- సూపర్ కింగ్స్ కి జడేజా, నైట్ రైడర్స్ కి శ్రేయస్ కెప్టెన్స్ గా మొదటి అవకాశం
- ధోని అర్థశతకం వృథా
- రైడర్స్ లో ముగ్గురు విదేశీయులు, కింగ్స్ లో నలుగురు
ముంబయ్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) పైన కొల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు గెలుపొందింది. శనివారం సాయంత్రం ముంబయ్ వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్ష్యంగా ఉన్న 132 పరుగులను కోల్ కతా నైట్ రైడర్స్ అవలీలగా పూర్తి చేశారు. జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ కి చెందిన శాం బిల్లింగ్స్, కెప్టెన్ శ్రేయస్ లు చివరి వరకూ నిలకడగా ఆడి లక్ష్యాన్ని అందుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డానే బ్రావో అత్యధిక వికెట్లు సాధించి శ్రీలంక స్పిన్నర్ లసిత్ మలింగా రికార్డును సమం చేశాడు. కోలకతా నైట్ రైడర్స్ కు చెందిన శాం బిల్లింగ్స్ వికెట్టు తీసుకున్న దశలో బ్రావో మలింగా రికార్డును చేరుకున్నాడు. బ్రావో వెంకటేశ్ అయ్యర్ నూ, నితీష్ రానానూ పెవిలియన్ కు పంపించిన తర్వాత అజింక్య రహానాను మైకేల్ సాంటర్ పడగొట్టాడు.
అంతకు క్రితం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అర్ధశతకం సాధించాడు. దాంతో చైన్నైసూపర్ కింగ్స్ 131 పరుగుల స్కోరు సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాట్ చేయమని కోరారు. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ పరమ అన్యాయంగా మొదలయింది. రుతురాజ్ గైక్వాడ్ సున్నా స్కోరుకు మొదటి ఓవర్ లోనే పెవెలియన్ కు తిరిగి వచ్చాడు. ఒకాకొన దశలో చైన్నై సూపర్ కింగ్స్ అయిదు వికెట్ల నష్టానికి 61 పరుగుల స్థాయిలో ఉన్నది. అప్పుడు వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ ధోనీ రంగంలో దిగాడు. ధోనీ 50 పరుగులు సాధించగా చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రవీందర్ జడేజా 26 పరుగులు చేశాడు. కేకేఆర్ తరఫున ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, అండ్రే రసెల్ లు చెరో వికెట్టు తీసుకున్నారు.
కేకేఆర్ లో ముగ్గురు విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు. వారు : శాం బిల్లింగ్స్, ఆండ్రే రసెల్, సునీల్ నారినే. సీఎస్ కే నలుగురు విదేశీయులను ఎంపిక చేసుకున్నది. వారు: డెవాన్ కాన్వే, మిచెల్ సాంటర్, డానే బ్రావో, ఆదం మిల్నే. కేకేఆర్ కెప్టెన్ గా శ్రేయస్ ఆడటం ఇదే ప్రథమం. సీఎస్ కే కి రవీంద్ర జడెజా నాయకత్వం వహించడం కూడా ఈ మ్యాచ్ తోనే ప్రారంభం. యునైటెడ్ ఎమిరేట్స్ లో నిరుడు జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో కోలకతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. సూపర్ కింగ్స్ జట్టు గెలిచింది. ఈ సారి తొలి మ్యాచ్ లో కోలకతా నైట్ రైడర్స్ గెలిచారు. చైన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయారు. సీఎస్ కే అయిదు వికెట్ల నష్టానికి ఇరవై ఓవర్లలో 131 పరుగులు చేయగా కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 18.3 ఓవర్లలో 133 పరుగులు చేసి విజయం సాధించింది.