Sunday, December 22, 2024

వివాదంలో ఆర్ఆర్ఆర్ టీజర్

  • కొమరం భీం ముస్లిం టోపి ధరించినట్టుగా సన్నివేశం
  • వివాదస్పద సన్నివేశాలను తొలగించాలని ఆదివాసీల డిమాండ్

ఆర్ఆర్ఆర్ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాం చరణ్ లతో దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ని  కొమరం భీం 119 వ జయంతి సందర్భంగా గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. గోండు వీరుడు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయిన తీరు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

అయితే టీజర్ చివరలో ఎన్టీఆర్ ముస్లిం టోపీ ధరించి కనిపించిన  సన్నివేశమే ఇపుడు వివాదస్పదమవుతోంది. ఆదివాసీ అయిన కొమరం భీంకు టోపీ పెట్టడం ఏంటని ఆదివాసీలు మండిపడుతున్నారు. కొమరం భీం రజాకార్లు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. అలాంటి కొమరం భీంకు ముస్లింలు ధరించే టోపి పెట్టడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొమరం భీంకు క్షీరాభిషేకం

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని కొమరం భీం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి కొమరం భీం యువసేన నేతలు క్షీరాభిషేకం చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమరం భీం అని ఆయన చరిత్రను  పూర్తిగా అర్ధం చేసుకుని సినిమా తీయాలని రాజమౌళిని డిమాండ్ చేశారు. టోపి పెట్టుకున్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కొమరం భీం ప్రతిష్ఠకు భంగం

మన్యం వీరుల చరిత్రను సినిమా పేరుతో మసకబారుస్తున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. కొమురం భీం పాత్రను తక్కువ చేసి చూపిస్తూ …ఆదివాసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మనోభావాలను దెబ్బతీశారంటూ ఆది వాసీ సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణం వివాదస్పద సీన్లు మార్చాలని లేని పక్షంలో రాజమౌళిని కోర్టు కీడుస్తామని కొమరం భీం యువసేన హెచ్చరిస్తోంది.

టీజర్ లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజాం పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా కొమరం భీం పోరాడారనీ, ఆయన కూతురుని అప్పటి ముస్లిం పాలకులు కొంతమంది ఇబ్బంది పెట్టినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని ఆదివాసీ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి చరిత్ర ఉన్న కుమరం భీం పాత్రను ముస్లిం గెటప్ లో చూపించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు తన ట్విట్టర్ ఖాతాలో రాజమౌళిని సున్నితంగా హెచ్చరించారు. చరిత్రను వక్రీకరించడం కరెక్ట కాదని అన్నారు.

అయితే ఇలాంటి విమర్శలు వస్తాయని ముందుగా ఊహించే రాజమౌళి  ఆర్ఆర్ఆర్ పూర్తిగా కల్పిత కథ అని చెప్పారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చరిత్రకు సంబంధించిన పేర్లు పెట్టి కల్పితమని చెబితే జనాలు పట్టించుకోకుండా ఎలా ఉంటారని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తే రాజమౌళి విశ్వసనీయతను కోల్పోతారని  ఆదివాసీలు హెచ్చరిస్తున్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles