Thursday, December 26, 2024

త్రిసముద్రాధిపతి రాయలవారి 513వ పట్టాభిషేకోత్సవం

-మైనా స్వామి

శ్రీక్రిష్ణదేవరాయలు… ఆ పేరు వింటేనే మనసు పులకిస్తుంది. దక్షిణాపథం అంతటినీ ఒకే పాలన కిందకు తెచ్చిన చక్రవర్తి, మహాచక్రవర్తి, మౌర్య సామ్రాజ్య అధినేత అశోకుని తర్వాత అంతటి బలశాలి, బుద్ధిశీలి, సాహితీశీలి క్రిష్ణదేవరాయలు. భారతదేశ చరిత్రలో రాయల పాలన ఒక సువర్ణ అధ్యాయం. నిరంతరం యుద్ధాలు చేస్తూనే వున్నా ప్రజా సంక్షేమాన్ని ఏమాత్రం విస్మరించకుండా ప్రజారంజక పాలనను అందించిన నేత శ్రీక్రిష్ణదేవరాయలు. తన ఆస్థానంలో శూద్రులకు సమున్నత స్థాయిని కల్పించిన దార్శనికుడు. ప్రజల వద్దకు పాలనను చేర్చడంకోసం అమర నాయంకర వ్యవస్థను అమలుచేసిన ఆదర్శ చక్రవర్తి. ప్రజాసమస్యలను, రాజ్యంలోని శాంతిభద్రతలను, శత్రురాజుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నిఘా వ్యవస్థను అత్యంత బలోపేతం చేసిన ప్రధాన గూఢచారి. ద్రావిడ వాజ్మయానికి ఆయన చేసిన సేవ అజరామరం.

శాసనం చూపిస్తున్న చరిత్రకారుడు మైనాస్వామి

ఒక వైపు వ్యవసాయాభివృద్ధి కోసం చెరువులూ, కాలువలూ నిర్మిస్తూ మరోవైపు సైనిక సంపత్తిని సమకూర్చు కోవడానికి రాయలు స్వయంగా పర్యటనలు జరిపేవాడు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం ఫరిజల్లిపేటలో దొరికిన 1515 నాటి రాగి ఫలకం తెలుగు శాసనంలో సైనికుల ఎంపిక గురించి రాశారు. ఆరడుగుల ఎత్తు, బలశాలురైన యువకులను రాజు స్వయంగా ఎంపిక చేసేవారని ఫరిజిల్లిపేట శాసనం చెబుతున్నది.

పటిష్ట నిఘా:  తన పాలనలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవడానికి శ్రీక్రిష్ణదేవరాయలు మారువేషంలో తిరుగుతుండేవాడు. అప్పుడే రహస్య సమావేశాలు నిర్వహించి యుద్ధతంత్రాలు, తదుపరి దండయాత్రలపై చర్చించే వాడు. తంత్రాలకు ప్రధాన సూత్రధారి మహామంత్రి తిమ్మరుసు. కొండవీడు సమీపంలో మారువేషంలో తిరుగుతున్న రాయలకు ఒక ఆశ్చర్యకరమైన సంభాషణ వినిపించింది. విజయనగర సామ్రాజ్య ‘సరిహద్దుల గురించి ఇద్దరు వ్యక్తులు వాదులాడు తున్నారు. అందులో ఒక వ్యక్తి      “కొండవీడు మనదేరా కొండపల్లి కూడా మనదేరా …కాదని గీదని వాదుకువస్తే కటకందాకా మనదేరా” అన్నాడు.  ఆ సంవాదం విన్న క్రిష్ణరాయలు ఒరిస్సా రాజు ప్రతాపరుద్ర గజపతిని ఓడించడానికి పథకం రచించాడు. కొండవీడు, వినుకొండ, బెల్లంకొండ, కొండపల్లి, ఉదయగిరి తదితర దుర్గాలు గజపతుల అధీనంలో వుండేవి. కటకం వెళ్ళి ప్రతాపరుద్ర గజపతిని ఓడించి ఆయన కుమార్తె ని మూడోభార్యగా స్వీకరించాడు.

Also read: చోళ రాజ దండానికి మూలం నోలంబ రాజ చిహ్నం: మైనాస్వామి        

శ్రీక్రిష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని ఎంతగానో విస్తరించాడు. పశ్చిమాన గోవా, బరుకచ్చం (నేటిగుజరాత్లోని కచ్ ప్రాంతం), తూర్పున కటకం (ఒరిస్సా), దక్షిణాన శ్రీలంకతో సహా సముద్రపు అంచులు (కన్యా కుమారి) ఉత్తరం వైపున మధ్యప్రదేశ్ సరిహద్దులదాకా గల ప్రాంతాన్నంతా ఒకే పాలన కిందకు తెచ్చిన మహాచక్రవర్తి. మూడు వైపులా సముద్రంపై పట్టు సాధించినందున త్రి సముద్రాధీశుడుగా ఖ్యాతినొందాడు. పన్నుల వసూలును క్రమబద్ధీకరించి ప్రజలకు మెరుగైన సేవలందించాడు. యుద్ధాలకోసం, ప్రకృతివైపరీత్యాలు సంభవించినపుడు ప్రజలను ఆదుకోవడానికి క్రిష్ణరాయలు ఒక గుప్త నిధిని ఏర్పాటుచేశాడు. సుమారు 50 లక్షల బంగారు వరహాలను రహస్య ప్రదేశాల్లో దాచారని పేస్ పేర్కొన్నాడు.

