- పద్య పౌరుషులు, ఆశుకవితాశిఖామణులు
- వారి వేగం అసాధారణం, అనితరసాధ్యం
సోదరులలో అగ్రజుడు, అన్నింటా అగ్రజుడు వేంకట సుబ్బరాయకవి పుట్టినరోజు. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గరలోని కొప్పరం వీరి జన్మస్థానం, అది పచ్చి పలనాటి సీమ. కొండవీటి లలామ. తెలుగు సాహిత్య క్షేత్రంలో, కావ్యప్రజ్ఞా ధురీణులు ఎందరో ఉన్నారు. అవధాన ప్రతిభామూర్తులు కొందరే ఉన్నారు. కావ్యప్రజ్ఞ, అవధానప్రజ్ఞ రెండూ కలగలిసి ఉన్నవారు చాలా తక్కువమంది ఉన్నారు. ఆశువుగా ప్రబంధబంధురమైన కవిత్వాన్ని సృజియించినవారిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. శ్రీనాథుడు, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ, రామరాజభూషణుడు, కంకంటి పాపరాజు వంటి మహాకవులు కూర్చొని కావ్యాలు రాసిన చరిత, ఆశువుగా పద్యాలను కురిపించిన ఘనత బహుప్రసిద్ధం. వీరిలో, ‘శత లేఖినీ పద్య సంధాన ధౌరేయుడు’గా రామరాజభూషణుడు కీర్తినీయుడు. శ్రీనాథుడి చాటువులు, తెనాలి రామకృష్ణ సమస్యా పూరణలు, అల్లసాని పెద్దన, భట్టుమూర్తి (రామరాజభూషణుడు) ఆశు పద్యమాలికలు పద్య జగత్ ప్రసిద్ధం. ఈ మహనీయుల సారస్వత వారసత్వ మహత్వాన్ని నూటికి నూరుపాళ్ళు పునికిపుచ్చుకున్నవారు కొప్పరపు కవులు.
ఆశుప్రబంధ నిర్మాతలు
ధార, ధారణా సంవిధానమైన అవధాన ప్రజ్ఞ, ఆశుప్రబంధ నిర్మాణ కౌశలము, దృశ్య, శ్రవ్య కావ్య రచనా ప్రౌఢిమ కొప్పరపువారిలో పుష్కలంగా ఉన్నాయని, వారి సృజన, చరిత్ర ఎరిగిన వారందరికీ బాగా ఎరుక. నన్నయ్య నుంచి నేటి వరకూ కవితా జీవితములను పరికిస్తే కొప్పరపు కవులంతటి వేగంగా పద్యాలను చెప్పినవారు ఇంతవరకూ ఎవరూ లేరన్నది చరిత్ర విదితం. ఆ వేగం కూడా అసాధారణం, అనితర సాధ్యం. అది మనోజవం, మారుత తుల్య వేగం. ఇటు అవధాన ప్రదర్శనలోనూ, అటు ఆశుకావ్య నిర్మాణంలోనూ సమప్రతిభ కలిగిన అసములు, అంబా బలోద్ధతులు ఈ కవి సోదరులు. వీరిరువురూ హనుమ, దుర్గాదేవి ఉపాసకులు. ఆ వేగం,ఆ తేజం, ఆ దేవతా కృపాబల సందీప్తంగానే వారు భావించారు. పుట్టుకతో జనియించిన ప్రతిభ, కవితామయ హృదయానికి అభ్యాసం జోడించి, అద్భుత పాండితీగరిమతో అనన్య సామాన్యమైన ఆశుకవితా ప్రజ్ఞను ప్రదర్శించి, అవధాన, ఆశుకవితా రంగాలలో అగ్రేసరులుగా కొప్పరపు సోదరులు విరాజిల్లారు. వారి పద్య ప్రదర్శన జగదాశ్చర్యకరమని, నాటి సమకాలీన మహాకవి, పండితులంతా వేనోళ్ల పొగిడారు.
Also read: గుజరాత్ పై బీజేపీ గురి
ప్రతిపద్యమూ ప్రబంధమే
‘అవధానాలలో, ఆశువుగా చెప్పే పద్యాలలో కవిత్వాంశ పెద్దగా ఉండదు’ అనే మాటను ప్రతి క్షణం పూర్వ పక్షం చేసిన మనీషామూర్తులు కొప్పరపు కవులు. ఆశువుగా చెప్పినా, కూర్చొని రాసినా, వారి ప్రతి పద్యమూ రసవత్ బంధురమే, రసప్రబంధమే. వారి శతక రచనలోనూ ప్రబంధ ధోరణి ఆణువణువునా కనిపిస్తుంది. రోజుకొక శతావధానం అనేక సార్లు చేశారు. ఓకే రోజు రెండేసి శతావధానాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కుశలవ నాటకాన్ని పద్యాలు, సంభాషణలతో ‘సాధ్వీ మాహాత్మ్యము’ పేరుతో రచించారు. కృష్ణ పరమాత్ముని కరుణ ఎంత గొప్పగా ఉంటుందో, అది ఎంతమంది జీవితాలకు వెలుగువెన్నెలలు పంచిందో ‘శ్రీకృష్ణ కరుణా ప్రభావము’ అనే కావ్యంలో రసరమ్యంగా చూపించారు. వారి వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక సంఘటనను కథా వస్తువుగా తీసుకొని ‘దైవసంకల్పము’ అనే అలఘు కావ్యాన్ని సృష్టించారు. అన్నయ్య వేంకట సుబ్బరాయకవి ఒక సందర్భంలో చెప్పిన ‘సుగుణ సముదాయ పున్నయ సుబ్బరాయ’ అనే మకుటాన్ని తీసుకొని, తమ్ముడు వేంకటరమణకవి ‘శ్రీ సుబ్బరాయ శతకము’ రాశారు. ఈ శతక రచనా శిల్పం పూర్వకవుల శిల్పానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. శతక రచనా మర్యాదలను కాపాడుతూనే,కావ్య శోభతో అలరారే పద్యాలను అల్లాడు.
Also read: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు సమంజసమే
పద్యాలన్నీ శుభసుగంధభరితాలే
నాటి మహాకవుల రచనలపై చేసిన సమీక్షలు,ఉత్తరాలు,దరఖాస్తులు, స్మృతులు, స్తుతులు, వివిధ సందర్భాల్లో రాసిన, చెప్పిన పద్యాలన్నీ శుభ సుగంధాలను విరజిమ్ముతూ ఉంటాయి. ,ప్రేక్షకులు, ప్రాశ్నికుల కోరిక మేరకు ప్రదర్శనలో వేగాన్ని ఎంచుకొనేవారు. ఇంత సమయంలో, ఇన్ని పద్యాలు చెబుతారా అని ఎవరైనా అడిగినప్పుడు, ఎంత వేగంగా పద్యాలు చెబుతారో చూద్దాం అని ఎవరైనా సవాలు విసిరినప్పుడు, ఆ కవితా వేగంలోని ముచ్చటను అనుభవించి, అస్వాదిద్దామని ఎవరైనా కోరినప్పుడు తదనుగుణంగా కొప్పరపు కవులు తమ వేగాన్ని ప్రదర్శించేవారు. సమయాలలో, సమయోచితంగా వ్యవహరించేవారు. వారు మాట్లాడుతూ ఉంటే, ఎన్ని గంటలు గడిచిపోయిందో తెలిసేది కాదు. రవాణా సదుపాయాలు లేని ఆ కాలంలోనే కొన్ని వేలమంది వారి సభలకు వెళ్లేవారు. స్పష్టమైన ఉచ్చారణ, ఖంగు ఖంగుమనే కంఠస్వరం, వేదనాదం వలె వాగ్ఝరి, ప్రాసంగిక శ్లోకములు, పద్యములు, ఛలోక్తులు, ఉక్తి వైచిత్రితో వారి సాహిత్య సభలు సరస వినోదినీ వేడుకలుగా సాగేవి. నాటి సమకాలిక మహామహుల ఆత్మకథలు, జీవిత చరిత్రలు, పత్రికలలో ఆ విశేషాలన్నీ లిఖితమై ఉన్నాయి.వారికి నిత్యమూ సారస్వత సభలే.తీరికే ఉండేది కాదు. అటు గద్వాల్ – ఇటు చెన్నపట్టణం అన్నట్లు, కుగ్రామం నుంచి మహానగరాల వరకూ కొన్ని వందల ప్రాంతాలలో,వేల సభల్లో, లక్షల కొద్దీ పద్యాలు చెప్పారు.
Also read: ఏ విలువలకీ ప్రస్థానం?
విధి ఆడిన నాటకం
వయసు కాస్త మళ్ళిన తర్వాత, ఆ సభలు,సమావేశాల జోరు కొంత సద్దుమణిగాక, మహాకావ్య రచనలపై దృష్టి సారిద్దామనుకున్నారు. కానీ, విధి ఆడిన నాటకంలో, నాలుగు పదుల వయస్సులోనే తనువు చాలించారు. సోదర కవులలో పెద్దవారైన వేంకటసుబ్బరాయకవి 46ఏళ్లకే వెళ్లిపోయారు. తమ్ముడు వేంకట రమణ కవి ఐదు పదులు దాటే వరకూ జీవించి వున్నా, అన్నగారి అకాల మరణానికి కలత చెంది అస్త్ర సన్యాసం చేశారు. మహాకావ్య రచనలపై దృష్టి సారించే మానసిక ప్రకృతికి ఆయన దూరమయ్యారు. కవులు మరణించే నాటికి వారి సంతానం చాలా చిన్న పిల్లలు. సోదర కవుల కవితా సంపదను వారు కాపాడలేకపొయ్యారు. శిష్యులు, ప్రశిష్యులు ఉన్నప్పటికీ, వారికి ఆ దృష్టి పెద్దగా లేదు. ప్రదర్శనలను రికార్డ్ చేసే ఆడియో, వీడియో సాంకేతికత కూడా ఆనాడు అందుబాటులో లేదు. అటువంటి అనేక లౌకిక, అలౌకిక కారణాల వల్ల ఆ అనంత కవితా సంపదను సంపూర్ణంగా తెలుగుజాతి పొందలేక పోయింది. 1913నాటికే దైవసంకల్పం, సాధ్వీ మాహాత్మ్యమం, శ్రీకృష్ణ కరుణా ప్రభావం కావ్యాలు సంపూర్ణమైనట్లు గుంటూరుకు చెందిన మహాపండితుడు మిన్నికంటి గురునాథశర్మ ‘కొప్పరపు కవుల పరిచయం’ పీఠికా వ్యాసంలో వివరించారు. 1916కే కొప్పరపు కవులు ఆశువుగా చెప్పిన పద్యాల సంఖ్య మూడు లక్షలకు పైగా ఉంటుందని లక్కవరం రాజా మంత్రిప్రగడ భుజంగరావు బహద్దర్ తన ‘ఆధునిక కవిజీవితములు’ పుస్తకంలో రాశారు.
Also read: దిల్లీకి జబ్బు చేసింది!
బూదరాజు విన్నంతకన్నంత
సోదర కవులు తెల్లవారు ఝామున లేచి, తాము రచించిన ‘భాగవతం’లోని పద్యాలు చదువుతూ ఉండగా విన్నామని, తన మాతామహులు చెప్పినట్లుగా సుప్రసిధ్ధ పాత్రికేయ గురువు, భాషాశాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ ‘విన్నంత కన్నంత’ పుస్తకంలో తెలిపారు. కాళ్ళకూరి నారాయణరావు, కొమర్రాజు లక్ష్మణరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, అయ్యదేవర కాళేశ్వరరావు, తల్లావజ్ఝల శివశంకరస్వామి వంటి నాటి మహనీయుల ఆత్మకథల్లో కొప్పరపువారి గురించిన విశేషాలు ఎన్నో దొరుకుతాయి. ఆంధ్రపత్రిక, భారతి వంటి నాటి పత్రికలలోనూ కొన్ని వివరాలు నిక్షిప్తమై ఉన్నాయి. మహనీయులెందరో కొప్పరపుకవుల సభల్లో పాల్గొని,ప్రత్యక్షంగా ఆ ప్రతిభను దర్శించి,పులకించి, ప్రశంసించి చెప్పిన పద్యాలు కొన్ని వందలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. కేవలం తెలుగువారికే చెందిన ‘అవధాన కళ’కు,’పద్యవిద్య’కు దిట్టమైన పట్టుకొమ్మలుగా నిలిచి,ప్రాభవం గడించి, తెలుగు పద్య సారస్వతానికి వైభవం అందించిన పద్యపౌరుషులు కొప్పరపు సోదర కవులు. ఈ మహాకవులను గుండెల్లో నిలుపుకుందాం, ఆ పద్య చరణాలను మనసారా కొలుచుకుందాం. అనుజుడై వేంకట రమణ కవి, అగ్రజుడై వేంకటసుబ్బరాయకవి ఒక ఇంట పుట్టడానికి తపమేమిచేసిరో!
Also read: ఆయుర్వేదంలో అధ్యయనం అవసరం
(నవంబర్ 12న కొప్పరపు కవుల జయంతి)