గోదా గోవిందగీతం 11
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు భావార్థ గీతిక
ఎప్పుడు దూడలైయుండు ఆల పాలు పితుకు వారు
వైరి కోటల ముట్టడించి గెలిచెడి వీర గోపాలురు వారు
కొరత లెరుగని వంశమున బుట్టిన యాదవ శూరులు
పాముపడగ నితంబుముల దాన, నెమలి రంగుదాన
బంగారు తీగ మెరుపు మేనుదాన బంధుసఖులమెల్ల
నీదు భవనపు వాకిటచేరి నిలిచినాము మొగలి వన్నెవాడు
మోహన మురళీ కృష్ణు ముద్దుల జవరాల నిదుర ఇంకేలనమ్మ
కరుణించి కదలి రావమ్మ సిరినోముజేయ మాదరి జేరవమ్మ
అర్థం
కత్తుకఱవై= దూడల వంటి పశువులు:పలకణంగళ్ = అనేక మందలను, కఱందు=పాలుపితుకుతున్న వారు:సెట్రార్= శత్రువుల, తిఱల్ అఝియ= బలం నశించే విధంగా:చెన్ఱు= దండెత్తి:శెరుశెయ్యుమ్=యుద్ధం చేసే వారును:కుట్రమ్ ఒన్రు ఇల్లాద= కొరత ఏదీ లేని వారయిన:కోవలర్ తమ్= గోపవంశంలో జన్మించిన: పొర్ కొడియే = బంగారు తీగ వలెనున్నదానా:పుట్రు అరవు అల్ గుల్ = పుట్టలోని పాముపడగవంటి నితంబము గలదానా:పునమయిలే= తోటలోని నెమలి వలె ఉన్నదానా, పోదరాయ్=బయలుదేరి రావమ్మా:శుట్రత్తు=చుట్టములు:తోఝిమార్= చెలికత్తెలు:ఎల్లారుమ్= ఎల్లరును:వందు= వచ్చి:నిన్ ముట్రమ్ పుగుందు= నీ భవనమునందు ప్రవేశించి:ముగిల్ వణ్ణన్= మొగిలి వర్ణముకలగిన (మేఘపు మేని రంగువాడు) శ్రీకృష్ణుడు:పేర్ = పేరు:పాడ= పాడుటకు:శెల్వ= అందమైన:పెండాట్టి నీ=సతీమణీ:శిట్రాదే పేశాదే= ఉలకకుండా పలకకుండా:ఎత్తుక్కు= ఎందుకుఏ ప్రయోజనాన్న ఆశించి:ఉరంగుమ్= నిద్రిస్తున్నావు:పోరుళ్= దీనికి కారణమేమిటి?
పాడిపశువులు కొమ్ములతో కుమ్ముతాయని భయపడకుండా పాలు పిదికే వారు
రణంలో బాణాలు లెక్క చేయక అరివీరుల ప్రాణాలు తీసేందుకు వెనుకాడని వీరులు
యాదవులు. ఆ యాదవుల హరివంశంలోని వీర పుత్రిక ఆమెకు మేలుకొలుపుల గీతికలు.
‘ఓ సౌందర్యరాశీ నెమలిపింఛాల నెలతా, పడగ నితంబపు పడతీఅందాల భరణీ ఎంత సేపీ నిద్ర నీకు’. ‘నీవు కృష్ణప్రియవని, నీవు తోడైతే నెమలి పింఛమువాడు మమ్ము కాచేనని
నీకై వేచి వేచి, మా కనులు కాచినా కదలవేమిది కమలాక్షీ’‘మొద్దునిద్దుర వదిలి ముద్దుగుమ్మా లేవవమ్మా. మోహన రూపునిజగదేకసుందరు కృష్ణమూర్తిని ఆడిపాడి కొనియాడుదాం దావమ్మా’‘తొలి కిరణాల వెచ్చని వెలుగుల యమునలో మునకతో లోకులందరికీ దారి చూపిన గోపికా కన్నెల గొప్ప నోముకు కదలవే రేపల్లె పిల్లా లేచిరావేతల్లీ’ అని గోద పాడిన మధుర గీతం ఈ పాశురం.
Also read: భగవంతుడిని తెలుసుకుంటే అన్ని నోములు నోచినట్టే
గోకులంలో గోవులన్నీ నిరంతరం యవ్వనంలో ఉన్నాయట. వాటన్నింటికీ దూడలు కూడానట. అవన్నీ కడవల నిండా పాలు స్రవిస్తూనే ఉంటాయట. ఇది ఏ విధంగా సాధ్యం? కారణం కృష్ణ స్పర్శ. గోవున్నింటనీ కన్నయ్య ప్రేమతో తడుముతాడట. తానే వాటికి గ్రాసం వేస్తాడట. తినిపిస్తాడట. తానే ప్రతి గోవునూ కట్టివేస్తాడట. అక్కడ ఎన్ని గోవులో అందరు కృష్ణులట. వత్సమధ్యగతం బాలం, అంటే దూడల మధ్య తిరుగాడే బాలుడు ఈ దేవుడు. ముక్త పురుషులు నిత్యసూరులు ఎప్పుడూ యవ్వనంలో ఉంటారట. భగవద్దర్శనముతో గోపికలూ స్పర్శనముతో గోవులూ పులకిస్తున్నటువంటి గోలోకం బృందావనం.