రాయచూరు యుద్ధం:  శ్రీక్రిష్ణదేవరాయలు చేసిన యుద్ధాలలో అత్యంత భీకర మైనది రాయచూరు యుద్ధం. 1520 మేలో జరిగిన ఆ యుద్ధంలో బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా ను ఓడించి రాయచూరు, బీజాపూరు, బీదరులను విజయనగర రాజ్యంలో విలీనం చేసుకొన్నారు. యుద్ధంలో 7 లక్షల మంది సైనికులు పాల్గొనగా 16 వేల మంది చనిపోయారు. సైనికులకు సహాయంగా 35వేల గుర్రాలను వినియోగించారు.

Also read: పెనుకొండను భారతవారసత్వ నగరంగా ప్రకటించాలి : మైనాస్వామి

రాజగోపురo: తన పట్టాభిషేక మహో త్సవానికి గుర్తుగా హంపిలోని విరూపాక్ష గుడికి తూర్పు దిక్కున 160 అడుగుల ఎత్తుగల రాజ గోపురాన్ని నిర్మించాడు. ఎత్తయిన రాజగోపురాల నిర్మాణం, ఆలయాల విస్తరణ, అత్యంత అందమైన శిల్పసంపదను సమకూర్చడం, ప్రధాన ఆలయాల్లో అమ్మవారి విగ్రహాల ఏర్పాటు వంటివి చేయడం ద్వారా సామ్రాజ్యంలోని ఆలయాలకు కొత్త రూపు వచ్చింది. హంపి విరూపాక్ష రాజగోపురం ఎదురుగా రాజమార్గం వుంది. ఆ మార్గం ఎంతో విశాలంగా వుంది. మార్గానికిరువైపులా వ్యాపార మండపాలు వేలాదిగా వున్నాయి. అందులో కొన్ని రెండు మూడు అంతస్తులుగా వుండేవి. రెండంతస్తుల శిథిల మండపాలను నేడు కూడా చూడవచ్చు. ప్రధాన వర్తకమంతా విరూపాక్ష గోపుర మార్గంలోనే జరిగేది. వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, బంగారుహారాలు రాసులుగా పోసి అమ్మేవారని, వాటిని కొనడానికి విదేశీ వ్యాపారులు విరివిగా వచ్చేవారని డొమింగో పేస్ తన “బిస్ నగ”లో పేర్కొన్నాడు. రాజమార్గంలో సరుకులతో నిండిన సవారీ బండ్లను వరుసగా నిలిపేవారని కూడా రాశాడు.

శ్రీక్రిష్ణదేవరాయలు బాల్యం నుంచే శ్రీవారి భక్తుడు. గజపతులపై దండయాత్రకు బయలుదేరే ముందు రాయలు తన భార్యలతో సహా తిరుమల వచ్చి స్వామివారికి నవరత్నకిరీటాన్ని 1513 ఫిబ్రవరిలో సమర్పించాడు. అందులో వేలాది వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, పచ్చలు వున్నాయి. కిరీటం బరువు 30 కిలోలకు పైనే వుంటుంది. యుద్ధానికి వెళ్ళే ముందు, విజయం వరించిన తర్వాత భార్యలతో సహా వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామిని రాయలు దర్శించేవాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి సింహద్వారంలో శ్రీక్రిష్ణదేవరాయలు, ఆయన భార్యల విగ్రహాలున్నాయి. క్రీ.శ.1474 ఫిబ్రవరి 16న జన్మించిన శ్రీక్రిష్ణదేవరాయలు బాల్యం చంద్రగిరి, పెనుకొండలలో గడిచింది. తిరుమల వెంకన్నపై రాయల ప్రబల భక్తికి నిదర్శనంగా తన కుమారుని పేరు తిరుమలరాయలు, కుమార్తెల పేర్లు తిరుమలాంబ, వెంగళాంబ అని పెట్టాడు. శ్రీక్రిష్ణ దేవరాయలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. శ్రీక్రిష్ణదేవరాయల తండ్రి నరసనాయకుడు కాగా తల్లి నాగలాంబ. శ్రీక్రిష్ణదేవరాయలు ఒక్క తెలుగు జాతికే కాదు మొత్తం దక్షిణ భరతజాతికంతా ఎంతో సేవ చేశాడు. రాయల సేవలు అద్భుతం, అమోఘం, అనన్యసామాన్యం, అజరామరం. ఆయన పట్టాభిషిక్తుడయి 513 సంవత్సరాలయ్యింది.

Also read: హేమావతిలో హొయసల శాసనాన్ని గుర్తించిన మైనాస్వామి

(మరింత సమాచారంకోసం మొబైల్ నంబరు 9502659119కు ఫోన్ చేయండి.)

Mynaa Swamy
Mynaa Swamy
Myna Swamy's full name is Mylaram Narayana Swamy. A senior journalist who was a correspondent for Andhra Prabha, Indian Express, Andhra Jyothy, Ujwala and Subrabhatam. He is also a short story writer and novelist. Lepakshi is his latest book which received acclaim. It is being translated into English, French, Hindi, and other languages. His Forte is history. Mobile No: 9502659119

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles