జులై 1 వ తేదీ కొవ్వలివారి జయంతి. ఈ తరుణంలో ఆయనను తలచుకోవడం అవసరం. మరిన్ని తెలుగుదీపాలను మరింతగా వెలిగించుకోవాల్సిన పరిస్థితిలోనే మనం ఉన్నాం. తెలుగు అక్షరాలను విభిన్న ప్రక్రియల్లో తీర్చిదిద్ది, తెలుగుదనాన్ని మన గుండె నిండా నింపిన మహనీయులు ఎందరో ఈ నేలపై పుట్టిగిట్టారు. వారు సృజియించిన సారస్వతం చిరంజీవత్వాన్ని సంతరించుకొని మన మధ్య ఇంకా దివిటీలు చూపిస్తోంది. ఆ తెలుగువెలుగులను కళ్ళకు అద్దుకుందాం. ఆ వరుసలో వారే కొవ్వలి లక్ష్మీనరసింహారావు. ‘వేయి నవలల కొవ్వలి’గా ప్రసిద్ధులు. ఈ మాట అన్నది ఎవరో కాదు మహాపండితుడు, పరిశోధనా పరమేశ్వరుడు నిడదవోలు వెంకటరావు.
Also read: కశ్మీర్ లో కింకర్తవ్యం?
మహిళలకు పుస్తకాలు చదవడం నేర్పిన మహానుభావుడు
మధ్యతరగతి స్త్రీలకు పుస్తకాలు చదవడం నేర్పిన నేర్పరి కొవ్వలి లక్ష్మీనరసింహారావు.వ్యావహారిక భాషకు,సహజ సంభాషణా శైలికి నవలా రచనలో కొత్త ఒరవడి దిద్దిన విశిష్ట కథకుడు. ఆ నవలలలోని ఇతివృత్తాలన్నీ మామూలు కుటుంబాల కథలు. ఆ గాథలనే తవ్వి పాఠకులను తన్మయులను చేసిన ధన్యజీవి. అదేపనిగా కథలు రాశారు.భీష్మప్రతిజ్ఞపూని వెయ్యిన్నొక్క నవలలు జాతికి అందించాడు. నవల అనగానే నిన్నటి మొన్నటి తరాలకు గుర్తుకు వచ్చేవారిలో కొవ్వలి స్థానం ప్రత్యేకమైంది. అంతగా రాశిలో రాసి వాసికెక్కడం అంత సులభం కాదు. అది కొవ్వలికే చెల్లింది. మధ్యతరగతి స్త్రీల పట్ల ఆయనకు మమకారం ఎక్కువ. వారి సమస్యలకు, బాధలకు, కష్టాలకు, కన్నీళ్లకు కరిగి నీరైపోయేవారు. వారిలో తల్లిని, చెల్లిని, అక్కను, అత్తను, వదినను, స్నేహితురాలిని చూసుకొనేవారు. ఆ కరిగిన గుండెల మాటున ఆయనకు కథలు పుట్టేవి. ఆ కథలు నవరసాలను పండించాయి. “నా చిన్నతనంలో ఏవైనా కొత్త పుస్తకాలు చదవాలన్న ఆసక్తిగలవారి ఇళ్లల్లో మచ్చులపైన, అలమరాల లోపల, ఇంకా చాటుమాటున కొవ్వలి నవలలు నిక్షిప్తమై ఉండేవి. పెద్దవాళ్ళు ఎంత నిఘా పెట్టినా,పడుచుప్రాయం వాళ్ళు,నాటి తరంవాళ్ళు ఈ నవలలన్నీ తెగచదివేవారు. చదివినవారు వాటిని కథలు కథలుగా పదిమందికి చెప్పేవారు. కొత్త పెళ్లికూతురు తన పెట్టెలోని పట్టుచీర మడతల్లో కొవ్వలి నవలలు ఉంచుకొని అత్తారింటికి వెళ్లేవారు”. ఈ వాక్యాలు అన్నది ఒకప్పటి ప్రఖ్యాత సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యశర్మ
Also read: దేశానికి దిశానిర్దేశం చేసిన దీపస్తంభం పీవీ
1935లో తన 23వ ఏటనే కొవ్వలి మొట్టమొదటి నవల రాశారు. దానిపేరు ‘పల్లెపడుచులు’. ఆయన రచనల్లో పఠనాసక్తిని పెంచే దినుసులు బోలెడు ఉన్నాయి. నాటకీయత, సున్నితమైన హాస్యం, సజీవమైన శైలి, సమాజ శ్రేయస్సుకు దోహదం చేసే సందేశం మొదలైనవన్నీ నిండుగా మెండుగా ఉంటాయి. గుడిపాటి వెంకటాచలం (చలం) ప్రభావం తెలుగు నవలపైన ఎంతఉందో చెప్పడానికి మొట్టమొదటగా ఉదాహరించాల్సిన నవలలు కొవ్వలివారివే అని ప్రసిద్ద సాహిత్య విమర్శకులు ఆర్ ఎస్ సుదర్శనం అన్నారు. ఆ మాటలు అక్షర సత్యాలు. ఆ కాలంలో, రైలు ప్రయాణాల్లో కాలక్షేపం కోసం చదువుకొనే నవలలోనూ కొవ్వలివారివే మొదటివరుస. సుమారు 60 నుంచి 80 పేజీల నిడివిలో ఉండే ఆ నవలలు కేవలం కాలక్షేపం బఠాణీలు కావు. వేల బతుకుకథలు చెప్పి, బతకడం నేర్పించే బతుకు గీతోపదేశాలు. వరకట్న బాధలు, అత్తగారి హింసలు, సవతి తల్లి పెట్టే బాధలు, వంచకుల కపటనాటకాలు, నిరుద్యోగుల యాతనలు, దగాకు గురైన అతివల దీనగాథలు, సంప్రదాయం మాటున చాదస్తాలు, నాగరికత ముసుగులో కుసంస్కారాలు.. ఇట్లా ఎన్నో సమకాలీన అంశాలకు దర్పణాలుగా ఆ నవలలు నిలిచేవి.
Also read: మహమ్మారి మూడో మృదంగం
వస్తువైవిధ్యం ఎక్కువ
వేయిన్నొక్క కథల్లో వస్తు వైవిధ్యం కూడా చాలా ఎక్కువ. సినిమాపిచ్చి నుంచి చెల్లని రూపాయి వరకూ కథాంశాలుగా ఉంటాయి.”కల్పనా సాహిత్యం గ్రాంథిక భాష నుంచి వ్యావహారిక భాషాశైలికి మారిన ఘట్టంలో గణనీయమైన దోహదం చేసిన రచనలుగా కొవ్వలి నవలలను గుర్తించాలి” అని ప్రఖ్యాత కథకుడు మధురాంతకం రాజారాం ఏనాడో చెప్పారు. సినిమా రంగంలోనూ కొవ్వలి కాలుపెట్టారు. ఆయన రాసిన ‘సిపాయి కూతురు’ అదే పేరుతో సినిమాగా వచ్చింది. ‘శాంతి’ సినిమాకు కథను అందించడంతో పాటు మాటలు కూడా రాశారు. మాటలు ఇవ్వడమే కాక, ఒక చిన్న పాత్రను కూడా పోషించారు. వీరి నవలలన్నింటినీ ఒకచోటకు తెచ్చే ప్రయత్నాలు విశ్వవిద్యాలయాలు చెయ్యాలి. భాషాసాహిత్య విద్యార్థులతో పాటు సామాజిక శాస్త్రం అధ్యయనం చేసేవారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. లెక్కలేనన్ని పరిశోధనలు చేయించవచ్చు. అంత సరుకు, సామగ్రి అందులో ఉన్నాయి. నిన్నమొన్నటి తరాల వరకూ ఎందరిలోనో పఠనాసక్తిని, ఊహాశక్తిని పెంచిన నవలా నిర్మాత కొవ్వలి లక్ష్మీనరసింహారావు. ఆయన రచనల్లో జానపదాలు,డిటెక్టివ్ లు కూడా ఉన్నాయి. ఆయన వెయ్యో నవలపేరు ‘ మంత్రాలయ’. వేయిన్నొకటి ‘కవి భీమన్న’.ఇంతటి విస్తృతి వారి వస్తు నిర్దేశంలో ఉంది. కొవ్వలివారు 1975లో వెళ్ళిపోయారు.వెళ్లిపోయి నాలుగు దశాబ్దాలు దాటినా, వారి రచనలు దశబ్దాలపాటు నిలిచే ఉంటాయి. తెలుగుభాషను వెలిగించుకొనే క్రమంలో కొవ్వలివంటి వారిని మరువరాదు.
Also read: కశ్మీర్ మంచు కరిగేనా?