దశరథుడి వయసు
64వేల సంవత్సరాల వయసున్న దశరథుడు, గంభీరగమనుడైన రాముని చూచినప్పుడల్లా మళ్లీ యవ్వనవంతుడిగా మారుతున్నట్టు చెప్పుకున్నాడు. భగవంతుడిని దర్శనమే యవ్వనమిస్తే, స్పర్శనము ఏదైనా ఇవ్వగలదు కదా?
రావణుడికి మరో అవకాశం
యుధ్దంలో తనపై ప్రయోగించిన ఆయుధాలన్నీ కోల్పోయిన రావణుడిని చంపవచ్చు. కాని ‘‘అలసిపోయిన ఓ రావణా ఇంటికి వెళ్లు మళ్లీ ఆయుధాలను సమకూర్చుకుని రేపు రా’’ అని పంపిస్తాడు. అవక్రపరాక్రములు, దోషం లేని మహావీరులు యాదవ వీరులు. గోకులంలోని గోపికలంతా వచ్చి చేరుకోగలిగేంత పెద్ద ప్రాంగణం ఉంది. అక్కడ మొయిలు (కరిమబ్బు) వర్ణమువాడైన శ్రీకృష్ణుడిని స్తుతిస్తున్నారు. మేఘం తో పోలిక ఎందుకంటే ఎవరు తనవారు ఎవరు కారు అనే వివక్ష లేకుండా కరిమబ్బు అందరిమీదా వాన కురిపిస్తుంది, మురిపిస్తుంది. శ్రీ కృష్ణుడూ అంతే. పాపపుణ్యాల తారతమ్యాలు లేకుండా స్వపరభేదం లేకుండా అందరిమీదా కరుణ కురిపిస్తాడు. ఆమె శ్రీకృష్ణానుభవమనే విశిష్ఠమైన సంపద కలిగిన శెల్వపెండాట్టీ.
Also read: కృష్ణస్పర్శస్వర్గాన తేలుతున్నావా?
నిన్ను నెమలితో పోల్చాం, నెమలి మేఘాన్ని చూసి పరుగెత్తివచ్చినట్టు, నీలి మేఘశ్యాముడిని మేము కీర్తిస్తుంటే నీవూ వస్తావని అనుకున్నాం. కానీ, ఉలుకు లేదు పలుకు లేదు. ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ లేపుతున్నది ఆండాళ్ తల్లి.
నిన్న జ్ఞానవతిని నిద్రలేపిన ఆండాళ్ ఇవ్వాళ సౌందర్యవతిని రమ్మని పిలుస్తున్నారు. పురుషులను ఆకర్శించేది దేహ సౌందర్యం. పురుషోత్తముణ్ణి ఆకర్శించేది భక్తి సౌందర్యం. భగవత్ సేవా సంపద గొప్పగా కల్గినఈ గోపికను తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడని.
ఈ రోజు పూదత్తాళ్వార్ ను పిలుస్తున్నారు. మహాబలిపురం దగ్తర తిరుక్కుడల్ మల్లై లో శ్రీమన్నారాయణుడి గదాంశంతో మాధవీ పుష్పం నందు జన్మించిన ఆళ్వార్ వీరు. ప్రేమ అనే ప్రమిదలో నెయ్యిగా జ్ఞానదీపాన్ని వెలిగించిన వారు.ఈరోజు గురుపరంపర వాక్యం శ్రీ మత్ యామునమునయేనమః.
గోద గీతికపై బాపు భావగీత
జగన్మోహనుని పైన బాపు జగన్మోహనమైన చిత్రం. శ్రీకృష్ణుని శెల్వప్పెణ్డాట్టి అన్న పదం ఆధారంగా బాపు ఈచిత్రం గీసి ఉంటారు. శ్రీకృష్ణుని ప్రియమైన ఇల్లాలు సత్య. నరకాసురునితో సమరంలో విల్లందుకునిపోరాడే అవకాశం ఆమెకిచ్చి ఓరకంట చూస్తున్నాడీ కమలనయనుడు. గరుడధ్వజుడు. ధనుర్బాణాలు పక్కన పెట్టి అలా ఒరిగి ఆమెనే గమనిస్తున్నాడు. అటువాలు జడ, ఇటు వంగిన ధనువు, విడవడానికి సిద్ధంగా ఉన్నబాణం. వీరగోపాలురు, వీర గోపాంగనలు. ఆమె పాముపడగ నితంబుములుగలది. నెమలిరంగు. బంగారుతీగ మెరుపు మేనుతో మెరిసేది. అతను మొగిలి వన్నెకాడు. కృష్ణుని ముద్దుల జవరాలా ఇంకా నిదురెందుకు? రావమ్మా సిరినోము చేసుకుందాం అంటున్న ఈ పాశురానికి బాపు గీసిన భావగీత ఇది.
Also read: లేవమ్మా గోపికా, గోవిందుని సేవిద్దాం రావమ్మా