భావిస్తున్నాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా ‘తమకే ప్రేమ ఉంది, కృష్ణుడికి తమపై ప్రేమలేదు’ అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా, ‘మనం ఆత్మలం కదా మనకుండే ప్రేమ అణుమాత్రం, ఆయన విభువు, ఆయన కుండే మనపై ప్రేమ విభువంతా’.
సీత హనుమతో ‘‘రావణుడు నాకు కేవలం రెండు మాసాల గడువిచ్చాడు, రాముడితో చెప్పు ‘మార్తా దూర్దం న జీవిష్యే’ నేను ఒక నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను’’ అని చెప్పమంది. హనుమ ఈ విషయం చెప్పగానే, రాముడు ఆశ్చర్యంతో “యది మాసం దరిష్యతి చిరంజీవతి వైదేహి” అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంతకాలమైన ఉండ వచ్చును. మరి తనో, “నజీయేయం క్షణమపి వినాతాం అశితేక్షణాం” నేను క్షణ కాలం కూడా ఆమెను విడిచి జీవించగలనా’ అన్నాడు, విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత. వీళ్లు ఈరోజు ఆయన కళ్లల్లో అంత వ్యామోహం చూసారు.
దేవకి యశోదలే ద్వయమంత్రాలు
నిద్రిస్తున్న మానవాళిని తట్టి, భక్తిప్రేమాభిమానాలను మేల్కొల్పడమే తిరుప్పావై. పొంగే భక్తే అసలైన పొంగలి కాని తినే పదార్థమా. కాదు, అది బ్రహ్మపదార్థం,శ్రీకృష్ణునికి ఇద్దరు తల్లులున్నట్టు నారాయణ తత్వాన్ని తెలిపే మంత్రాలు రెండు ఉన్నాయి. నారాయణాష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి. అష్టాక్షరిలో నారాయణతత్త్వం ప్రకాశిస్తే వాసుదేవ మంత్రంలో సర్వవ్యాపకత్వం గూఢముగా ఉందని, దేవకి నారాయణాష్టాక్షరి అయితే యశోద వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రమని కందాడై రామానుజాచార్యులు వివరించారు. ఒకటి గాయత్రీ మంత్రమైతే మరొకటి నారాయణాష్టాక్షరి అని వివరించే వారూ ఉన్నారు. వారు గాయత్రీ మంత్రము దేవకీ దేవి అనీ నారాయణాష్టాక్షరి యశోదాదేవి అని అన్వయిస్తారు. కంసుడంటేనే అహంకారం. అంటే ఆత్మ శరీరం వేరనుకోవడం, తనకన్న పరమాత్ముడు వేరే లేడనుకోవడం, అటువంటి అహంకారుల గుండెలో నిప్పుగా మారి శ్రీకృష్ణుడు ఆ అహంకారాన్ని లోనుంచి కాల్చేస్తాడు.
Also read: ఔదార్యానికి పరాకాష్ట – పరమాత్ముడు
Also read: వైష్ణవమతంతో 33 దేవతలెవరు?